ENGLISH | TELUGU  

మదిలో అలజడిరేపే ‘మెంటల్ మదిలో’

on Nov 22, 2017

 

 

తారాగణం:- శ్రీ విష్ణు, నివేథ పెతురాజ్, రేణు, శివాజీరాజా...
సంగీతం:- ప్రశాంత్ ఆర్. విహారి
దర్శకత్వం:- వివేక్ ఆత్రేయ
నిర్మాత:- రాజ్ కందుకూరి


కొన్ని సినిమాలు థియేటర్ నుంచి బయటకొచ్చాక్కూడా వదలవ్. మనతోపాటు ఇంటికొస్తాయ్. పడుకుంటే కల్లోొకస్తాయ్. లేవగానే ‘ఇంకొక్కసారి‘ అనిపించే హ్యాంగోవర్ ని కలిగిస్తాయ్. మళ్లీ థియేటర్ దాకా ఈడ్చుకెళ్తాయ్. కొన్ని రోజులు పాటు మనల్ని హంట్ చేస్తునే ఉంటాయ్. ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాలు అరుదైపోయాయ్ లేండి.

అయితే...రేపు 24న అలాంటి సినిమా ఒకటొస్తుంది. దాని పేరు ‘మెంటల్ మదిలో’.  పేరుకు తగ్గట్టే మెంటలెక్కించేసిందంటే నమ్మండి. ఆ కుర్రాడెవరో కానీ.. వివేక్ ఆత్రేయ అంట. ఏం తీశాడండీ బాబు. ప్రేక్షకుల్ని కూడా కథలో పాత్రధారుల్ని చేసేశాడు. చూస్తున్న ప్రతోడూ... తెరపై తతంగాన్ని చూసి తెగ రియాక్టైపోతున్నాడు. అదేదో వాళ్ల ఇళ్లలోనే జరుగుతున్నట్టు.
మళ్లీ కథగా చెప్పుకుంటే ఏమీ లేదు.

కథ:-

హీరో చంచెల మనస్కుడు. తేలిగ్గా ఒక అభిప్రాయానికి రాలేని తత్వం.  కొనే వస్తువుల్లోనే కాదు.. జీవిత భాగస్వామి విషయంలో కూడా అదే మెంటాలిటీ. దీనికి తోడు ఆడాళ్లంటే చచ్చేంత గిల్టీ. సూటిగా కళ్లలోకి చూసి మాట్లాడలేని ఆశక్తత. ఇన్ని దుర్గుణాలున్నోడికి తేలిగ్గా పెళ్లవుతుందా చెప్పండి?.. దానికి తగ్గట్టే..మనోడికి 29 ఏళ్లొచ్చినా పెళ్లి కాదు. అయితే.. వీడి రొట్టె విరిగి నేతిలో పడి... ఓ అమ్మాయికి నచ్చేస్తాడు. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి. ఈ లోపు నానా తిప్పలు పడి మనోడ్ని కొంతవరకు మార్చుకుంది ఆ అమ్మాయ్. సారి.. ‘మార్చుకున్నాను’... అనుకుంది. కుక్కతోక వంకరని మరచిపోయింది. తర్వాత ఏమైంది? అనేది సెకండాఫ్.

విశ్లేషణ:- 

కథ పరంగా చెప్పుకుంటే చిన్న లైన్ అంతే. అయితే.. ఆ చిన్న లైన్ తోనే జనాలను చెడుగుడాడేశాడు దర్శకుడు. కేరక్టరైజేషన్స్ క్రియేషన్లోనే అతని ప్రతిభ తేటతెల్లం అయ్యింది. హీరో మెంటాలిటీ చుట్టూ కథ నడిచినా.. కథానాయికల రూపంలో రెండు అద్భుతాలను సృష్టించాడు. రెండు పాత్రలూ ఆకాశమంత ఎత్తులో కనిపిస్తాయ్.

దర్శకుడు వివేక్ ఆత్రేయ.. కె.బాలచందర్ భక్తుడిలాగా ఉన్నాడు. చాలా సందర్భాల్లో ఆయన్ను గుర్తుచేశాడు. ముఖ్యంగా కేరక్టరైజేషన్స్. బాలచందర్ హీరోయిన్లు పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో ఉంటారు. ఇందులో కూడా అంతే.. ఇద్దరు హీరోయిన్లు హీరోకు అందనంత ఎత్తులో కనిపిస్తారు. భావగర్భితమైన మాటలు.. చేతలు.. అన్నీ బాలచందర్ కథానాయికల పోకడల్లే. కొన్ని షాట్స్ విషయంలో అయితే.. బాలచందర్ ను గుడ్డిగా ఫాలో అయిపోయాడు వివేక్. ప్రేక్షకుల హృదయాల్లో కిలోలకొద్దీ బరువు పడేశాడు. ఇంటికెళ్లాక కూడా ఆ బరువు అలాగే ఉంటుంది..

ఇక హీరో.. శ్రీవిష్ణు. అంతకు ముందు తను చేసిన పాత్రలతో పోల్చి చూస్తే.. చాలా బాగా చేశాడు. అయితే.. ఏదో తెలీని లోటు .హీరోయిన్లు నివేథ పెతురాజ్, రేణు ఇద్దరు ఇద్దరే. నటనలో పోటీ పడ్డారు. ఉత్తర దక్షిణ దృవాల్లాంటి పాత్రలతోొ అదరగొట్టేశారు. శివాజీరాజా చాలారోజుల తర్వాత మంచి  పాత్ర పోషించాడు. మిగిలన పాత్రధారులంతా బాగానే చేశారు. సాంకేతికంగా కూడా వేలెత్తి చూపించడానికి ఏమీ లేదు. అన్ని విభాగాలూ అద్భుతంగా పనిచేశాయ్. 

చివరిగా చెప్పేదేంటంటే... రేపు 24న రానున్న ఈ సినిమా హిట్ అవుతుందా. లేక సూపర్ హిట్ అవతుందా? అనేది చెప్పలేం కానీ.. జనం మెచ్చే సినిమా అవ్వడం మాత్రం ఖాయం. ఓ సినిమాకి కథ అవసరం లేదు క్యారెక్టరైజేషన్ చాలు అని నమ్మే ప్రతి నవతరం దర్శకుడికీ ‘మెంట్ మదిలో..’ ఓ పాఠం.

రేటింగ్:- 3/5


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.