English | Telugu
సినిమా పేరు: 2.ఓ రివ్యూ
బ్యానర్ : లైకా ప్రొడక్షన్
Rating : 3.25
విడుదలయిన తేది : Nov 29, 2018
Facebook Twitter Google

నటీనటులు: రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, అమీ జాక్సన్‌, సుదాంశు పాండే, అదిల్‌ హుస్సేన్‌, కళాభవన్‌ షాంజాన్‌, రియాజ్‌ఖాన్‌ తదితరులు
సంస్థ: లైకా ప్రొడక్షన్స్‌
నిర్మాత: ఎ.సుభాష్‌కరణ్‌, రాజు మహాలింగం
సినిమాటోగ్రఫీ: నీరవ్‌ షా
సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌
ఎడిటింగ్‌: ఆంథోని
ఆర్ట్‌: టి.ముత్తురాజు
వీఎఫ్‌ఎక్స్‌ అడ్వైజర్‌: శ్రీనివాసమోహన్‌
ఫైట్స్‌: సెల్వ
రచన, దర్శకత్వం: శంకర్‌
విడుదల తేదీ: 29-11-2018

రజనీకాంత్ పేరే ఓ బ్రాండ్. ఆ బ్రాండ్ వేల్యూకి శంకర్ తోడైతే? ఓ 'శివాజీ', ఓ 'రోబో' వచ్చాయి. ఈ రెండు సినిమాల్లో 'రోబో' వెరీ వెరీ స్పెషల్. చిట్టిగా రజనీకాంత్ చేసిన హంగామాను ఎవరూ అంత త్వరగా మరువలేరు. వెరీ వెరీ స్పెషల్ 'రోబో'కి సీక్వెల్‌గా, కొత్త క‌థ‌తో రూపొందిన‌ సినిమా '2.ఓ'. రజనీకాంత్‌కి తోడు అక్ష‌య్‌కుమార్‌ వున్నారిందులో! ప్రచార చిత్రాల్లో పక్షిరాజుగా ఆయన గెటప్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. వీళ్లిద్దరికీ తోడు సుమారు రూ. 550 కోట్ల బడ్జెట్.. నాలుగేళ్ళ శంకర్ శ్రమ.. రోజు రోజుకీ సినిమాపై అంచనాలను పెంచింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో అంతర్జాతీయ సినిమాల స్థాయిలో తీసిన సినిమాగా పేర్కొంటున్న '2.ఓ' ఎలా వుంది? రివ్యూలో చూడండి!

క‌థ‌:
చెన్నైలో ప్రజలందరి చేతుల్లోంచి సెల్‌ఫోనులు హ‌ఠాత్తుగా మాయమవుతాయి. గాల్లోకి ఎగిరి ఎటో వెళతాయి. ఎటువంటి ఆధారాలు లభించక పోలీసులు తలలు పట్టుకుంటారు. ఈ కేసును పరిష్కరించలేక నిస్సహాయులుగా మిగులుతారు. సెల్‌ఫోనులు మాయం కావడం వెనుక మిస్టరీని చేధించడానికి ప్రొఫెసర్ వశీకర్ (రజనీకాంత్) రంగంలోకి దిగుతాడు. సెల్ ఫోనులతో ఏర్పడిన పక్షి పలు విధ్వంశాలకు పాల్పడుతుంది. ఆ పక్షిని ఎదుర్కోవడానికి చిట్టి రోబోను మళ్లీ తీసుకురావాలని ప్రభుత్వ పెద్దలతో జరిగిన సమావేశంలో వశీకరణ్ ప్రతిపాదిస్తాడు. కొంత తర్జన భర్జనలు తరవాత ప్రభుత్వం చిట్టికి ఆమోదముద్ర వేస్తుంది. అప్పుడు చిట్టి ఏం చేశాడు? అసలు, సెల్ ఫోనులు ఎందుకు మాయం అయ్యాయి? పక్షిరాజా (అక్షయ్ కుమార్) ఎవరు? పక్షిరాజాకూ, సెల్ ఫోనులకు సంబంధం ఏంటి? పక్షీరాజాతో ప్రజలకు ఏర్పడిన సమస్యను వశీకర్, చిట్టి రీలోడెడ్ వెర్షన్ '2.ఓ' ఎలా పరిష్కరించాడు? అనేది మిగతా సినిమా!ఎనాలసిస్ :

