English | Telugu
సినిమా పేరు: శరభ
బ్యానర్ : ఏకేఎస్ ఎంటర్ టైన్మెంట్
Rating : 1.00
విడుదలయిన తేది : Nov 22, 2018
Facebook Twitter Google

నటీనటులు: ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి, జయప్రద, నాజర్, నెపోలియన్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు
కెమెరా: రమణ సాళ్వ
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
మాటలు: సాయిమాధవ్ బుర్రా
సంగీతం: కోటి
నిర్మాత‌: అశ్వినీకుమార్ సహదేవ్
రచన, ద‌ర్శ‌క‌త్వం: యన్. నరసింహారావు  
విడుదల తేదీ: నవంబర్ 22, 2018

జయప్రద చాలా రోజుల తరవాత నటించిన సినిమా 'శరభ'. ఫాంటసీ కథతో రూపొందిన ఈ సినిమాతో ఆకాష్ కుమార్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. కొత్త హీరో, కొత్త దర్శకుడు మీద నమ్మకంతో నిర్మాత అశ్వినీకుమార్ సహదేవ్ భారీగా ఖర్చు పెట్టారు. సుమారు రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా వుందో? రివ్యూ చదివి తెలుసుకోండి.  

క‌థ‌: హిందూ సంప్రదాయంలో శక్తిపీఠాలకు వున్న విశిష్టత, మహిమలు, శక్తుల గురించి తెలిసిందే. 18 శక్తిపీఠాల కింద పిశాచాలు బందీగా వుంటాయి. వాటిని విడిపించడానికి చంద్రక్ష్య అనే తాంత్రికుడు 17 మంది కన్నెపిల్లలను బలి ఇస్తాడు. 18వ కన్నెపిల్ల దివ్య (మిస్తీ చక్రవర్తి). ఆమెను బలి ఇవ్వడానికి ప్రయత్నించగా... చంద్రక్ష్యను కర్తవ్యరాయుడు (నెపోలియన్) చంపేస్తాడు. తండ్రి ఆశయాన్ని  నిజం చేయాలని చంద్రక్ష్య కుమారుడు రక్తాక్ష్య (చరణ్ రాజ్) కంకణం కట్టుకుంటాడు. అతణ్ణి కర్తవ్యరాయుడు కుమారుడు శరభ (ఆకాష్ కుమార్) ఎలా అడ్డుకున్నాడు? అసలు, కర్తవ్యరాయుడు ఏమయ్యాడు? ఈ దైవకార్యంలో శరభ తల్లి పార్వతి (జయప్రద) పాత్ర ఏమిటి? అనేది మిగతా సినిమా.ఎనాలసిస్ :

ఫాంటసీ నేపథ్యంలో కథను రాసుకున్న దర్శకుడు, జనరంజకంగా కథను చెప్పడంలో తడబడ్డాడు. సినిమా చూస్తుంటే ఎన్టీఆర్ 'శక్తి', నాగార్జున 'ఢమరుకం' ఛాయలు కనిపిస్తాయి. ఫాంటసీ కథ పక్కన పెడితే... హీరో హీరోయిన్ మధ్య ప్రేమకథ నిస్సారంగా సాగుతుంది. తమిళ దర్శకుడు శంకర్ దగ్గర ఈ చిత్ర దర్శకుడు నరసింహారావు పనిచేశారు. మేకింగ్‌లో ఆ భారీతనం కనిపించింది. అయితే... శంకర్ తరహాలో కథను ఆసక్తిగా, ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగిస్తూ చెప్పడంలో విఫలమయ్యాడు. దర్శకుణ్ణి నమ్మి నిర్మాత భారీగా ఖర్చు చేశారు. నిర్మాణ విలువలు బావున్నాయి. కోటి పాటల్లో ఒక్కటీ గుర్తుపెట్టుకునే విధంగా లేవు. ఫాంటసీ సన్నివేశాల్లో  నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.

ప్లస్ పాయింట్స్:

విజువల్ ఎఫెక్ట్స్,
జయప్రద రీ ఎంట్రీ

మైనస్ పాయింట్స్:
అసలు కథలో కొసరు ప్రేమకథ
హీరో ఆకాష్ కుమార్
కథనం, దర్శకత్వం

నటీనటుల పనితీరు:

హీరో ఆకాష్ కుమార్‌కు ఇదే మొదటి సినిమా. నటుడిగా అతడు 'అ ఆ'లు దిద్దే స్థాయిలో వున్నాడు. తొలి సినిమాకు భారీ కథను ఎంపిక చేసుకున్నాడు గానీ.. భారీ సన్నివేశాల్లో నటించడం మరిచాడు. అతడికి హేమచంద్ర చెప్పిన డబ్బింగ్ కూడా సూటవ్వలేదు. హీరోయిన్ మిస్తీ చక్రవర్తి నటన కూడా ఆకట్టుకోలేదు. సినిమాలో భారీ తారాగణం వున్నారు. వారిలో జయప్రద నటన మాత్రమే పర్వాలేదని అనిపిస్తుంది. మిగతావారు ఎవరూ ఆకట్టుకోలేదు.తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

'శరభ' పేరులో వున్న పవర్ సినిమాలో, దర్శకత్వంలో, నటీనటుల ప్రతిభలో ఎక్కడా కనిపించదు. స్టార్ హీరోలు ఎవరైనా ఈ సినిమా చేసినట్టయితే... హీరోయిజమ్ ఎలివేట్ అయ్యి సినిమా ఆసక్తిగా అనిపించేది. కొత్త హీరో కావడంతో పలు సన్నివేశాల్లో పవర్ తగ్గింది. సినిమా తేలిపోయింది. వున్నంతలో జయప్రద నటన, విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే చూడదగ్గ విధంగా వున్నాయి.

  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here