English | Telugu
సినిమా పేరు: మేడమీద అబ్బాయి
బ్యానర్ : జాహ్నవి ఫిలిమ్స్
Rating : 2.00
విడుదలయిన తేది : Sep 8, 2017
Facebook Twitter Google

తారాగణం:- అల్లరి నరేశ్, నిఖిలా విమల్, అవసరాల శ్రీనివాస్, హైపర్ ఆది...
దర్శకత్వం:- ప్రజిత్.జి
నిర్మాత:- బొప్పన చంద్రశేఖర్


అల్లరి నరేష్... కొన్నాళ్ల క్రితం చిన్న సినిమాల సూపర్ స్టార్. జయాపజయాలతో నిమిత్తం లేకుండా తెగ సినిమాలు చేసేశాడు. 12 ఏళ్లలో యాభై సినిమాల్లో నటించాడు. ఏ మాటకామాటే చెప్పాలి... అల్లరి నరేశ్ పుణ్యమా అని... సినీ కార్మికులకు రోజూ పని దొరికేది. అలాంటి నరేశ్ ఒక్కసారిగా స్పీడ్ తగ్గించాడు. కారణం.. సక్సెస్ లేకపోవడమే. ఆచి తూచి సినిమాలు చేస్తున్నా.. విజయం మాత్రం మనోడికి ఆమడ దూరంలో ఉండిపోయింది. దాంతో... కాస్త టైమ్ తీసుకొని మలయాళం రీమేక్ తో ఈ శుక్రవారం తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మరి ఈ దఫా అయినా... నరేశ్ కల ఫలించిందా? మళ్లీ మనోడికి నిరాశే మిగిలిందా? తెలుసుకోవాలంటే... ఇక చదవండి.

కథ:-

ఇంజనీరింగ్ లో 24 సబ్జెక్టులూ మిగిల్చి రికార్డు సృష్టిస్తాడు శ్రీను. ఇంట్లో వాళ్లు మనోడి చేసిన ఘన కార్యానికి ఊళ్లో తలెత్తుకోలేకపోతుంటారు. ఇక ‘చదువు ఎక్కదు’ అని ఫిక్సయిన శ్రీను... సినిమా డైరెక్టర్ అవ్వాలని నిశ్చయించుకుంటాడు. ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ రైలెక్కేస్తాడు. అదే రైల్లో తాను ఇష్టపడ్డ పక్కింటమ్మాయి సింధు కనిపిస్తుంది. ఎలాగొలా అమ్మాయ్ తో మాట కలపడానికి ప్రయత్నిస్తాడు. తను ‘ఛీ’ కొట్టినంత పని చేస్తుంది. ఆ అమ్మాయికి తెలీకుండా ఓ సెల్ఫీ దిగి.. దాన్ని ఫ్రెండ్ కి పంపుతాడు. వాడేమో... వీళ్లిద్దరూ లేచిపోయారని, నేనే వీరికి హెల్ప్ చేశాననీ వూరంతా టామ్ టామ్ చేస్తాడు. ఇక శ్రీను అవకాశాలకోసం హైదరాబాద్ అంతా తిరిగి విసిగి వేసారి.. చివరకు మళ్లీ ఊరు చేరతాడు. శ్రీనుని చూడగానే తండ్రి అగ్గిమీద గుగ్గిలంగా మారతాడు. కుక్కను కొట్టినట్టు కొడతాడు. అంత తప్పు ఏం చేశానో అర్థం కాక శ్రీను సతమతమవుతుంటే.. పక్కింటి సింధు వాళ్ల నాన్న వచ్చి... ‘మా అమ్మాయిని ఏం చేశావ్. ఎక్కడుంది చెప్పరా’అనడుగుతాడు. అప్పుడు అర్థమవుతుంది మనోడికి. ఇంట్లోంచి ఆ అమ్మాయి కూడా లేచిపోయిందని. తాను తీసుకున్న సెల్ఫీనే తన కొంప ముంచిందని. ఎలాగొలా అక్కడ్నుంచి తప్పించుకొని ఫ్రెండ్ సమేతంగా మళ్లీ హైదరాబాద్ దిగి ఆ అమ్మాయిని వెతికే పనిలో పడతాడు శ్రీను. ఇంతకీ సింధు ఎక్కడికెళ్లింది? మనోడు ఈ గండం నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది మిగిలిన కథ.ఎనాలసిస్ :

