English | Telugu
సినిమా పేరు: నక్షత్రం
బ్యానర్ : శ్రీ చక్ర మీడియా
Rating : 1.25
విడుదలయిన తేది : Aug 4, 2017
Facebook Twitter Google

తారాగణం:- సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, తనిష్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, ప్రకాశ్ రాజ్...
దర్శకుడు:- కృష్ణవంశీ
నిర్మాతలు:- కె.శ్రీనివాసరావు, ఎస్.వేణుగోపాల్, సజ్జు..


దర్శకులు మూడు రకాలు ఉంటారు.  
జనం మెచ్చే సినిమాలు తీసే దర్శకులు మొదటి రకం. 
తాము మెచ్చిన కథలను జనం మెచ్చేలా తీసే దర్శకులు రెండో రకం. 
తమకు తెలిసిందే తెరపై చూపించే దర్శకులు మూడో రకం. 

మొదటి రకం దర్శకులు స్టార్ డైరెక్టర్లనిపించుకుని కొన్నాళ్ల పాటు దర్శకులుగా హవా సాగిస్తారు. 
రెండో రకం దర్శకులూ... కళాఖండాలను తీర్చిదిద్ది చరిత్రలో నిలిచిపోతారు(సత్యజిత్రే, శాంతారామ్, కె.విశ్వనాథ్, కె.బాలచందర్ లా అనమాట). ఇక మూడో రకం దర్శకులు. వీరికి అసలు చరిత్రలో స్థానం ఉండదు. 

ఇక ఇప్పుడున్న దర్శకులు విషయానికొస్తే... వీరందరూ దాదాపుగా మొదటి రకానికి చెందిన వారే. కానీ వీళ్లు కూడా ఓ దశకు వచ్చే సరికి... మూడో రకం దర్శకులుగా మారిపోతుంటారు. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవ్వకపోవడమే ఈ పతనానికి కారణం.  తమ గత ఘన కీర్తిని ఊహించుకుంటూ, తమ జబ్బలు తామే చరుచుకుంటూ... జనం మెచ్చిన సినిమా తీస్తున్నామనే మాయలో... తనకు ‘మాత్రమే’నచ్చిన సినిమాను తీసేస్తున్నారు. మరి దాని ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా?


‘నాకు నచ్చిందే నేను తీస్తాను’ అంటే... ఇక్కడ కుదరదు.  చివరకు నువ్వు తీసింది నువ్వే చూసుకోవల్సొస్తుంది. ఈ విషయం ప్రతి దర్శకుడూ గ్రహించాలి. 
దర్శకుడికి సృజనాత్మకత మాత్రమే ఉంటే సరపోదు. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించే పరిశీలనాత్మకత కూడా ఉండాలి.  

54 ఏళ్ల వయసులో జేమ్స్ కేమరూన్ ఏకంగా‘అవతార్’లాంటి వరల్డ్ వండర్ ని సృష్టించారు. 65 ఏళ్ల వయసులో ‘దిల్ తో పాగల్ హై’లాంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీ తీశారు యాష్ చోప్రా. ‘శుభ సంకల్పం’తీసేటప్పుడు కె.విశ్వనాథ్ వయసు కూడా అరవై అయిదే. ఆరు పదుల వయసులో ‘ఆదిత్య 369’ లాంటి అద్భుతాన్ని సింగీతం శ్రీనివాసరావు ఆవిష్కరిస్తే... 55 ఏళ్ల వయసులో కె.రాఘవేంద్రరావు ‘పెళ్లిసందడి’తీసి యువతరాన్ని సౌందర్య లహరిలో ఓలలాడించారు. వీరు ఈ అద్భుతాలు సృష్టించారంటే దానికి కారణం... ఎప్పటికప్పుడు అప్ డేట్ అవ్వడమే. 

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే... ఈ శుక్రవారం ‘నక్షత్రం’అనే సినిమా విడుదలైంది. ఆ సినిమా చూశాక, ఇదంతా చెప్పాలనిపించింది. ఇక ఈ సినిమా గురించి చర్చించుకునే ముందు అసలు కథేంటో చూద్దాం. 

కథ:
పోలీస్ ఇన్ స్సెక్టర్ అవ్వడమే జీవిత లక్యంగా పెట్టుకున్న రామారావు... కొన్ని కారణాల వల్ల కాలేకపోతాడు. చేసేది లేక చావబోతాడు. ‘పోలీస్ అంటే రక్షకభటుడు. ప్రతి వ్యక్తి ఓ రక్షకభటుడే, ప్రతి రక్షకభటుడూ ఒక వ్యక్తే. పోలీస్ కాలేకపోయినా... డ్యూటీ చేయ్’అని... తన మామ... రామారావుకి ఓ పోలీస్ యూనిఫాం ఇస్తాడు. సిన్సియర్ పోలీస్ అధికారి అలెగ్జాండర్ యూనిఫామ్ అది. ఇక అప్పట్నుంచి రామారావు...  పోలీస్ కాకపోయినా అలెగ్జాండర్ యూనిఫామ్ వేసుకొని డ్యూటీ చేయడం మొదలెడతాడు. ఈ క్రమంలో బాంబ్ బీభత్సం సృష్టించబోతున్న ఓ తీవ్రవాదిని పట్టుకోబోతూ... తాను పోలీసులకు దొరుకుతాడు. అలగ్జాండర్ యూనిఫాంలో ఉన్న రామారావుని... పోలీసులు నిలదీస్తాడు. అసలు అలగ్జాండర్ ఎవరు? అతను ఎందుకు కనిపించడంలేదు? ఈ బాంబ్ ల గోలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం మిగిలిన కథ.ఎనాలసిస్ :

కృష్ణవంశీ అంటే జనాలకు తెలీని అభిమానం. ఈ మధ్య తను తీసిన సినిమాలు సరిగ్గా ఆడకపోయినా... అతని  సినిమా అంటే మాత్రం కచ్చితంగా చూస్తుంటారు. ఏదో అద్భుతం జరగొచ్చని వారి ఆశ. అసలు ఈ సినిమా ఆయన తీసిన తీరు చూస్తే... గులాబీ, నిన్నేపెళ్లాడతా, అంత:పురం, మురారి, ఖడ్గం, చందమామ చిత్రాలు తీసిన కృష్ణవంశీనేనా ఈ సినిమా తీసింది అనిపిస్తుంది. ‘20 ఏళ్ల క్రితమే కృష్ణవంశీ ఆగిపోయాడు’ అని ఈ సినిమా చూసిన చాలామంది అంటున్నారు.  కానీ అలా చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే.. అప్పుడు తీసిన సినిమాలు ఇప్పటికీ బానే ఉంటాయి కదా. ఈ సినిమా చూశాక తను పూర్తిగా రిలాక్సయిపోయాడు అనిపిస్తుంది. ఒకప్పుడు మంచి సినిమాలు ఎలా తీయాలంటే... కృష్ణవంశీని చూపించేవారు. ఈ సినిమా చూశాక... సినిమా ఎలా తీయకూడదు అంటే కృష్ణవంశీని చూపించే పరిస్థితి.
 
చిన్న చిన్న లాజిక్కుల్ని కూడా ఆయన మిస్ అయిపోయాడు. హైదరాబాద్లో నడిరోడ్డు మీద వందలాది మంది చూస్తుండగా.. ఓ పోలీస్ అధికారి బాంబ్ దాడికి బలైపోతే... ఆ అధికారి ఏమయ్యాడని  పోలీసులందరూ వెతుకుతుంటారు. ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా చెప్పండి? బాంబ్ పేలిన ప్రదేశానికి పోలీసులు వెళ్లరా? అక్కడ దొరికిన అనావాళ్లతో చనిపోయింది ఎవరో తెలుసుకోవడం పోలీసులకు ఎంత పని? ఈ మాత్రం ఆలోచన కూడా లేకుండా కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారా? 

సర్టిఫికెట్లు కాలిపోతే...జీవితమే నాశనమైపోతుందని బాధ పడే రోజులు ఎప్పటివి? ఆన్ లైన్ లో సర్టిఫికెట్లు వస్తున్న కంప్యూటర్ యుగం ఇది. ఆ మాత్రం ఆలోచన ఉండదా? 20 ఏళ్ల క్రితం పోలీసు టోపీలు ఎలా ఉండేవో కూడా ఆయనకు తెలీదంటే.. నిజంగా  బాధాకరం.  ప్రేక్షకులకు సహనానికి పరీక్షపెట్టే కథనం. రణగొణ ధ్వనులు తప్ప సాహిత్యం వినిపించని పాటలు. పాటల్లో హీరోయిన్ల వికారపు చేష్టలు. వికారంగా ఒళ్లు చూపించడమే శృంగారం అనుకుంటే ఎలా? ఓ తండ్రి కూతుర్ని తీసుకొని ఈ సినిమాకు రాగలడా? ఓ అన్న చెల్లెలుతో ఈ సినిమా చూడగలడా? జరిగిన అనర్థం ఎలాగూ జరిగిపోయింది. ఇప్పటికైనా... కృష్ణవంశీ కళ్లు తెరిస్తే మంచిది.

నటీనటులు: 
ఇక పాత్రధారుల విషయానికొస్తే... సందీప్ కిషన్ చక్కగా చేశాడు. సెకండ్ హాఫ్ లో ఎంటరయ్యే సాయిధరమ్ తేజ్ పాత్రపై ఆడియన్స్ చాలా ఆశలు పెట్టుకుంటారు. కానీ... ఆ స్థాయిలో ఆ పాత్ర ఉండదు. ఉన్నంతలో మాత్రం తను బాగా చేశాడు. ఇక ప్రకాశ్ రాజ్, శివాజీ రాజాల నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది? తనిష్ పెర్ ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్. తను ఇందులో ప్రతినాయకునిగా నటించాడు. అద్భుతంగా చేశాడు కూడా. తులసి గత చిత్రాల మాదిరిగానే కావల్సినంత ‘అతి’ చేసింది. హీరోయిన్ల పెర్ ఫార్మెన్స్ కంటే... స్కిన్ షో బావుంది. ఇక సాంకేతికంగా ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

ఈ సినిమా చూస్తున్నంతసేపు... కళ్ల మీద పోలీస్ బూట్లు కవాతు చేసినట్లు అనిపించింది. ఇక అంతకు మించి చెప్పటానికి ఏమీ లేదు. 

  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here