'రోబో' విజయానికి అందులో స్పెషల్ ఎఫెక్ట్స్ మాత్రమే కారణం కాదు. రజనీకాంత్ నుంచి ప్రేక్షకులు కోరుకునే హీరోయిజం పలు సన్నివేశాల్లో వుంది. చిట్టి రోబోగా రజనీ చేసిన విన్యాశాలు వున్నాయి. మంచి కథ వుంది. ఈ '2.ఓ'లో అవేవీ లేవు. దర్శకుడు శంకర్ కథ, రజనీ హీరోయిజం వంటి అంశాలను వదిలేసి విజువల్ ఎఫెక్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఆయన సినిమాల్లో కనిపించే బలమైన కథ, భావోద్వేగాలు ఇందులో కనిపించలేదు. హీరోయిజాన్నీ, విజువల్ ఎఫెక్ట్స్‌ని బ్యాలన్స్ చేయడంలోనూ ఆయన తడబడ్డాడు. ఏమాటకామాటే చెప్పుకోవాలి... విజువల్ ఎఫెక్ట్స్‌ని సమర్థవంతంగా ఉపయోగించుకుని చిట్టి - పక్షిరాజు మధ్య రూపొందించిన ఫైట్స్ అబ్బురపరుస్తాయి. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం సూపర్బ్. భారతీయ సినిమాల్లో టెక్నాలజీ పరంగా వున్నత స్థాయిలో వుందీ సినిమా. నిర్మాత ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. సాంకేతిక నిపుణులు అందరూ చక్కటి పనితీరు కనబరిచారు. త్రీడీ ఎఫెక్ట్స్ జస్ట్ ఏవరేజ్.

ప్లస్ పాయింట్స్:
రజనీకాంత్ యాక్టింగ్, యాటిట్యూడ్
అక్షయ్‌కుమార్ ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్‌
చిట్టి - పక్షిరాజు మధ్య ఫైట్స్
విజవల్ ఎఫెక్ట్స్ అండ్ క్లైమాక్స్
ఎఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం  
 
మైనస్ పాయింట్స్:
బలహీనమైన కథ, స్క్రీన్‌ప్లే...
రజనీకాంత్ అభిమానులు కోరుకునే హీరోయిజం లేదు
ప్రేక్షకులకు అర్థం కాని రీతిలో పాజిటివ్, నెగిటివ్ ఆరాల విశ్లేషణ
లేడీ రోబోగా అమీ జాక్సన్
 
నటీనటుల పనితీరు:
ప్రేక్షకులు కోరుకునే రజనీకాంత్ హీరోయిజమ్, మార్క్ డైలాగ్ డెలివరీ, యాక్టింగ్, యాటిట్యూడ్‌ క్లైమాక్స్ ఫైట్‌లో మాత్రమే కనిపిస్తాయి. చిట్టి రీలోడెడ్ వెర్షన్ '2.ఓ' వచ్చిన తరవాతే అభిమానులకు ఈలలు వేసే అవకాశం దక్కింది. అప్పటివరకూ రజనీకాంత్ పాత్ర సాధారణంగా వుంటుంది. '3.ఓ'గా అయితే రజనీకాంత్ చించేశారు. ఈ సినిమాలో రజనీకాంత్ పంచ్ డైలాగులు లేకపోవడం లోటు. అక్షయ్ కుమార్ పక్షిరాజుగా ఎక్కువ కనిపిస్తాడు. ముసలి వ్యక్తిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. లేడీ రోబోగా అమీ జాక్సన్ పాత్ర ప్రేక్షకులకు రిజిస్టర్ కాదు. ఇతర నటీనటుల్లో తమిళ ముఖాలు ఎక్కువ.తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

కథ పరంగా సినిమాలో ఏమీ లేదు. రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతున్నాయని, మనుషులంతా సెల్ వాడకం తగ్గించాలని శంకర్ ఇందులో సందేశం ఇచ్చాడు. ఈ కథాంశాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాడు. ఆత్మను నెగిటివ్ ఫోర్స్‌గా చూపించి.. ఆత్మతో రోబో ఫైట్ చేస్తే ఎలా వుంటుందనే ఊహతో సినిమా తీశారు. శంకర్ ఊహకు, అద్భుత దృశ్యాలను తెరపై చూపినందుకు సెల్యూట్ చేయాల్సిందే. అలాగే, చివరి 30 నిమిషాల్లో రజనీకాంత్ నటన సినిమాను నిలబెట్టింది. సినిమాలో కథ, లాజిక్కులు వెతకడం మానేసి విజువల్ వండర్ మేజిక్‌ని, ఫైట్స్‌ని ఎంజాయ్ చేయడం మంచిది. విజువల్ వండర్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ '2.ఓ'. హాలీవుడ్ సినిమాలు చూసిన అనుభూతి ఇస్తుంది.

  
  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here