English | Telugu
సినిమా పేరు: అదిరింది
బ్యానర్ : తెనాండాళ్ స్టూడియో లిమిటెడ్
Rating : 2.50
విడుదలయిన తేది : Nov 9, 2017
Facebook Twitter Google

‘నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం... దేశంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా లభించడమే నిజమైన అభివృద్ధి’... అన్నాడు మహాత్ముడు. కానీ.. మన దేశంలో అత్యంత ఖరీదైనవి విద్యా వైద్యాలే. దీన్ని బట్టి మన దేశాభివృద్ధి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  వైద్యరంగంలో భారతావని దూసుకుపోతోంది అనేది ప్రచార ఆర్భాటాలకే సరిపోతుంది కానీ.. నిజానికి పేదవాడికి నాణ్యమైన వైద్యాన్ని అందించే దేశాల లిస్ట్ లో మన స్థానం వంద తర్వాతే. మళ్లీ ప్రపంచ దేశాలన్నింటికీ వైద్యుల్ని సరఫరా చేసేదీ మనమే. ఈ పరిణామాలను చూసి భారతీయుడు ఆనందించాలా? లేక బాధ పడాలా? అంబులెన్స్ సౌకర్యంలేని ప్రభుత్వాసుపత్రులు దేశంలో కోకొల్లలు. కనీసం మార్చురీ వ్యానులు కూడా లేని ఆసుపత్రులున్నాయంటే నమ్ముతారా? రీసెంట్ మార్చురీ వ్యాన్ లేక.. ఓ వ్యక్తి తన భార్య భౌతిక దేహాన్ని భుజాన ఎత్తుకొని కిలోమీటర్ల కొద్దీ నడిచిన ఉదాంతం జరిగింది మన దేశంలోనే.
 
నార్మల్ డెలివరీ అయ్యే కాన్పులకు కావాలని సిజేరియన్లు చేయడం.. ఏ రోగం లేని వాడు హెల్త్ చెకప్పుకని వస్తే.. లేనిపోని రోగాలని అంటగట్టి వాడ్ని మానసికంగా చంపేయడం. ప్రతి దానికీ టెస్టులు, చిన్న దానికే ఆపరేషన్లు. ప్రభుత్వాసుపత్రులలో ఆధునిక వైద్య పరికరాల కొరత. ప్రైవేటు ఆసుపత్రులలో నిజాయితీ కొరత. మనిషి బతుకుని డబ్బుతో వెలకడుతున్న నీచమైన సంస్కృతి వైద్య రంగంలో ఉంది. ఈ అవినీతిని ఎండగడుతూ దర్శకుడు అట్లే తయారు చసుకున్న కథే ‘మెర్సల్’. వైద్య వృత్తిలోని తెలుపు కోటు కప్పుకున్న అనకొండల్ని చెడుగుడు  ఆడుతూ ఆట్లే రూపొందించిన ఈ చిత్రం ‘అదిరింది’ గా  తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ చిత్రం తమిళనాట అఖండ విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. దక్షిణభారత దేశంలో ‘బాహుబలి’ తర్వాత అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. మరి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే లక్షణాలు ఈ సినిమాలో ఉన్నాయా? లేవా? తెలుసుకునే ముందు... కథలోకెళ్దాం.

కథ:-

కథనం ప్రకారం కథ ఎక్కడ్నుంచి మొదలైనా.. అసలు కథ మాత్రం 80ల కాలం నుంచి మొదలవుతుంది.  వైద్యం అందని దీనస్థితిలో  గ్రామప్రజలున్న కాలం అది. చిన్న చిన్న సమస్యలకే ప్రాణాలు కోల్పోతున్న ప్రజలను చూసి చలించిన ఓ జంట.. తమ యావదాస్థినీ పణంగా పెట్టి ఆ ఊరిలో ఓ ఆసుపత్రి కడతారు. ‘మేం వైద్యం అందిస్తాం’ అని కొందరు వైద్యులు బాసటగా నిలవగానే.. పొంగిపోతారు. వాళ్లు వైద్యవృత్తిలో ఉన్న మేక వన్నె పులలని తెలీక..  తామ సర్వస్వమైన ఆసుపత్రిని వాళ్లకు అప్పజెబుతారు. పాము అన్న తర్వాత విషం చిమ్మటం సహజం. అలాగే.. వీళ్లు కూడా విషం కక్కుతారు. పురిటి నొప్పులతో తాము కట్టిన ఆసుపత్రికే చేరిన ఆ ఇల్లాలికి ‘సాధారణ కాన్సు’ అని తెలిసినా... బలవంతంగా కావాలని సిజేరియన్ చేస్తారు.  పెద్ద ప్రాణానికీ , పసి ప్రాణానికీ కూడా ఎసరు పెడతారు. ఎదురు తిరిగినందుకు.. భర్తను చంపుతారు. తను చనిపోతూ... ‘ఒక నిజానికి ఇప్పుడు మీరు కప్పిపుచ్చొచ్చు. కానీ.. ఆ నిజమే.. తర్వాత రెండుగా వచ్చి మీ అంతు తేలుస్తుంది’ అని కన్నుమూస్తాడు. మరి ఆ నిజం రెండుగా ఎలా వచ్చింది? కలుపు మొక్కల్ని ఏ విధంగా ఏరిపారేసింది? అనేది మిగిలిన కథ.ఎనాలసిస్ :

