English | Telugu
సినిమా పేరు: సాహో
బ్యానర్ : యువి క్రియేషన్స్
Rating : 2.00
విడుదలయిన తేది : Aug 30, 2019
Facebook Twitter Google

'బాహుబలి: ది కంక్లూజన్' తరవాత ప్రభాస్ నటించిన సినిమా 'సాహో'. సుమారు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా 'సాహో'. 'ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిలర్'గా ప్రమోట్ చేసిన సినిమా 'సాహో'. ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'సాహో'. అంచనాలకు తగ్గట్టు, మేకర్లు చెబుతున్నట్టు సినిమా ఉందా?

కథ:

ముంబైలో భారీ దొంగతనం జరుగుతుంది. అందులో రెండు వేల కోట్ల రూపాయలను కొట్టేసింది ఎవరో కనిపెట్టడానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ కేసును ఛేదించడంలో క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ అమృతా నాయర్ (శ్రద్ధా కపూర్) పాత్ర ఏమిటి? ఆమెకు అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అశోక్ చక్రవర్తి (ప్రభాస్) ఎందుకు సహాయం చేస్తుంటాడు? చివరికి, అతడు ఏం చేశాడు? అసలు, అతను ఎవరు? అనేది తెరపై చూడాలి. కథను క్లుప్తంగా మరో విధంగా చెప్పాలంటే... అనగనగనగా వేలకోట్లు సంపాదించిన ఒక వ్యక్తి సామ్రాజ్యం. చుట్టూ ఉన్నవాళ్లు ఎవరినీ నమ్మలేని పరిస్థితి. చెడ్డోళ్లే! వాళ్లందరినీ ఢీ కొట్టి ఒక్క మగాడు అధికారాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? అతడికి, సామ్రాజ్యాధినేతకు సంబంధం ఏంటి? అనేది తెరపై చూడాలి. ఇంతకు మించి చెప్తే మేజర్ ట్విస్ట్ ప్రేక్షకులకు తెలుస్తుంది. సినిమా చూసేటప్పుడు థ్రిల్స్ మిస్ అవుతారు.ఎనాలసిస్ :

సినిమాలో స్టయిల్ ఒక్కటే ఉంటే సరిపోతుందా? సరిపోదు. సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా భావోద్వేగ భరితంగా కథను చెప్పాలనీ, హాలీవుడ్ స్టయిల్ లో సినిమాను తీస్తే సరిపోదనీ 'బిల్లా' సినిమాతో ప్రభాస్ కు తెలియలేదని 'సాహో' మరోసారి చెబుతుంది. మాస్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించే ఫైట్స్ తో సినిమాను తీస్తే ప్రేక్షకాదరణ లభిస్తుందా? లభించదు. ఫైట్స్ బాగుంటే ప్రేక్షకులు విజిల్స్ వేస్తారు కానీ ఫైట్స్ కంటే ముఖ్యంగా కంటెంట్ ఉన్న కథ కావాలని 'రెబల్'తో ప్రభాస్ కు అర్థం కాలేదని 'సాహో' మరోసారి చెబుతుంది. 'బిల్లా'లో ప్రభాస్ స్టయిలిష్ గా కనిపించాడు. కానీ, రిజల్ట్ సంగతేంటి? 'రెబల్'లో ఫైట్స్ బాగుంటాయి. కానీ, నిర్మాతల బాగోగుల సంగతేంటి? 'బిల్లా'లో కంటే 'సాహో'లో ప్రభాస్ మరింత స్టయిల్ గా ఉన్నాడు. హాలీవుడ్ రేంజ్ ఫైట్స్ చేశాడు. 'రెబల్'లో కంటే ప్రేక్షకులకు కిక్ ఇచ్చే ఫైట్స్ 'సాహో'లో ఉన్నాయి. కానీ, కంటెంట్ ఉన్న కథే లేదు. ప్రభాస్ మొదటి నుండి ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా అని చెబుతూ వస్తున్నాడు. కానీ, ఆ స్క్రీన్ ప్లేలో వచ్చే ఒక మేజర్ ట్విస్ట్ పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి'లో ట్విస్ట్ ను గుర్తు చేస్తుంది. త్రివిక్రమ్ ఆ సినిమాను ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ బ్యాక్ డ్రాప్ లో తీస్తే, సుజీత్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తీశాడు. స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను గందరగోళంలోకి నెట్టేశాడు. జాక్వలైన్ సాంగుకు తప్ప మిగతా పాటలకు సరైన ప్లేస్ మెంట్ లేదు. ఫస్టాఫ్ సోసోగా ఉంది. సెకండాఫ్ కొంచెం బెటర్. జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు బలం. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైట్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నప్పటికీ... ఒక ఫైట్ మధ్యలో సీన్ కామెడీగా ఉంటుంది. సినిమాలో తెలుగు నేటివిటీ మిస్ అయింది. హాలీవుడ్ తరహాలో సినిమాను తెరకెక్కించాలని నెల విడిచి సాము చేశారు. దాంతో డబ్బింగ్ సినిమా చూసినట్టు ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం కిక్ ఇస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ కి ముందు వచ్చే ఫైట్ బాగా తీశారు. సినిమాలో చెప్పుకోవడానికి అదొక్కటే బాగుంది.

