English | Telugu
సినిమా పేరు: అరవింద సమేత వీర రాఘవ
బ్యానర్ : హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌
Rating : 3.00
విడుదలయిన తేది : Oct 11, 2018
Facebook Twitter Google

తన మాటలతో, దర్శకత్వ ప్రతిభతో త్రివిక్రమ్ శ్రీనివాస్... నటనతో ఎన్టీఆర్... ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. అందువల్ల, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తే చూడాలనీ, వీళ్లిద్దరి కలయికలో సినిమా వస్తే ఎలా వుంటుందోననీ ఎదురు చూసిన తెలుగు ప్రేక్షకులు ఎంతోమంది. ఆ ఎదురు చూపులకు ఇప్పటికి సమాధానం దొరికింది... 'అరవింద సమేత వీరరాఘవ' రూపంలో! 'అజ్ఞాతవాసి' పరాజయం తరవాత త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా వుంది? 'జై లవ కుశ'తో నటుడిగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్‌కి ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ దొరుకుతుందా? వంద కోట్ల క్ల‌బ్‌లో సినిమా చేరుతుందా? అసలు, సినిమా ఎలా వుంది? రివ్యూ చదివి తెలుసుకోండి!

క‌థ‌: పైచదువులు కోసం లండన్ వెళ్లిన నారపరెడ్డి (నాగబాబు) కుమారుడు వీరరాఘవ రెడ్డి (ఎన్టీఆర్) పన్నెండేళ్ల తరవాత రాయలసీమకు తిరిగొస్తాడు. కుమారుణ్ణి పిక‌ప్ చేసుకోవ‌డం కోసం రైల్వే స్టేష‌న్‌కి మందీ మార్బ‌లంతో వెళ‌తాడు. స్వగ్రామానికి వెళ్తున్న దారిలో ప్రత్యర్థి బసిరెడ్డి (జగపతిబాబు) తన మందీ మార్బలంతో ఎటాక్ చేస్తాడు. నారపరెడ్డి మరణిస్తాడు. తండ్రి మరణంతో ఉగ్రనరసింహస్వామి రూపం దాల్చిన వీరరాఘవ రెడ్డి మొండికత్తితో ప్రత్యర్థులను వేటాడతాడు. రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా.. పన్నెండేళ్లు లండ‌న్‌లో పెరిగిన వీరరాఘవరెడ్డి కత్తి పట్టడం అతడి నానమ్మకు నచ్చదు. 'యుద్ధం చేసేవాడు కాదు, యుద్ధం రాకుండా ఆపేవాడు గొప్ప' అని చెప్పడంతో ఫ్యాక్షన్ గొడవలకు ముగింపు పలికే పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ ప్రయాణం మొదలు పెడతాడు. ఆ ప్రయాణంలో అరవింద (పూజా హెగ్డే) పాత్ర ఏమిటి? చివరికి గొడవలను ఎలా ఆపాడు? అనేది సినిమా.ఎనాలసిస్ :

మహాభారతంలో యుద్ధ పర్వం తరవాత స్త్రీ, శాంతి, మౌక్తిక, స్వర్గారోహణ పర్వాలను పురాణాలు చెప్పేవారు త్వరగా ముగించేస్తారు. ఎందుకంటే... యుద్ధ పర్వం ఇచ్చినంత కిక్ ఆ తరవాత పర్వాలు ఇవ్వవనీ, జీవితం మీద ఆశ చంపేస్తాయనీ విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలలో త్రివిక్రమ్ చెప్పారు. సినిమా చూస్తుంటే ఆ మాటలు అక్షర సత్యాలు అని ప్రేక్షకులకు అనిపించక మానదు.

