సినిమా పేరు: క్రాక్
తారాగణం: రవితేజ, శ్రుతి హాసన్, సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్, దేవీప్రసాద్, చిరగ్ జాని, మౌర్యని, సుధాకర్ కొమాకుల, వంశీ చాగంటి
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
పాటలు: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: జి.కె. విష్ణు
కూర్పు: నవీన్ నూలి
ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
నిర్మాత: బి. మధు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
బ్యానర్: సరస్వతి ఫిలిమ్స్ డివిజన్
విడుదల తేదీ: 9 జనవరి 2021
రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన మూడో సినిమా 'క్రాక్'. ఇదివరకు వారు కలిసి పనిచేసిన 'డాన్ శీను', 'బలుపు' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడంతో, 'క్రాక్' వారికి హ్యాట్రిక్ మూవీ అవుతుందనే ప్రచారం బాగా జరిగింది. నిజానికి ఆ రెంటికి మించి ఈ మూవీ పెద్ద హిట్టవుతుందనే ఆశాభావం వ్యక్తమవుతూ వచ్చింది. విడుదల చేసిన పాటలు, ట్రైలర్ ఈ సినిమాపై బజ్‌ను బాగా పెంచాయి. నిర్మాత మధు మునుపటి సినిమాల తాలూకు ఆర్థిక సమస్యలు చుట్టుకోవడంతో ఉదయం 8:45 ఆటతో విడుదల కావాల్సిన 'క్రాక్' రాత్రి 10 గంటల తర్వాత రెండో ఆట సినిమాతో మొదలవడం గమనార్హం.
కథ
క్రాక్ అనేది నిఖార్సైన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పోతరాజు వీరశంకర్ (రవితేజ) కథ. అవతలి వాడు ఎంతటివాడైనా, నేరం చేస్తే వదిలిపెట్టని ఫెరోషియస్ అండ్ డేరింగ్ ఇన్స్పెక్టర్. అతగాడికి భార్య కల్యాణి (శ్రుతి హాసన్), ఓ కొడుకు ఉంటారు. ఏ పోలీస్ స్టేషన్లో పనిచేస్తే, ఆ స్టేషన్ పరిధిలోని క్రిమినల్స్‌ను ఓ ఆట ఆడేస్తుంటాడు వీరశంకర్. అట్లా ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా వచ్చినప్పుడు ఇంకా పెళ్లికాని ఒక యంగ్ కానిస్టేబుల్‌ను ఒంగోలును మకుటంలేని మహారాజుగా ఏలుతుండే కఠారి కృష్ణ (సముద్రకని) అనే నేరగాడు చంపిస్తే, అతడిని వీరశంకర్ ఎలా ఎదుర్కొని కటకటాలపాలు జేశాడనేది ప్రధానాంశం.
ఎనాలసిస్ :
సీనియర్ స్టార్ వెంకటేశ్ వాయిస్ ఓవర్‌తో 'క్రాక్' సినిమా మొదలవుతుంది. ఓ రోడ్డుమీద ఓ యాభై రూపాయలనోటు, దానిపై ఓ మామిడిపండు, ఆ మామిడిపండుకు గుచ్చిన ఓ మేకు కనిపిస్తాయి. "జేబులో ఉండాల్సిన నోటు, చెట్టుకుండాల్సిన కాయ, గోడకుండాల్సిన మేకు.. ఈ మూడూ ముగ్గురు తోపుల్ని తొక్కి తాట తీశాయ్. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే పోలీసోడు" అని చెప్తుంది వెంకటేశ్ వాయిస్. సలీమ్ భక్తల్ (చిరగ్ జాని) అనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జైలులో ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ఓ యాభై రూపాయల నోటు తన జీవితాన్ని ఎలా మార్చి, జైల్లో కూర్చోబెట్టిందో చెప్పినప్పుడు మనకు పోతరాజు వీరశంకర్ పరిచయమవుతాడు.
ఆ తర్వాత వంతు మామిడికాయతో సంబంధం ఉన్న కడప కొండారెడ్డి (రవిశంకర్)ది. తన కాంపౌండ్‌లోని చెట్టు నుంచి ఓ కాయను కోసుకోవాలని ప్రయత్నించిన ఓ చిన్న పాపను బాగా బలిసిన తన రెండు కుక్కలతో కరిపించిన అతగాడు ఎస్పీ సూచన మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లి, అక్కడ వంటలు చేస్తూ కనిపించిన కఠారి కృష్ణ (సముద్రకని)ని కలిస్తే, అతడు వీరశంకర్ ఎలా తన జీవితంతో ఆడుకున్నాడో, ఓ మేకు తనను ఎలా అతడికి పట్టిచ్చిందో వివరిస్తాడు. సినిమాలో ప్రధానమైంది కఠారి కృష్ణ కథే. సలీమ్ భక్తల్, కొండారెడ్డివి ఉపకథలు.