ప్లస్ పాయింట్స్:

ప్రభాస్
యాక్షన్ దృశ్యాలు
జిబ్రాన్ నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్:

ఎన్నోసార్లు చూసిన కథే
శ్రద్ధా కపూర్, కొందరు ఆర్టిస్టులు
ఎమోషన్స్ పండించలేకపోవడం
నవ్వించలేని కామెడీ సీన్స్
సాంగ్స్ ప్లేస్ మెంట్
ఊహించదగ్గ ట్విస్టులు

నటీనటుల అభినయం:

ప్రభాస్ పాత్రకు ఏం కావాలో అది చేశాడు. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు. స్టయిలిష్ గా కనిపించాడు. సిక్స్ ప్యాక్ చూపించాడు. పాత్రకు తగ్గట్టు స్లో డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్ కూడా బాగుంది. కానీ, వీక్ కామెడీ సీన్స్ వల్ల నవ్వు రాదు. ఏమాత్రం ఆకట్టుకునే కథ లేని ఈ సినిమాను తన భుజాలపై నిలబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. వన్ మ్యాన్ షో చూపించాడు. పోలీస్ పాత్రలో శ్రద్ధా కపూర్ నటన అంతగా ఆకట్టుకోదు. యాక్షన్ సీన్స్ లో పర్వాలేదు అనిపించేలా చేశారు. అందంలో మాత్రం ఆమె అదుర్స్. పాటల్లో అందాల విందు అందించారు. విలన్లలో చుంకీ పాండే నటన ఆకట్టుకుంటుంది. అతడి లుక్ కూడా బాగుంది. కళ్లల్లో కోపాన్నీ, బాధనూ చూపించాడు. ఎక్స్ ప్రెషన్స్ తో ఎఫెక్ట్ చూపించాడు. నీల్ నితిన్ ముఖేష్ నటన కంటే అతడి డబ్బింగ్ చెప్పిన సత్యదేవ్ వాయిస్ థియేటర్ బయటకొచ్చే ప్రేక్షకుడికి ఎక్కువ గుర్తుంటుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సూటు, బూట్లలో విలన్లు అందరూ స్టయిలిష్ గా కనిపించారు కానీ నటన పరంగా చెప్పుకోదగ్గవాళ్లు ఎవరూ లేరు. స్పెషల్ సాంగులో జాక్వలైన్ ఫెర్నాండేజ్ అందాల విందు మాస్ ప్రేక్షకులు, యువతను ఆకట్టుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.  తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

అభిమానుల(ఫాన్స్)ను మాత్రమే కాదు, వీరాభిమానులను (డై హార్డ్ ఫాన్స్)ను కూడా నిరాశ పరిచే చిత్రమిది. ఇక, సాధారణ ప్రేక్షకుల సంగతి చెప్పేదేముంది. వీరాభిమానుల అంచనాలను చేరుకునే అంశాలు సినిమాలో తక్కువ ఉన్నాయి. 'బాహుబలి 2' భారీ విజయం తరవాత ప్రభాస్ ఇచ్చిన అవకాశాన్ని దర్శకుడు సుజీత్ వృధా చేసుకున్నాడు. ప్రభాస్ కథను, దర్శకుడి స్టామినాను అంచనా వేయడంలో ఘోరంగా తడబడ్డాడు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ తెలుగు హీరో చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకునే ప్రేక్షకులు సినిమాకు వెళ్లవచ్చు. రెండు యాక్షన్ సీన్స్ లో మామూలు ప్రేక్షకుల చేత కూడా విజిల్స్ వేయించేలా ప్రభాస్ అదరగొట్టాడు.

  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here