English | Telugu
సినిమా పేరు: తొలిప్రేమ
బ్యానర్ : శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర
Rating : 3.25
విడుదలయిన తేది : Feb 10, 2018
Facebook Twitter Google

సినిమా: తొలిప్రేమ 
తారాగణం: వరుణ్ తేజ్, రాశీఖన్నా, కౌశిక్, సుహాసిని, నరేశ్...
దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్


ట్రెండ్ తో పని లేదు. జనరేషన్ తారతమ్యాలు లేవ్. సీజన్, అన్ సీజన్ భయాల్లేవ్. ఎప్పుడొచ్చినా.. నచ్చేట్టు తీస్తే...  బాక్సీఫీస్ రికార్డులన్నీ చచ్చేట్టు హిట్ అయ్యే ఫార్ములా అంటే... అది ‘లవ్‘ ఫార్ములానే.

తెలుగు సినిమా చాలా ట్రెండ్ లను చూసింది. మారిన ప్రతి ట్రెండ్ నూ వెక్కిరిస్తూ... ప్రేమకథలు మధ్యలో వచ్చి సిల్వర్ జూబ్లీలు అందుకున్నాయ్. అయినా మన పిచ్చి కాకపోతే... ప్రే‘మాయ’లో పడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి? మనిషై పుట్టిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ...ఎక్కడో ఒక చోట.. ఎలాగోలా.. ప్రేమ పురుగు కుట్టక మానదు...ఆ గాయం కాలంతో నిమిత్తం లేకుండా..... కలుక్కుమనిపించకా మానదు. ప్రేమకథలకు విజయాలను అందించేవి  జనజీవితాల్లో నిక్షిప్తమై ఉన్న ఆ జ్ఙాపకాల దొంతరలే. 

మళ్లీ చాలాకాలం తర్వాత మనసుల్ని తాకే ప్రేమకథ ఒకటి థియేటర్లను పలకరించింది. అదే... ‘తొలిప్రేమ’. పవర్ స్టార్ ‘తొలిప్రేమ’ ఓ చరిత్ర. మళ్లీ అదే పేరుతో సినిమా చేయడం నిజంగా  సాహసమే. దర్శకుడు వెంకీ అట్లూరిలో ఉన్న నమ్మకమమే.. ఆ సాహసానికి ఫురిగొల్పి ఉంటుంది. నిజానికి ఈ కథకు ‘తొలిప్రేమ’ అనే టైటిల్ యాప్ట్. ఏది ఏమైనా... మెగా హీరో వరుణ్ తేజ్ ‘ఫిదా’ తర్వాత మళ్లీ మరో బ్లాక్ బాస్టర్ హిట్ ‘తొలి ప్రేమ’ రూపంలో కొట్టేశాడు. సరే.. ముందు ఈ ‘తొలిప్రేమ’ కథేంటో చూద్దాం. 

కథ:
తొలి చూపులోనే వర్షను ప్రేమించేస్తాడు ఆదిత్య. వర్ష కూడా ఆదిత్యను ఇష్టపడుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే... అనుకోకుండా తలెత్తిన అపార్థాలు, అభిప్రాయ బేధాలు వీరిద్దరినీ దూరం చూస్తాయ్. వర్షను మరిచిపోడానికి ఆదిత్య దేశాన్నే వదిలి వెళ్లిపోతాడు.  ఆ తర్వాత అనుకోకుండా వర్ష... ఆదిత్య ఉన్న ప్లేస్ కే వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వారిద్దరి మధ్య అపార్థాలు తొలిగిపోయాయా? మళ్లీ ఇద్దరూ ఒకటయ్యారా? అనేది మిగిలిన కథ.ఎనాలసిస్ :

ప్రేమకథ అంటే... అపార్థాలు, అభిప్రాయబేధాలు, అల్లర్లు, అలకలు... ఇవన్నీ కామన్. వీటిని అర్థవంతంగా... మనసులకు హత్తుకునే రీతిలో చూపిస్తే విజయం తథ్యం. ఈ సినిమా విషయంలో అలాంటి మేజిక్కే జరిగింది. యువతరాన్ని ఊహాలోకాల్లో విహరింపజేసిందీ సినిమా. అంతేకాదు... మధ్య వయస్కులను జ్ఙాపకాల లోతుల్లోకి జారుకునేలా చేసింది. దర్శకుడు వెంకీ రాసుకున్న సన్నివేశాలు అలా ఉన్నాయ్ మరి. ప్రేమికుల సైకాలజీని ఎంతో అధ్యయనం చేస్తే తప్ప... అలాంటి సన్నివేశాలు పడవ్. అయితే... సెకండాఫ్ కాస్త స్లో అయిన మాట వాస్తవం. అయినా... ఫర్లేదు. ఆ కేరక్టర్లతో ప్రేక్షకుని ప్రయాణం మాత్రం ఆగదు. 

ఇక వరుణ్... సినిమా సినిమాకీ... తనలో పరిణతిని పెంచుకుంటూ పోతున్నాడు. ఆదిత్యగా అద్భుతమైన నటన కనబరిచాడు. తను ఎన్నుకుంటున్న కథలు కూడా అతి అభిరుచికి అద్దం పడుతున్నాయ్. హీరోయిన్ రాశీఖన్నా. ఏం చేసిందండీ బాబూ...  ఆ అమ్మాయి!. అసలు ఆ అమ్మాయిని ఇలాంటి పాత్రలో ఎవరూ ఊహించలేదు. మొన్నటివరకూ ఊర సినిమాలు చూసిన రాశి... పూర్తి స్థాయి ప్రేమకథలో హీరోయిన్ అనేసరికి చాలామంది పెదవి విరిచారు. కానీ... ఈ సినిమా విషయంలో నటన పరంగా చెప్పాలంటే... తొలి స్థానం రాశీఖన్నాదే. తను కెమెరా ముందు ప్రవర్తించింది తప్ప.. నటించలేదు. .

సాంకేతికంగా కూడా ఈ సినిమా చెప్పుకునే స్థాయిలోనే ఉంది. ముఖ్యంగా కెమెరా వర్క్ సూపర్. తమన్ చాలా రోజుల తర్వాత మంచి సంగీతం అందించాడు. దర్శకుడు రాసుకున్న సంభాషణలు కూడా మనసుల్ని తాకుతాయ్. 

 తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

ఓ మంచి పుస్తకం లాంటి సినిమా!

  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here