సినిమా విజయానికి మంచి కథతో పాటు.. నేటివిటీ కూడా ముఖ్యం. దానితో పాటు నడకలో వేగం ఉండాలి. ఆడియన్ విసుగు ఫీలవ్వకుండా.. ఎంటర్టైన్ చేయగలగాలి. వీటిల్లో ఏది మిస్ అయినా.. సినిమా ఫట్టే. ఇక ఈ సినిమా విషయానికొస్తే... కథ బావుంది. కథనం మాత్రం నత్త కంటే దారుణంగా నడుస్తుంది. నిజంగా ఆడియన్స్ సహనానికి పరీక్షే. మలయాళ సినిమా ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ ఈ చిత్రానికి మాతృక. దానికి దర్శకుడైన ప్రజిత్.జి నే... ఈ సినిమాకూ దర్శకుడు కావడం విశేషం. దాదాపు మలయాళం సినిమా మాదిరిగానే దీన్నీ తీశాడు. తెలుగు సినిమాకు కాస్త వేగం ఎక్కువ. నిదానంగా సినిమా ఉంటే ఇక్కడ చూడరు. ఈ విషయంపై దర్శకునికి అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ప్రథమార్థంలో లొకేషన్లు కూడా కేరళ వెళ్లి తీశాడా అనిపిస్తుంది. ప్రేక్షకులకు ఓ మలయాళం సినిమా చూస్తున్న ఫీలింగ్.   ఏది ఏమైనా స్క్రీన్ ప్లే కాస్త వేగంగా రాసుకుంటే.. సినిమా ఫలితం వేరేలా ఉండేది. అల్లరి నరేశ్ స్వతహాగా మంచి నటుడు. గమ్యం, శంభో శివ శంభో, సంఘర్షణ.. సినిమాల్లో నరేష్ నటన అభినందనీయం. అయితే.. తన కెరీర్ లో ఎక్కువ శాతం.. అర్థం లేని అల్లరి కామెడీ సినిమాలే చేశాడు నరేశ్. ఈ సినిమా మాత్రం కాస్త డిఫరెంటే. కానీ.. కథనం స్లో అయిపోయింది. దాంతో మనోడికి మళ్లీ నిరాశే మిగిలిందని చెప్పాలి. హీరోయిన్ నిఖిలా విమల్  నటి మాత్రమే.. అందగత్తె అయితూ కాదు. అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి.. అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. హైపర్ ఆది పంచ్ లు ఎక్కువయ్యాయ్. తగ్గించుకుంటే మంచిది. 

కెమెరా వర్క్ బావుంది. షాన్ రెహ్మాన్ మ్యూజిక్ అంత గొప్పగా ఏం లేదు. కూర్పులో వేగం తగ్గింది. టోటల్ గా అతి నీరసంగా సాగే ఈ సినిమాను సగటు ప్రేక్షకులు భరించడం కష్టం. అయితే.. ఎక్కడా డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా, కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా సినిమాను మలిచాడు దర్శకుడు. ‘ఫేస్ బుక్’ ప్రేమలు కొంప ముంచుతాయనే చక్కని మెసేజ్ కూడా ఇచ్చాడు.తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

ఏది ఏమైనా.. పేరుకే  ఇది ‘మేడ మీద అబ్బాయ్’ కానీ.. నిజానికి  అబ్బాయ్ పైన లేడు. కిందే ఉన్నాడు.

  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here