నన్నెందుకు ఇలాంటి మంచి సినిమాల్లో తీసుకోరు?.. జగపతిబాబు ఆవేదన!
on Oct 29, 2020
కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుహాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ డెబ్యూ డైరెక్టర్ సందీప్ రాజ్ రూపొందించిన 'కలర్ ఫొటో' మూవీ ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలై వీక్షకాదరణతో పాటు విమర్శకుల ప్రశంసల్నీ అమితంగా పొందుతోంది. 'హృదయ కాలేయం', 'కొబ్బరిమట్ట' చిత్రాలను తీసిన సాయిరాజేశ్ నిర్మించిన ఈ సినిమాని ఇష్టపడుతున్న వారి జాబితాలో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా చేరుతున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లో సీనియర్ యాక్టర్ జగపతిబాబు చేరారు. గురువారం తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా 'కలర్ ఫొటో'పై ప్రశంసల జల్లు కురిపిస్తూనే, ఇలాంటి చక్కని సినిమాల్లో తనను ఎందుకు తీసుకోవట్లేదని ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
"కలర్ ఫొటో నన్ను పూర్తిగా ఇంప్రెస్ చేసింది. సూపర్ కిడ్ తన వయసుతో పోలిస్తే గొప్పగా ఈ సినిమాని తీశాడు. గుడ్ యాక్టర్ అయిన సుహాస్ హీరోగానూ ప్రూవ్ చేసుకున్నాడు. ఒక వ్యక్తిగా నేనెంతో ఇష్టపడే కాలభైరవ మ్యూజిక్‌లోని సెన్సిబిలిటీస్ నన్నెప్పుడూ ఇంప్రెస్ చేస్తుంటాయి. సినిమాని హిట్ చేసేవి డబ్బులు (బడ్జెట్), స్టారడమ్ మాత్రమే కాదని.. సినిమా హిట్టవడానికి కావాల్సినవి హృదయం, ఆత్మ అని మరోసారి ప్రూవ్ అయినందుకు నాకు ఆనందంగా ఉంది." అని ఆయన రాసుకొచ్చారు.
క్రియేటివిటీ, నాచురాలిటీ విషయంలో కుర్రాళ్లు చాలా ముందుంటుండం చూస్తుంటే ఇక్కడ తానేం చేస్తున్నానో చూసుకొని ఎక్కువసార్లు ఆశ్చర్యపోతుంటానని జగపతిబాబు అన్నారు. "ఇలాంటి సినిమాల్లో భాగమవడాన్ని నేను గర్వంగా ఫీలవుతానని చెప్తాను. బాధాకరమైన విషయమేమంటే ఇలాంటి సినిమాలకు నన్ను తీసుకోరు.. నేను ఇలాంటివి చేయననుకుంటారో లేక నా రేటును భరించలేమనుకుంటారో.. నన్ను పరిగణనలోకి తీసుకోరు. ఆ రెండూ నిజం కావు కుర్రాళ్లూ.." అని తన బాధను వ్యక్తం చేశారు జగపతిబాబు.
ఆయన మాటలను బట్టి 'కలర్ ఫొటో' మూవీ ఆయనను ఎంతగా ఇంప్రెస్ చేసిందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఆయన వ్యక్తం చేసిన ఆవేదనను, అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని మంచి మంచి కాన్సెప్టులతో సినిమాలు తీసే యంగ్ డైరెక్టర్స్ ఆయనను తమ ప్రాజెక్టుల్లో భాగం చేస్తారో, లేదో చూడాలి.
Also Read