English | Telugu
సినిమా పేరు:  సెవెన్
బ్యానర్ : కిరణ్ స్టూడియోస్
Rating : 2.50
విడుదలయిన తేది : Jun 6, 2019
Facebook Twitter Google

నటీనటులు: హవీష్, రెజీనా, సుంకర లక్ష్మి, రెహమాన్, నందితా శ్వేత, అనీషా అంబ్రోస్, త్రిధా చౌదరి తదితరులు
నిర్మాణ సంస్థలు: రమేష్ వర్మ ప్రొడక్షన్స్, కిరణ్ స్టూడియోస్
పాటలు: శ్రీమణి, పులగం చిన్నారాయణ, శుభం విశ్వనాథ్
మాటలు: జీఆర్ మహర్షి
సంగీతం: చైతన్ భరద్వాజ్
కథ, కథనం, నిర్మాత: రమేష్ వర్మ
ఛాయాగ్రహణం, దర్శకత్వం: నిజార్ షఫీ
విడుదల తేదీ: జూన్ 6, 2019

సరైన విజయం ఎదురు చూస్తున్న హవీష్ 'సెవెన్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆరుగురు హీరోయిన్లు ఈ సినిమాలో నటించడం, ట్రైల‌ర్‌లో లిప్ కిస్సులు చూపించడం వల్ల సినిమాకు క్రేజ్ వచ్చింది. క్రేజ్‌కు త‌గ్గ‌ట్టు సినిమా ఉందా? లేదా?

కథ:

వర్షంలో తడుస్తూ పోలీస్ స్టేషన్ గడప తొక్కుతుంది రమ్య (నందితా శ్వేత). తన భర్త కార్తీక్ (హవీష్ కోనేరు) కనిపించడం లేదంటూ కంప్లైంట్ చేస్తుంది. ఏసీపీ విజయ్ ప్రకాశ్ (రెహమాన్) అసలేం జరిగిందని ప్రశ్నిస్తాడు. కార్తీక్‌తో ఎలా ప్రేమ‌లో ప‌డిందీ చెప్పడం ప్రారంభిస్తుంది రమ్య. ప్రేమకథ మధ్యలో ఉండగా... 'తర్వాత ఏం జరిగిందో నేను చెప్పనా?' అంటూ ఏసీపీ మిగతా కథను పూర్తి చేస్తాడు. తమ కథ ఏసీపీకి ఎలా తెలిసిందని రమ్య ఆశ్చర్యపోతుంది. ఆర్నెల్ల క్రితం జెన్నీ (అనీషా అంబ్రోస్) కూడా తన భర్త కార్తీక్ కనిపించడం లేదని ఇదే కథ చెప్పి కంప్లైంట్ ఇస్తుంది. చెన్నైలో మరో అమ్మాయి కూడా. పోలీసులు కార్తీక్‌ని అరెస్ట్ చేస్తారు. రమ్య, జెన్నీ ఎవరో తనకు తెలియదని కార్తీక్ చెబుతాడు. వార్తల ద్వారా కార్తీక్ అరెస్ట్ విషయం తెలుసుకున్న ప్రియా (త్రిధా చౌదరి) పోలీస్ స్టేషన్ గడప తొక్కుతుంది. కార్తీక్ తన భర్త అని చెబుతుంది. ఆధారాలు ఏసీపీ ముందు ఉంచుతుంది. దాంతో ఆమెను కార్తీక్ దగ్గరకు తీసుకువెళతారు. ప్రియాను కార్తీక్ గుర్తుపడతాడు. తన భార్య అని చెబుతాడు. కానీ, ప్రియా మాత్రం పోలీస్ దగ్గరున్న తుపాకీ తీసుకుని కార్తీక్‌ని షూట్ చేస్తుంది. ఆమె ఎందుకలా చేసింది? అతడికి నిజంగా ముగ్గురు అమ్మాయిలు తెలియదా? లేదా మోసం చేయాలని అలా చెప్పాడా? మరి, ప్రియా తెలుసని ఎందుకు చెప్పాడు? కార్తీక్‌కి, సరస్వతి (రెజీనా)కి సంబంధం ఏంటి? కృష్ణమూర్తి ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.ఎనాలసిస్ :

