English | Telugu
సినిమా పేరు: అమీతుమీ
బ్యానర్ : గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్
Rating : 2.25
విడుదలయిన తేది : Jun 9, 2017
Facebook Twitter Google

ఎవ‌రి బ‌లం వాళ్లు తెలుసుకొంటే... ఆ బ‌లాన్ని బ‌లంగా చూపించుకోగ‌లిగితే... త‌ప్ప‌కుండా విజ‌యం వ‌రిస్తుంది.  ఆ మాట అక్ష‌రాలా నిజం. రాజ‌మౌళికి ఎమోష‌న్స్ ఎక్క‌డ పండించాలో తెలుసు. అందుకే.. రాజ‌మౌళి త‌న సినిమాల్లో ఎప్పుడూ ఎక్క‌డా ఎమోష‌న్స్ వ‌ద‌ల‌డు. త్రివిక్ర‌మ్‌కి మాట‌లు ఎప్పుడు ఎక్క‌డ ఎలా వాడాలో తెలుసు. అందుకే... త‌న డైలాగ్ మార్క్ ని న‌మ్ముకొంటూ సినిమాలు తీస్తాడు. ఇంద్ర‌గంటి బ‌లం... వినోదం. అదీ.. సున్నితంగా సాగే వినోదం. దాన్ని న‌మ్ముకొన్న ప్ర‌తీసారీ ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ హిట్లు కొడుతూనే ఉన్నాడు. అమీ తుమీ బ‌లం కూడా.. ఆ వినోద‌మే. మ‌రి ఈసారి ఇంద్ర‌గంటికి ఎలాంటి ఫ‌లితం వ‌చ్చింది?  అమీ - తుమీ క‌హానీ ఏంటి?  చూద్దాం... అభీ... అభీ...

* క‌థ‌

ఆనంద్ (అడ‌వి శేష్‌), దీపిక (ఈషా) ప్రేమించుకొంటారు.  అయితే  దీపిక తండ్రి (త‌నికెళ్ల భ‌ర‌ణి) కి ఆనంద్ అంటే ఇష్టం ఉండ‌దు. త‌న కూతురికి బాగా డ‌బ్బున్న‌ శ్రీ‌ చిలిపి (వెన్నెల‌కిషోర్‌)కి ఇచ్చి పెళ్లి చేయాల‌నుకొంటాడు. జ‌నార్థ‌న్ కొడుకు విజ‌య్ (అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌)  మాయ (అదితి) అనే అమ్మాయిని  ప్రేమిస్తుంటాడు.  మాయ కి ఇంట్లో చాలా స‌మ‌స్య‌లున్నాయి. త‌న తండ్రికి ఇష్టం లేకుండా విజ‌య్ ని పెళ్లి చేసుకోలేదు. అలాగ‌ని ఆ ఇంట్లోనూ ఉండ‌లేదు. అందుకే న‌న్ గా మారిపోవాల‌ని చూస్తుంది. ఈలోగా వైజాగ్ నుంచి చిలిపి పెళ్లి చూపుల కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. చిలిపి నుంచి త‌ప్పించుకోవ‌డానికి దీపిక ఓ నాట‌కం ఆడుతుంది. అదేంటి??  ఈ నాట‌కం వ‌ల్ల చిలిపి అడ్డంగా ఎలా బుక్ అయ్యాడు??  చివ‌రికి  ఏ ప్రేమ‌క‌థ ఏ తీరాన్ని చేరింది?  అనే విష‌యాలు తెలియాలంటే.... అమీ తుమీ చూడాల్సిందే. ఎనాలసిస్ :