కఠారి కృష్ణ, వీరశంకర్ మధ్య యుద్ధం ఎందుకు ఎలా మొదలై, ఎలా పరాకాష్ఠకు చేరుకొని, కృష్ణ ఎలా జైలు పాలయ్యాడో తెలిపే సన్నివేశాలను డైరెక్టర్ గోపీచంద్ మలినేని పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో రాసుకున్నాడు. ప్రేక్షకుడిలో భావోద్వేగాలను రేపెట్టే రీతిలో ఎక్కడా బోర్ కొట్టించకుండా సన్నివేశాలను మలిచాడు. ఆ సన్నివేశాల్లో అత్యధిక భాగం యాక్షన్ సన్నివేశాలే. కానీ అవి రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తాయి. కథలో కొత్తదనమేమీ లేకపోయినా.. సినిమా ఆసాంతం మనల్ని కుర్చీల్లో కదలకుండా కూర్చొబెట్టేవి ఒక దాని తర్వాత ఒకటిగా వచ్చే యాక్షన్ సన్నివేశాలు, వాటికిచ్చే లీడ్. ఈ విషయంలో సీనియర్ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ డైరెక్టర్‌కు గొప్పగా ఉపయోగపడ్డారు.
డైరెక్టర్ ప్రకాశం జిల్లా వాడు. ఆ నేపథ్యంతో సినిమాలో ఆ జిల్లాలోని పలు ప్రాంతాలను 'క్రాక్' సినిమా కోసం వాడుకున్నాడు. కఠారి కృష్ణను ఒంగోలును ఎలా ఏలుతున్నాడో చూపించిన అతను, క్లైమాక్స్‌కు వేటపాలెం దగ్గర సముద్రతీరాన్ని ఎంచుకున్నాడు. కఠారి కృష్ణ చేసే నేరాల్లో గాడిద నెత్తురు తాగి, మనుషుల నెత్తుటిని కళ్లజూసే అత్యంత కిరాతకుల బ్యాచ్ ఉండేది ఈ వేటపాలెంలో అన్నట్లు చూపించాడు. ఆ కిరాతకులతో చేయించే ఘోరాలను రామ్-లక్ష్మణ్ డిజైన్ చేసిన విధానం మన ఒంటిని జలదరింపజేస్తుంది. 'క్రాక్' హైలైట్స్‌లో ఆ కిరాతకులు చేసే హత్యలు, హత్యాయత్నం సీన్లు ముందుంటాయి. ఇక అప్సరా రాణితో చేయించిన 'భూమ్ బద్దల్' స్పెషల్ సాంగ్‌లో చిన్నగంజాం పేరు వస్తుంది. ఆయా సన్నివేశాల్లో అద్దంకి, కందుకూరు, టంగుటూరు లాంటి ప్రదేశాల పేర్లు వినిపిస్తాయి. ఇలా తన జిల్లామీద, అక్కడి ప్రదేశాల మీద తన అభిమానం చూపించాడు దర్శకుడు గోపీచంద్.
చాలా ఏళ్ల క్రితం ఒంగోలులో నిజంగా జరిగిన ఘటనల స్ఫూర్తితో ఈ కథను గోపీచంద్ రాసుకున్నాడు. కఠారి కృష్ణ పాత్రకు స్ఫూర్తి అక్కడి ఒకప్పటి క్రిమినలే. వేటపాలెం క్రిమినల్స్ బ్యాచ్ గాడిద రక్తం తాగే సీన్ చూస్తే మనకు ఒళ్లు జలదరిస్తుంది. ఇరవై ఏళ్ల క్రితం దాకా అలా గాడిద నెత్తురు తాగే వాళ్లు ఆ పరిసర ప్రాంతాల్లో నిజంగానే ఉండేవాళ్లు.
యాక్షన్ సన్నివేశాలతో పాటు సినిమాకు బలంగా నిలిచినవి సాయిమాధవ్ బుర్రా రాసిన సంభాషణలు, తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్, జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, ఎ.ఎస్. ప్రకాశ్ ఆర్ట్ వర్క్. ఈ టెక్నీషియన్లు తమ బాధ్యతల్ని చాలా బాగా నిర్వర్తించారు. విష్ణు సినిమాటోగ్రఫీ సూపర్బ్. యాక్షన్ ఎపిసోడ్స్‌లో అయితే అతడి కెమెరా చెలరేగిపోయింది. వాటికి తమన్ ఇచ్చిన బీజీయం అదిరిపోయింది. ఇవాళ తెలుగు చిత్రసీమలో చాలామంది డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ డైలాగ్ రైటర్ అయిపోయాడు సాయిమాధవ్. వారిని అతను నిరుత్సాహపర్చడం లేదు.