సినిమా ప్రారంభమే ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫైట్‌తో ప్రారంభ‌మ‌వుతుంది. ఎన్టీఆర్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడికి ఆ ఫైట్ కిక్ ఇస్తుంది. ఈ యుద్ధ పర్వం తర్వాత శాంతి పర్వం కోసం నాయకుడు అస్త్ర సన్యాసం చేసి స్వగ్రామానికి దూరంగా వెళతాడు. ఆ ప్రయాణం సాగుతుంటే సినిమాపై ఆశలు అడుగంటుతాయి. ఫ్యాక్షన్ గొడవలకు ఎలా ముగింపు చెప్పాలోనని ఆలోచిస్తూ రాయలసీమ నుంచి బయటపడిన ఎన్టీఆర్‌కి పూజా హెగ్డే పరిచయం అవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు కాస్త పర్వాలేదంతే. ఏమంత గొప్పగా వుండవు. కాని సరదాగా నవ్విస్తూ ముందుకు వెళతాయి. మధ్యలో 'మల్లీశ్వరి'లో తాను కనిపించిన పాత్ర తరహా పాత్రలో సునీల్ మరోసారి కనిపిస్తాడు. సునీల్ ఒక్కటంటే ఒక్క సన్నివేశంలో కూడా నవ్వించలేదు. అతడి పాత్ర ఎందుకుందో? అన్నట్టు చేశాడు. అతడి పాత్రకు త్రివిక్రమ్ కూడా సరిగా డైలాగులు రాయలేదు. ఇవన్నీ పక్కనపెట్టి.. అసలు కథ విషయానికి సెకండాఫ్‌ గురించి మాట్లాడుకోవాలి. సెకండాఫ్ అంతా 'మిర్చి' చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అందులో తండ్రి ఆశయం కోసం కొడుకు శత్రువుల ఇంటికి వెళ్లి వాళ్లల్లో మార్పు కోసం ప్రయత్నం చేస్తాడు. ఇందులో తండ్రిని పోగొట్టుకున్న కుమారుడు నానమ్మ ఆశయం కోసం, ఫ్యాక్షన్ కక్షలకు ముగింపు పలకడం కోసం శత్రువులతో చర్చలు జరుపుతాడు. కాకపోతే ఈ కథను త్రివిక్రమ్ తనదైన శైలిలో తెరకెక్కించాలని ప్రయత్నించాడు. వాణిజ్య హంగులకు కొంచెం దూరంగా చిత్రాన్ని తీశాడు. అందువల్ల ప్రేక్షకుల అంచనాలు, ఆశలకు దూరంగా సినిమా వుంటుంది. ముఖ్యంగా విడుదలకు ముందు ప్రేక్షకుల్ని ఎంతోగానో ఆకట్టుకున్న 'పెనిమిటి...' పాటకు  సరైన సందర్భం, సరైన చిత్రీకరణ కుదరలేదు. సినిమాలో భావోద్వేగాలు ఏవీ ఆకట్టుకోలేదు. 'రెడ్డి ఇక్కడ సూడు పాట కూడా కథకు అడ్డు తగిలింది. నేపథ్య సంగీతం ఆకట్టుకోలేదు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, రాధాకృష్ణ నిర్మాణ విలువలు బావున్నాయి.

ఫ్యాక్ష‌నిజానికి మ‌రో కోణం ఆవిష్కరించాల‌ని సినిమా ప్రారంభించినా... భర్తను లేదా కన్నబిడ్డను పోగొట్టుకున్న మహిళల మనోగతం ఎలా వుంటుంది? అనేది చూపించాలని అనుకున్నా... అవేవీ పూర్తిస్థాయిలో చూపించలేదు. కాని కొన్ని సన్నివేశాల్లో, రాయలసీమ యాసలో త్రివిక్రమ్ డీటెయిలింగ్ సూపర్బ్. ఉదాహరణకు... మహిళ బొట్టు పెట్టుకునే సన్నివేశంలో భర్త శవం రావడంతో బొట్టు పెట్టుకోకుండా ఆగడం వంటివి!

నటీనటుల పనితీరు: నటుడిగా ఎన్టీఆర్‌కు పరీక్ష పెట్టే పాత్ర కాదు. అవలీలగా చేసుకుంటూ వెళ్లారు. కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలను అతడు పలికించిన తీరు ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తుంది. సినిమా పేరులో వున్నంత ప్రాధాన్యత కథలో పూజా హెగ్డే పాత్రకు లేదు. కథానాయకుడి ప్రయాణంలో మలుపులకు ఆమె పాత్ర కారణం అన్నట్టు చూపించాలని త్రివిక్రమ్ తాప‌త్ర‌య‌ప‌డ్డారు. అంతే త‌ప్ప‌.. సినిమాలో ఆమెకు అంత స్కోప్ ల‌భించ‌లేదు. ఆమెకు రాసిన డైలాగుల్లో డెప్త్ వుందంతే! పూజా హెగ్డే డబ్బింగ్ బాగోలేదు. బసిరెడ్డి పాత్రలో జగపతిబాబు జీవించాడు. సినిమా మొత్తం మీద న‌టుడిగా ఎక్కువ మార్కులు అతడికి పడతాయి. ఈషా రెబ్బా, సునీల్, సీనియర్ న‌రేశ్‌, రావు ర‌మేశ్‌, శుభ‌లేఖ సుధాక‌ర్ తమ పాత్రలకు తగ్గట్టు చేశారు. నానమ్మ పాత్రలో హిందీ నటి సుప్రియ పాఠక్ కనిపించిన సన్నివేశాలు తక్కువే. కాని నటనతో ఆకట్టుకున్నారు. జగపతిబాబు కుమారుడిగా నవీన్ చంద్ర చక్కగా చేశాడు.తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

నటుడిగా ఎన్టీఆర్ తన పాత్రకు న్యాయం చేశాడు. చొక్కా విప్పి మరీ సిక్స్ ప్యాక్ చూపించి కష్టపడ్డాడు. 'అజ్ఞాతవాసి' కంటే త్రివిక్రమ్ బాగా తీశాడు. కాని అసలు కథలో ఆత్మను తెరపై ఆవిష్కరించడంలో ఇద్దరూ విఫలమయ్యారు. అలాగని, తీసి పారేసే సినిమా ఏం కాదు. సినిమాలో ఏదో వెలితి. కమర్షియల్ సినిమా తీయాలా? కొత్తగా కమర్షియల్ అంశాలకు దూరంగా సినిమా తీయాలా? అని ఎటూ తేల్చుకోలేక అటూ ఇటుగా త్రివిక్ర‌మ్‌ సినిమా తీశాడు. అందువల్ల, అభిమానులతో పాటు ప్రేక్షకుల మనసులను అటూ ఇటూగా ఆకట్టుకునే అంశాల దగ్గర సినిమా ఆగింది.

  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here