ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను తిరిగి ఓపెన్ చేసుకోడానికి అనుమతి ఇచ్చింది. సినిమా థియేటర్లు మినహా అన్ని రంగాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. ఇతర పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ పార్కులతో పాటు రెస్టారెంట్లు, బార్లకు ఎటువంటి పరిమితులు లేకుండా పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. సినిమాల విషయానికి వస్తే విషయాలు భిన్నంగా ఉంటున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో పెట్టుబడులను తిరిగి పొందే అవకాశం లేనందున నిర్మాతలు ఆ రూల్‌కు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు.
కొంతమంది నిర్మాతలు పెట్టుబడులను తిరిగి పొందడానికి అదనపు షోలు, టికెట్ల ధరల పెంపుతో పాటు కనీసం 75 శాతం ఆక్యుపెన్సీ ప్లాన్‌ను సూచిస్తున్నారు. 2021 జనవరి 1 నుండి కేంద్రం 100 శాతం ఆక్యుపెన్సీని మంజూరు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికైతే, ప్రభుత్వ పరిమితులతో తమ సినిమాలను విడుదల చేయడానికి టాలీవుడ్ నిర్మాతలు సిద్ధంగా లేరు, థియేటర్లు తెరుచుకుంటాయన్న సంతోషంతోనూ లేరు. అదనపు షోలు వేస్తే అందుకు అనుగుణంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. అందువల్ల ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఒనగూడే ప్రయోజనం తక్కువే.
దేశం మొత్తం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఈ తరుణంలో రూ. 50 టికెట్‌ను రూ. 100 చేస్తే కొనడానికి ఎవరు సిద్ధంగా ఉంటారనేది పెద్ద ప్రశ్న. టికెట్ ధరలు పెరిగితే చాలా మధ్యతరగతి కుటుంబాలు థియేటర్ల ముఖం చూడవు. 50 శాతం ఆక్యుపెన్సీ పరిమితి ఉన్నంత కాలం భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో విడుదలవుతాయనే నమ్మకం లేదు. వచ్చే సంక్రాంతిపై టాలీవుడ్ ఆశలు పెట్టుకుంది. థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం ఉంటేనే వరుస చిత్రాలు విడుదలవడానికి ఆస్కారం కలుగుతుంది.
హైదరాబాద్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చిత్రపరిశ్రమపై వరాల జల్లు కురిపించారు. ఈ వరాలకు టాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతారనీ, ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఆకాశానికెత్తేస్తారనీ ఆయనకూ, ఆయన తనయుడు కేటీఆర్‌కూ బాగా తెలుసు. అసలు సినిమా ఇండస్ట్రీపై ఈ వరాలను ప్రకటించడానికి వెనుక కేటీఆర్ ఉన్నారని వినిపిస్తోంది. వారి ఊహలకు తగ్గట్లే చిరంజీవి, మహేశ్‌బాబు మొదలుకొని అనేకమంది సెలబ్రిటీలు, సినిమా సంఘాలు తెలంగాణ ప్రభుత్వానికీ, కేసీఆర్, కేటీఆర్‌లకు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ముంగిట వారికి ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది!