English | Telugu
సినిమా పేరు: దేవదాస్
బ్యానర్ : వైజ‌యంతీ మూవీస్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌
Rating : 2.50
విడుదలయిన తేది : Sep 28, 2018
Facebook Twitter Google

నటీనటులు: నాగార్జున, నాని, అకాంక్ష సింగ్‌, ర‌ష్మిక మంద‌న్న, కునాల్ క‌పూర్‌, మురళీ శర్మ, 'కాలకేయ' ప్ర‌భాక‌ర్‌, సీనియర్ న‌రేశ్‌, రావు ర‌మేశ్‌, 'వెన్నెల‌' కిశోర్, అవ‌స‌రాల శ్రీనివాస్‌, 'స్వామి రారా' స‌త్య త‌దిత‌రులు
కథ: శ్రీధర్ రాఘవన్
రచనా సహకారం: సత్యానంద్, భూపతిరాజా
కెమెరా: శ్యామ్‌ద‌త్ సైనూద్దీన్‌  
సంగీతం: మ‌ణిశ‌ర్మ‌
నిర్మాణ సంస్థ‌లు: వైజ‌యంతీ మూవీస్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌  
నిర్మాత‌: సి.అశ్వినీద‌త్‌
ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ ఆదిత్య‌
 విడుదల తేదీ: 27/09/2018

మల్టీస్టారర్ సినిమాలు చేయడం అంటే దర్శకులకు కత్తి మీద సామే! హీరోలకు సరి సమానమైన పాత్రలు రాసుకోవాలి. పాత్రల కొలతల్లో తేడా వస్తే అభిమానుల, పేక్షకులతో మరో తలనొప్పి. వీటికి తోడు పాటలు, ఫైటులు, నవ్వులు.. వగైరా, వగైరా కొలతలు చూసుకుని సినిమా తీయాలి. తీరా ఇవన్నీ చూసుకుని సినిమా చేశాక... ప్రేక్షకులు మొదటి ఆట పడ్డాక పెదవి విరిస్తే పెద్ద ప్రాబ్లమ్. పట్టుమని పది సినిమాలు అనుభవం లేని శ్రీరామ్ ఆదిత్య... తన మూడో సినిమా 'దేవదాస్'లో నాగార్జున, నాని వంటి స్టార్ హీరోలను ఎలా హ్యాండిల్ చేశాడు? సినిమాలో కొలతలు అన్నీ కుదిరాయా? లేదా? రివ్యూ చదివి తెలుసుకోండి!

క‌థ‌:

డాన్ దేవ (నాగార్జున) హైదరాబాద్ వదిలి వెళ్లి పదేళ్లు అవుతోంది. అతణ్ణి పెంచిన తండ్రి (శ‌ర‌త్‌కుమార్‌)కి తప్ప అతడి రూపు రేఖలు ఎవరికీ తెలియదు. హైద‌రాబాద్‌లో దేవ లేకున్నా... మాఫియా, చీకటి దందాలు అతడి కనుసన్నల్లో, అతణ్ణి పెంచిన తండ్రి ఆధ్వర్యంలో జరుగుతాయి. చీకటి ప్రపంచంలోకి కొత్తగా వచ్చిన డేవిడ్ (హిందీ నటుడు కునాల్ కపూర్), దేవను హైదరాబాద్ రప్పించడం కోసం శ‌ర‌త్‌కుమార్‌ని చంపేస్తాడు, దేవ హైదరాబాద్ వస్తాడు. తండ్రిని చంపిన వ్యక్తులను తెలుసుకోవాలనే క్రమంలో అతడిపై ఓ పక్క పోలీసులు, మరోపక్క డేవిడ్ మనుషులు ఎటాక్ చేస్తారు. బాడీలో బుల్లెట్ దిగుతుంది. చికిత్స కోసం ఓ చోటా ఆసుపత్రికి వెళతాడు. డాక్టర్ దాస్ (నాని) బుల్లెట్ తీస్తాడు. తరవాత తప్పనిసరి పరిస్థితుల్లో దేవతో స్నేహం చేస్తాడు. డానూ, డాక్టరూ మధ్య స్నేహం ఎటువంటి పరిస్థితులకు దారి తీసింది? ఎవరిని ఎవరు మార్చారు? అనేది సినిమా!