పలు సన్నివేశాల్లో ఎవడైనా "నా బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?" అంటే చాలు.. ఉద్రేకంతో ఊగిపోయి వాడి తాటతీసేదాకా ఊరుకోనివాడిగా రవితేజను చూపించడం బాగుంది. వీరశంకర్ 'క్రాక్'గా మారేది అప్పుడే మరి!
ప్లస్ పాయింట్స్
రవితేజ, సముద్రకని పోటాపోటీ నటన
ఒళ్లు గగుర్పాటు కలిగించే యాక్షన్ ఎపిసోడ్స్
పకడ్బందీ స్క్రీన్‌ప్లే
టాప్ క్లాస్ బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్
మైనస్ పాయింట్స్
కథలో కొత్తదనం లేకపోవడం
హింస ఎక్కువవడం
హాయిగా నవ్వుకొనే సన్నివేశాలు తక్కువవడం
నటీనటుల పనితీరు
టైటిల్ రోల్లో పోతరాజు వీరశంకర్‌గా రవితేజ విశ్వరూపం ప్రదర్శించాడు. పూర్తి మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్లో తనకు అచ్చొచ్చే క్యారెక్టరలో రవితేజ చెలరేగిన తీరు పూర్వ వైభవాన్ని గుర్తుకు తెచ్చే విధంగా ఉంది. చాలా సునాయాసంగా వీరశంకర్ పాత్రలో ఆయన పరకాయప్రవేశం చేశాడు. డైలాగ్స్ చెప్పడంలో, ఫైట్లు చేయడంలో ఆయనలో ఒక ఊపు కనిపించింది. శ్రుతి హాసన్‌తో రొమాంటిక్ సీన్స్‌లోనూ రవితేజ బాగా అలరించాడు. చాలా రోజుల తర్వాత ఆయనకు తగ్గ క్యారెక్టర్‌ను డైరెక్టర్ ఇచ్చాడనిపిస్తుంది. తన భుజాలపై రవితేజ ఈ సినిమాని మోసుకెళ్లాడనేది ఎంత నిజమో, అతడికి సరిజోడీ అన్నరీతిలో విలన్ కఠారి కృష్ణగా సముద్రకని సైతం విజృంభించి నటించాడు. ఆయనలో ఎలాంటి నటుడున్నాడో ఈ సినిమా మరోసారి చూపించింది. రవితేజ కాంబినేషన్ సీన్లలో ఎంత ఫెరోషియస్‌గా అతను అభినయం ప్రదర్శించాడో, ప్రీ క్లైమాక్స్‌లో వరలక్ష్మితో వచ్చే సన్నివేశంలో ప్రేమను వ్యక్తంచేసే సీన్లోనూ అంతబాగా నటించాడు.
వీరశంకర్ భార్య కల్యాణిగా శ్రుతి హాసన్ బాగా నప్పింది. రవితేజతో కెమిస్ట్రీని బాగా పండించింది. ఓ యాక్షన్ సీన్లో శివంగిలా క్రిమినల్స్‌పై విరుచుకుపడి ఆకట్టుకుంది. కృష్ణ ఉంపుడుగత్తె జయమ్మగా లేడీ విలన్ రోల్‌ను వరలక్ష్మి చక్కగా చేసింది. పలు సీన్లలో ఆమె హావభావాలు ఆకట్టుకుంటాయి. టెర్రరిస్ట్‌గా చిరగ్జాని, కొండారెడ్డిగా రవిశంకర్, పోలీస్ పాత్రల్లో దేవీ ప్రసాద్, వంశీ చాగంటి, సుధాకర్ కొమాకుల పాత్రోచితంగా నటించారు. రవితేజ-శ్రుతి కొడుకుగా డైరెక్టర్ గోపీచంద్ కొడుకు కూడా ఆకట్టుకున్నాడు. అతడికి తగినన్ని సీన్లు కూడా క్రియేట్ చేశాడు గోపి.
తెలుగుఒన్ పర్స్పెక్టివ్:
కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా, పకడ్బందీ స్క్రీన్‌ప్లే, యాక్షన్ సీన్లతో మాస్ ఆడియెన్స్‌ను, యాక్షన్ ప్రియుల్నీ అలరించే సినిమా 'క్రాక్'. రవితేజ ఫ్యాన్స్‌కైతే పండగలాంటి సినిమా. హింస పాలు కాస్త తక్కువైతే ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ మరింతగా మెప్పించగలిగే సినిమా.
- బుద్ధి యజ్ఞమూర్తి