రమేష్ వర్మ మంచి కథ, కథనం రాశారు. కానీ, అనుకున్న కథను అనుకున్న విధంగా తెరపైకి తీసుకురావడంలో నిర్మాతగా ఆయన, దర్శకుడిగా నిజార్ షఫీ ఏమాత్రం సఫలీకృతం కాలేదు. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఎవరు అడ్డు వచ్చినా చంపడానికి వెనుకాడని ఓ అమ్మాయి కథే ఈ సినిమా. ఆ అమ్మాయి ఎవరనేది చెబితే సినిమా చూడబోయే ప్రేక్షకులకు థ్రిల్ ఉండదు. అందుకని, చెప్పడం లేదు. రమ్యకృష్ణకు ఎంతో పేరు తెచ్చిన 'నరసింహ'లో నీలాంబరి పాత్ర ఛాయలు ఈ పాత్రలో కనపడతాయి. నీలాంబరిగా రమ్యకృష్ణ వివిధ దశల్లో కనిపించి మెప్పించారు. యుక్త వయసులో అందంగా, వయసు మళ్లిన దశలో పగతో రగిలిపోయే సన్నివేశాల్లో అత్యుత్తమ నటన కనబరిచారు. అటువంటి నటిని ఎంపిక చేసుకోవడంలో కథకుడు రమేష్ వర్మ, దర్శకుడు నిజార్ షఫీ విఫలమయ్యారు. మరో రెండు మూడు పాత్రలు సరైన నటీనటులను తీసుకోలేదు. దాంతో పతాక సన్నివేశాల్లో ప్రేక్షకులు థ్రిల్లింతకు బదులు చక్కిలిగింతలు పెట్టుకుంటే వచ్చేంత నవ్వు వచ్చింది. పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకుని ఉంటే సినిమా అద్భుతంగా వచ్చేది. నిజార్ షఫీ దర్శకుడిగా కంటే సినిమాటోగ్రాఫర్‌గా ఎక్కువ మార్కులు అందుకుంటాడు. ప్రతి ఫ్రేమ్ బాగుంది. దర్శకుడిగా ప్రేమకథను ఆసక్తికరంగా మలచలేదు. పాటల్లో మాత్రమే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. చైతన్ భరద్వాజ్ స్వరాలు, నేపథ్య సంగీతం సినిమాకు అండగా నిలిచాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:
కథ, కథలో ట్విస్టులు
సినిమాటోగ్రఫీ
పాటలు, నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్, క్లైమాక్స్
నటీనటుల ఎంపిక
దర్శకత్వం

నటీనటుల పనితీరు:

నటనలో హవీష్ మరింత పరిణితి సాధించాలి. అప్పుడే ప్రేక్షకులను ఆకట్టుకోగలడు. రెజీనా తన పాత్రకు న్యాయం చేసింది. నందితా శ్వేత, అనీషా అంబ్రోస్ పాత్రల్లో ఈతరం అమ్మాయిల వేషధారణ, ప్రవర్తన కనిపించాయి. అనీషా అంబ్రోస్ అందాల విందుతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కీలకమైన పాత్రలో త్రిధా చౌదరి కనిపించింది. అదితి ఆర్య పాత్రకు ప్రాముఖ్యం ఏమీ లేదు. అతిథిలా రెండు సన్నివేశాల్లో వచ్చి వెళ్లింది. పూజితా పొన్నాడ కూడా అంతే. రెండు మూడు సన్నివేశాల్లో కనిపిస్తుంది. తనవరకూ సుంకర లక్ష్మి బాగా చేశారు. కానీ, ఆ పాత్రకు ప్రేక్షకుల్లో ఇమేజ్ ఉన్న నటిని తీసుకుని ఉంటే సన్నివేశాలు పండేవి. రెహమాన్ కి ఇటువంటి పాత్రలు చేయడం కొట్టిన పిండి. హీరో స్నేహితులుగా ధనరాజ్, వేణు, విలేకరిగా స్వామిరారా సత్య ఉన్నంతలో వినోదం పండించడానికి కృషి చేశారు. కానీ, కుదరలేదు.  తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

ఫస్టాఫ్ సోసోగా సాగుతుంది. అసలైన కథ, మలుపులు సెకండాఫ్‌లో వస్తాయి. ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి. మంచి కథకు, ఉత్కంఠ రేకెత్తించే కథనం తోడవడంతో సెకండాఫ్ కాసేపు అలరిస్తుంది. చివర్లో స‌ర్‌ప్రైజ్ ప్యాకేజ్‌లా నవ్విస్తుందీ సినిమా. థ్రిల్ సంగతి, తెరకెక్కించిన తీరు పక్కన పెడితే... కథలో మెయిన్ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా నవ్వుతారు. కాస్త థ్రిల్... కాస్త కామెడీ కోసం ఈ సినిమా చూడవచ్చు.

  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here