English | Telugu
సినిమా పేరు: నగరం
బ్యానర్ : పొటెన్షియల్ స్టూడియోస్
Rating : 2.50
విడుదలయిన తేది : Mar 10, 2017
Facebook Twitter Google

సినిమాల్లో థ్రిల్లర్ జోనర్ నే వేరు. మనసు పెట్టి తీయాలే కానీ థ్రిల్లర్ లకు ఫెయిల్యూర్లు తక్కువ. ఎందుకంటే సీటు అంచున కూర్చుని, తరువాత సీన్ లో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠతో సినిమా చూడాలనుకునే ప్రేక్షక జనానికి లోటు లేదు. ఇటీవల క్రైం కామెడీ అని కొత్త జోనర్ వచ్చి, అసలు సిసలైన థ్రిల్లర్లను కాస్త డైల్యూట్ చేసింది. కానీ అప్పుడప్పుడు మాంచి థ్రిల్లర్లు వచ్చి అలరిస్తుంటాయి. అలాంటిదే సందీప్ కిషన్, రెజీనా నటించిన నగరం.

* కథ

ఏ నగరంలో అయినా ఒక కథ వుండదు. అనేక కథలు వుంటాయి. అందుకే ఈ నగరంలో కూడా ప్రేయసి కోసం ఎవర్నయినా ఏమయినా చేసే కుర్రాడి తెగింపు. బుద్దిగా మాంచి ఉద్యోగం చేసుకుని, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అడుగడుగనా దౌర్జన్యాలే ఎదురయ్యే నగరం అంటే అసహ్యించుకునే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తప్పు చేసిన వాడు మన వాడు అయితే కాపాడడం, కాని వాళ్లపై అధికార జులుం చెలాయించడం అలవాటైన పోలీస్ అధికారి, తన దౌర్జన్యాలతో, రౌడీయిజంతో నగరాన్ని తన అదుపాజ్ఞల్లో వుంచుకునే గూండా. అనుకోకుండా అదే గూండా కొడుకును కిడ్నాప్ చేసి, ఆ పై ఏం చేయాలో తెలియక కిందా మీదా పడే చోటా గ్యాంగ్.  ఇలా వీళ్లందరి జీవితాలు అనుకొకుండా ఎలా ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాయి అన్నది కథ.

 ఎనాలసిస్ :

నగరం సినిమా ఓ టిపికల్ స్క్రీన్ ప్లేతో నడుస్తుంది. నిజానికి ఇలాంటి సినిమాలు మనకు పరిచయమే. ఓం శాంతి, వేదం సినిమాలు ఇలాంటివే. అయితే వాటికి దీనికి తేడా ఏమిటంటే, ఇది తమిళ మాతృక సినిమా కాబట్టి, రియలిస్టిక్ పాలు కాస్త ఎక్కువగా, గ్లామర్ పాలు కాస్త తక్కువగా వుంటుంది. పైగా సినిమా కాస్త స్లో పేస్ లో నడుస్తుంది. ఎంత మాంచి థ్రిల్లర్ అయినా మరీ ఇంత స్లో పేస్ అక్కరలేదు. మరీ ఎక్కువ కాకపోయినా, జస్ట్ పది శాతం అయినా వేగం పెంచుకునే అవకాశం వుంది. పైగా దీనికి తోడు రెజీనా, సందీప్ మినహా మిగిలినవి అన్నీ మనకు పరిచయం లేని, డీ గ్లామర్ మొహాలు. ఇవన్నీ కలిసి సినిమా కాస్త సాగిన ఫీలింగ్ తెస్తాయి.

అయితే అదే సమయంలో అస్సలు ఎక్కడా లూజ్ ఎండ్స్ లేని దర్శకుడి పనితనం మనల్ని మరో ఆలోచన వైపు వెళ్లనివ్వదు. ఒక్క పాటలు వస్తే మినహా ప్రేక్షకుడు సినిమా తెర మీద నుంచి దృష్టి మరల్చుకునే అవకాశం వుండదు. దాదాపు ఇలాంటి సినిమాలన్నింటి మాదిరిగానే ప్రథమార్థం అంతా అన్ని పాత్రలను పరిచయం చేసి, వాటన్నింటిని ఓ దగ్గరకు చేర్చి, ముడిపెట్టడంతో ఆగుతుంది. అలా ముడిపడిన పాత్రలు చివరకు ఒక దగ్గరకు చేరి, ఎలా ముగుస్తాయి అన్నది ద్వితీయార్థం. కానీ ఇలా సింపుల్ గా చెప్పిన రెండు సగాలకు మాంచి జిగితో కూడిన స్క్రీన్ ప్లే అందించడం అన్నది దర్శకుడి లోకేష్ ప్రతిభకు అద్దం పడుతుంది. పైగా ఇది తొలి సినిమా అంటే కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. కానీ తెలుగు ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారన్నది మాత్రం కాస్త అనుమానం. ఎందుకంటే సినిమాలో వున్న రియలిస్టిక్ పాళ్లు, స్లో పేస్ అలాంటివి. అవి నచ్చేవారికి సినిమా సూపర్. నచ్చని వారికి అబ్బే..ఏముంది? అనుకోవడమే.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

నిజానికి సినిమాకు కథానాయకుడు అంటూ ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ వుండదు. కానీ ఉన్నంతలో సందీప్ కిషన్ నే హీరో. యాంగ్రీ యంగ్ మెన్ గా సందీప్ మంచి మార్కులు సంపాదిస్తాడు. రెజీనా, శ్రీ, ఇలా మిగిలిన వాళ్లంతా దర్శకుడు గీసిన గీతలు దాటకుండా, పాత్రల ఔచిత్యం ఇంచి కూడా చెరగకుండా నటించి శభాష్ అనిపించుకుంటారు. సినిమాకు జావేద్ రియాజ్ నేపథ్య సంగీతం పెద్ద ప్లస్. కథను ఉత్కంఠ భరితంగా స్క్రీన్ మీదకు అనువదించే దర్శకుడి ప్రయత్నానికి యాధాశక్తి సహకరించాడు జావేద్. ఇక సెల్వ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా అదే విధంగా సహకరించింది.తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

* ఫైన‌ల్‌గా :  న‌గరం... థ్రిల్‌కి ఏమాత్రం కొద‌వ లేదు!

  
  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here