విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి ఒక ఉత్తేజకరమైన చిత్రం పనిలో బిజీగా ఉన్నాడు. 'ఫైటర్' పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించి చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో విజయ్ బాక్సర్ పాత్రను పోషిస్తున్నాడు. అతని జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తోంది.
విజయ్ తండ్రి పాత్రలో నటించడానికి సీనియర్ మలయాళ నటుడు సురేష్ గోపిని పూరి సంప్రదించినట్లు తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రంలో తండ్రీకొడుకుల అనుబంధం ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. సురేష్ గోపి అయితే ఆ క్యారెక్టర్‌కు న్యాయం జరుగుతుందని పూరి భావిస్తున్నాడు. 'పోలీస్ కమిషనర్' లాంటి డబ్బింగ్ సినిమా ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.
మలయాళంలో స్టార్ యాక్టర్ అయిన ఆయన శంకర్ డైరెక్షన్లో వచ్చిన 'ఐ' మూవీలో విలన్‌గానూ నటించి తనలోని విలక్షణతను ప్రదర్శించారు. కొంతకాలం విరామంతో ఆయన మిగతా భాషల చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు. ఒకేసారి వేర్వేరు సినిమాల్లో భాగం కావాలని ఆయన ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ, సురేష్ గోపి వస్తే కచ్చితంగా ఈ ప్రాజెక్టుకు చాలా విలువ వస్తుందని చెప్పవచ్చు. త్వరలో దీనికి సంబంధించి అధికారిక సమాచారం రానుంది.