వైద్య రంగంలోని లోపాలను ఎండగడుతూ గతంలో సినిమాలొచ్చాయ్. వెంకటేశ్ ‘గణేష్’.. చిరంజీవి ‘ఠాగూర్’  ఆ కోవకు చెందిన చిత్రాలే. ‘అదిరింది’ కూడా అలాంటి సినిమానే అయినా.. ఈ సినిమాలో వైద్యరంగంలోని లోపాలకు కారణమైన మూలాలను టచ్ చేశాడు దర్శకుడు. ఆంబులెన్స్ డ్రైవర్ల దగ్గర్నుంచి కార్పొరేట్ హాస్పటల్స్ అధినేతల వరకూ ఉండే లోపాయికారి సంబంధాలను అద్దం పట్టాడు. ‘నిజంగా ఇంత దారుణంగా జరుగుతాయా?’ అని ప్రేక్షకులు నిశ్చేష్టపోయేలా చేశాడు. ఆసుపత్రుల కారణంగా జనాలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్య ఈ సినిమాలో కనిపిస్తుంది. నిజంగా ఈ విషయంలో దర్శకుడు అట్లేని అభినందించకుండా ఉండలేం.

విభిన్నమైన కథనం ఈ సినిమాకు వరం. ఫస్టాఫ్ లో ఆడియన్ కన్ఫూజన్ కి లోనవుతాడు. కానీ... పోను పోను ఒక్కోముడిని విప్పుకుంటూ.. ప్రేక్షకుల మనసుల్లో ఉత్పన్నమయ్యే ప్రతి ప్రశ్నకూ సమాధానాలిస్తూ ఆసక్తిగా కథను ముందుకు నడిపించాడు దర్శకుడు. సినిమా మొదలైన అరగంట వరకూ.. విజయ్ వైద్యం తెలిసిన మిజీషియన్ గా, మేజిక్ తెలిసిన డాక్టర్ గా కనిపిస్తాడు. తర్వాత తెలుస్తుంది మెజీషియన్ వేరు, డాక్టర్ వేరు అని. అంటే ఇద్దరు విజయ్ లనమాట. ఆహా... విజయ్ ఇందులో ద్విపాత్రాభినయం చేశాడా? అని అనుకునే లోపే సెకండ్ హాఫ్ లో మూడో విజయ్ ఎంటర్ అవుతాడు. ఆడియన్స్ నిజంగా సంభ్రమకు లోనవ్వాల్సిందే. సమాజంలో తీవ్రమైన ఓ సమస్యకు వాణిజ్య అంశాలను మేళవించి దర్శకుడు వండర్ అనిపించేలా సినిమాను తీశాడు.

విజయ్ ఇందులో చేసిన మూడు పాత్రలూ ఒకదానికొకటి పొంతన లేనివే. అందుకు తగ్గట్టే అదరగొట్టేశాడు విజయ్. తమిళనాట అతని అభిమానులు పండగ చేసుకొనే ఉంటారు. సన్నివేశాలు కూడా అలాంటివి పడ్డాయ్. మాస్ ని విపరీతంగా మెప్పించేశాడు విజయ్. హీరోయిన్లలో నిత్యామీనన్ ది ప్రాధాన్యత ఉన్న పాత్ర. స్వతహాగా మంచి నటి.. మంచి పాత్ర పడింది. ఇక ఊరుకుంటుందా! చెలరేగి పోయింది. సమంత, కాజల్ కథలో లేరు. కథనంలో కలిపాడు దర్శకుడు. ఉన్నతలో సినిమాను అలంకరించారు. వాళ్లకు అంతకంటే సినిమాలో పనిలేదు. ఎస్.జె.సూర్య ఇందులో మెయిన్ విలన్. హీరోకు ధీటైన పాత్ర. అద్భుతహ అనిపించాడు.

ఇక సాంకేతికంగా చెప్పుకుంటే... ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు గురించే. కథ, స్క్రీన్ ప్లే చక్కగా రాసుకున్నాడు. తీయడం కూడా అందరికీ నచ్చేలా తీశాడు. తర్వాత చెప్పుకోవాల్సింది కెమెరా. జి.కె.విష్ణు కెమెరా ఈ చిత్రానికి హైలైట్. పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణాన్ని గుర్తు చేశాడు. సినిమా సిట్యువేషన్స్ లోకి తీసుకెళ్లి ఆడియన్స్ ని కూర్చోబెట్టాడు. ఇక సంగీతం.. ఏ.ఆర్.రెహ్మాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు. రెహ్మాన్ అంతకుముందు ఎన్నో అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్స్ అందించి మనందరి అభిమానాన్ని పొంది ఉన్నాడు కాబట్టి... ఈ సినిమా విషయంలో ఆయన గురించి మాట్లాడుకోం. మగిలిన విభాగాలు కూడా ఒకర్ని మించి ఒకరు పనిచేశారు.తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

మొత్తంగా చెబితే... సినిమా అయితే బావుంది. కానీ.. తమిళ నేటివిటీ ఎక్కువగా ఉంది. మరి మనోళ్లకి సరిగ్గా ఎక్కుతుందో లేదో చెప్పలేం.

  
  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here