డాన్ దేవ‌ను ప‌ట్టుకోవాల‌ని అండ‌ర్‌క‌వ‌ర్ ఆప‌రేష‌న్‌లో భాగంగా దాస్‌తో ప్రేమ‌లో ప‌డిన‌ట్టు న‌టించిన ఇన్‌స్పెక్ట‌ర్ పూజ (రష్మిక మందన్న) ప్రయత్నం ఫలించిందా? న్యూస్ రీడర్ (జాహ్నవి)తో డాన్ దేవ ప్రేమకథ నిజమేనా? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో దొరుకుతాయి.ఎనాలసిస్ :

సినిమా ప్రారంభమైన పది పదిహేను నిమిషాల్లో నాగార్జున డాన్, నాని డాక్టర్ అనే విషయాలు ప్రేక్షకులు మర్చిపోతారు. మరీ ఎక్కువ సమయం వృధా చేయకుండా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కథలోకి తీసుకువెళ్లారు. ప్రథమార్థంలో పాత్రల మధ్య ముడులు బాగా వేశాడు. వినోదంతో మూడు ఫైటులు, ఆరు నవ్వులు అన్నట్టు సాగింది. ముఖ్యంగా మందుకొట్టే సన్నివేశాలు, నాగార్జున-నాని మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కాని ద్వితీయార్థం వచ్చేసరికి బండి కొంచెం నెమ్మదించిన భావన ప్రేక్షకుల్లో కలుగుతోంది. అప్పటికి డాన్ దేవతో తప్పక స్నేహం చేయవలసిన పరిస్థితుల్లో డాక్టర్ దాస్ అనుభవించే మనోవేదన నవ్వులు పూయించింది. మళ్లీ మళ్లీ అటువంటి సన్నివేశాలు వచ్చేసరికి ప్రేక్షకులకు కాస్త విసుగు వస్తుంది. దీనికి తోడు సినిమాలో సందేశం ఇవ్వాలనే తాపత్రయంలో భాగంగా అవయవ దానం సన్నివేశాలు కథలో కావాలని ఇరికించిన భావన తీసుకొచ్చాయి. ముగింపు కూడా అందరూ హర్షించే విధంగా లేదు.

మణిశర్మ సంగీతం అందించిన స్వరాలు విడుదలకు ముందు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ కాక‌పోయినా... కాస్త కొత్తగా పర్వాలేదనేలా వున్నాయని పేరు తెచ్చుకున్నాయి. సినిమాలో విజువల్ పరంగా పాటలు అన్నీ బావున్నాయి. శ్యామ్‌ద‌త్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ప్రతి ఫ్రేమ్ అందంగా వుండటంతో సినిమాకు రిచ్ లుక్ వచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు: నటుడిగా నాగార్జునది 30 ఏళ్ళ అనుభవం! ప్రతి సన్నివేశంలోనూ అది కనిపించింది. సన్నివేశాలకు తగ్గట్టు ఓ పక్క హీరోయిజాన్ని, మరోపక్క వినోదాన్ని సమపాళ్లలో చూపించారు. నాని పాత్ర మొదట వినోదాత్మకంగా ప్రారంభమైనా... చివరికి వచ్చేసరికి ఎమోషనల్ రూటులోకి వెళ్ళింది. నటుడిగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు నాని. రష్మిక, ఆకాంక్ష పాత్రలు అతిథి పాత్రలకు ఎక్కువ, హీరోయిన్ పాత్రలకు తక్కువ అన్నట్టు సాగాయి. కనిపించింది తక్కువ సన్నివేశాలే అయినా నరేశ్, 'వెన్నెల' కిశోర్, సత్య నవ్వించారు. నాగార్జున, నాని కామెడీ కెమిస్ట్రీ ముందు తమ ఉనికి నిలుపుకున్నారు. డేవిడ్ పాత్రలో హిందీ నటుడు కునాల్ కపూర్ చాలా హ్యాండ్స‌మ్‌గా వున్నాడు. చిన్ని అతిథి పాత్రలో సంపూర్ణేష్ బాబు తళుక్కున మెరిశాడు.తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

నాగార్జున చెప్పినట్టు అలనాటి 'దేవదాసు' లవ్&ట్రాజెడీ దేవదాస్ అయితే... ఈ 'దేవదాస్' లాఫింగ్ 'దేవదాస్'. అయితే.. ప్రథమార్థంలో బాగా నవ్వించిన దేవ, దాసు ద్వితీయార్థం వచ్చేసరికి కొంచెం నెమ్మదించారు. హీరోల అభిమానుల్ని సంతోషపరిచే సన్నివేశాలు సినిమాలో చాలా వున్నాయి. ముఖ్యంగా నాగార్జున హీరోయిజం ఎలివేషన్ సీన్లు, నాని కామెడీ టైమింగ్! కాని సినిమాలో ఏదో వెలితి వున్నట్టు వుంటుంది.

 

  
  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here