ఇదో క‌న్‌ఫ్యూజ‌న్ డ్రామా. ఒక‌రునుకొని ఇంకొక‌ర్ని పెళ్లి చేసుకొనే ఓ క‌న్‌ఫ్యూజ‌న్ పాత్ర (చిలిపి) చుట్టూ అల్లుకొన్న క‌థ ఇది. క‌థ‌లో ఎలాంటి కొత్త‌ద‌నం లేదు. అంతా.. ఆ క‌థ‌ని చూపించిన విధానం లోనే. రెండు పాత్ర‌లు.. మ‌ధ్య‌లో ఓ బ‌క‌రా.. ఇదీ స్ణూలంగా క‌థ‌. ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి క‌థ కంటే.. చిలిపి అనే పాత్ర‌నే ఎక్కువ‌గా న‌మ్ముకొన్నాడు. ఆ పాత్రే.. ఈ సినిమానీ గ‌ట్టెక్కించింది.  క‌థ మొద‌లైన తీరు... సాగే విధానం.. ఇవ‌న్నీ నిదానంగానే ఉంటాయి. పాత్ర‌ల ప‌రిచయానికి క‌థ‌లోకి వెళ్ల‌డానికి టైమ్ ప‌డుతుంది. వెన్నెల కిషోర్ వ‌చ్చేంత వ‌ర‌కూ..  నిదానించిన అమీతుమీ.. అక్క‌డి నుంచి తుఫాన్ వేగం అందుకొంటుంది. సినిమా స్టిరింగ్ మొత్తం.. వెన్నెల కిషోర్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. త‌న కామెడీ టైమింగ్ తో థియేట‌ర్లో న‌వ్వులు పూయించాడు. వెన్నెల కిషోర్ వ‌చ్చాక‌... ఇద్ద‌రు హీరోలూ సైడ్ అయిపోతారంటే.. ఈ పాత్ర‌కి ద‌ర్శ‌కుడు ఎంత ప్రాముఖ్య‌త ఇచ్చాడో అర్థం అవుతుంది.  అస‌లు ఈ సినిమాలో క‌థే లేదు. చిలిపి పాత్ర చేసే గార‌డీ త‌ప్ప‌. ఆ పాత్ర చుట్టూ అల్లుకొన్న స‌న్నివేశాలు బాగున్నాయి. క్లైమాక్స్ కూడా చుట్టేసిన‌ట్టు అనిపించినా... అక్క‌డా వెన్నెల కిషోర్ ఆ ఫీలింగ్‌ని త‌గ్గించే ప్ర‌య‌త్నం చేశాడు. అమీ తుమీ గురించి ప‌ది మాట‌లు చెప్పాలంటే ఆ పదీ చిలిపి పాత్ర గురించే. ఆ పాత్ర‌ని ఈ సినిమా నుంచి వేరు చేయ‌లేం. చేస్తే.. ఈ సినిమా చూళ్లేం. అంతే.


* న‌టీన‌టులు

అవ‌స‌రాల‌, అడ‌విశేష్ లు హీరోలు అనుకొన్నా.. వాళ్ల‌వి స‌హాయ పాత్ర‌లుగా మారిపోయాయి. అస‌లైన హీరో వెన్నెల కిషోరే. త‌న కామెడీ టైమింగ్ సూప‌ర్‌. సాధార‌ణ‌మైన డైలాగ్ ని కూడా వెన్నెల కిషోర్ త‌న టైమింగ్‌తో కిక్ ఎక్కించాడు. అవ‌స‌రాల పాత్ర‌కు అన్యాయం చేశారేమో అనిపిస్తుంది. క‌నీసం అడ‌వి శేష్ కి ఒక్క డ్యూయెట్ అయినా ఇచ్చారు. ఈషా మ‌రోసారి చ‌క్క‌ని న‌ట‌న ప్ర‌ద‌ర్శించింది. తెలుగు వ‌న్ నుంచి వ‌చ్చిన వెబ్ సిరీస్ - పాష్ పోరీస్ లో కీల‌క పాత్ర పోషించిన అతిధి కి ఈ సినిమాతో హీరోయిన్ గా ప్ర‌మోష‌న్ వ‌చ్చింది. త‌న‌ని చూస్తుంటే స్వాతి గుర్తొస్తుంటుంది. మాయ పాత్ర‌లో స‌హ‌జంగా న‌టించింది.  భ‌ర‌ణిలాంటి సీనియ‌ర్ న‌టుడి గురించి చెప్పుకొనేదేముంది?  త‌న పాత్ర‌లో అల్లుకుపోయాడు. కుమారి పాత్ర‌లో భార్గ‌వి న‌వ్వులు పంచుతుంది. 

*సాంకేతిక వ‌ర్గం

మ‌ణిశ‌ర్మ సంగీతంలో రెండు పాట‌లే వినిపించాయి. ఆ రెండూ సంద‌ర్భానికి త‌గిన‌ట్టు వాడుకొన్నాడు ద‌ర్శ‌కుడు. నేప‌థ్య సంగీతం మాత్రం చ‌క్క‌గా కుదిరింది. క‌థ‌, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం.. ఈ విభాగాల‌న్నీ ద‌ర్శ‌కుడే చూసుకొన్నాడు. అన్నింట్లోనూ... మాట‌ల ర‌చ‌యిత‌గా త‌న ముద్ర స్ప‌ష్టంగా క‌నిపించింది. ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం సంభాష‌ణ‌లే. చాలా సింపుల్‌గా అర్థ‌వంతంగా, అందంగా మాట‌ల్ని ప్ర‌యోగించాడు ఇంద్ర‌గంటి. ద‌ర్శ‌కుడిగా క‌థ‌పై కాస్త ప‌ట్టు తెచ్చుకొంటే మ‌రింత బాగుండేది.తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

అమీ తుమీ... ఇది వెన్నెల కిషోర్ మ‌హిమే సుమీ

  
  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here