శర్వానంద్ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే..
on Jan 13, 2017
ఈ సంక్రాంతి పండుగ నిజంగా నిండైన సంక్రాంతి పండుగలాగే నిలిచింది. పెద్ద హీరో సినిమా వస్తుందంటే సాధారణంగా చిన్న హీరోలు తమ సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడుతుంటారు. కానీ ఓ యంగ్ హీరో మాత్రం తన సినిమాను రిలీజ్ చేయడానికి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన సినిమాను విడుదల చేయడానికి రెడీ అయ్యాడు. ఒక పక్క తొమ్మిదేళ్ల తరువాత ఇండస్ట్రీలో అడుగుపెట్టి బాస్ ఈస్ బ్యాక్ ట్యాగ్ లైన్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన మెగాస్టార్ 'ఖైదీ నెంబర్ 150' సినిమా.. మరోపక్క డైలాగ్స్ తో అదరగొట్టే బాలయ్య సినిమా 'గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా'. రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాలతో పోటీ పడేందుకు వస్తుంది 'శతమానం భవతి'. శర్వానంద్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శర్వానంద్ ధైర్యాన్ని మెచ్చుకొని నాగార్జున తన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. రెండు పెద్ద హీరోల చిత్రాల నడుమ చిన్న చిత్రాన్ని విడుదల చేయడానికి ఎంతో ధైర్యముండాలని.. శర్వానంద్ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. కాగా గత సంవత్సరం హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్న శర్వానంద్ ఈ ఏడాది కూడా అదే ఫామ్ కొనసాగించాలని చూస్తున్నాడు. చూద్దాం మరి రెండు సినిమాలను దాటి ఈ సినిమా ఎంత వరకూ విజయం సాధిస్తుందో.