Home » Movie Reviews » జాంబి రెడ్డి



Facebook Twitter Google


సినిమా పేరు: జాంబి రెడ్డి
తారాగ‌ణం: తేజ స‌జ్జా, ఆనంది, నాగ‌మ‌హేశ్‌, విన‌య్ వ‌ర్మ‌, హేమంత్‌, ద‌క్ష‌, కిరీటి, గెట‌ప్ శ్రీ‌ను, పృథ్వీ, అన్న‌పూర్ణ‌, మ‌హేశ్ విట్టా, ర‌ఘు కారుమంచి, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, ప్రియ‌, హ‌రితేజ‌, త్రిపుర‌నేని చిట్టి, విజ‌య రంగ‌రాజు, చ‌ర‌ణ్‌దీప్‌ 
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్‌విల్లే
మ్యూజిక్‌: మార్క్ కె. రాబిన్‌
సినిమాటోగ్ర‌ఫీ: అనిత్‌
ఎడిటింగ్‌: సాయిబాబు
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: శ్రీ‌నాగేంద్ర తంగ‌ల‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: ఆనంద్ పెనుమ‌త్స‌, ప్ర‌భ చింత‌ల‌పాటి
లైన్ ప్రొడ్యూస‌ర్‌: వెంక‌ట్ కుమార్ జెట్టి
నిర్మాత‌: రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ‌
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌శాంత్ వ‌ర్మ‌
బ్యాన‌ర్‌: యాపిల్ ట్రీ స్టూడియోస్
విడుద‌ల తేదీ: 5 ఫిబ్ర‌వ‌రి 2021


టాలీవుడ్‌కు జాంబి కాన్సెప్ట్‌ను ఇంట్ర‌డ్యూస్ చేస్తూ వ‌స్తున్న ఫిల్మ్‌గా 'జాంబి రెడ్డి' రిలీజ్‌కు ముందు బాగానే ప‌బ్లిసిటీ పొందింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పాపుల‌ర్ అయిన తేజ స‌జ్జా హీరోగా ప‌రిచ‌యం అవుతుండ‌టం, 'అ!', 'క‌ల్కి' మూవీల‌తో టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌గా ప్ర‌శంస‌లు పొందిన ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేయ‌డంతో ఈ సినిమాపై ఇటు ఇండ‌స్ట్రీలో, అటు ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ రేకెత్తింది. 

క‌థ‌
మారియో (తేజ స‌జ్జా) ఒక వీడియో గేమ్ డిజైన‌ర్‌. త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి అత‌ను డిజైన్ చేసిన ఓ గేమ్‌లో హై లెవ‌ల్‌లో ప్రాబ్లెమ్స్ వ‌స్తాయి. దాన్ని స‌రిచేయ‌గ‌లిగేది ఆ టీమ్‌లోని క‌ల్యాణ్ (హేమంత్‌). కానీ అత‌డు పెళ్లి చేసుకోవ‌డానికి క‌ర్నూలుకు వెళ్తాడు. దాంతో త‌ప్ప‌నిస‌రిగా అత‌డి కోసం మారియో టీమ్ క‌ర్నూలులోని రుద్ర‌వ‌రం వెళ్తుంది. అక్క‌డ క‌ల్యాణ్ కాబోయే మామ భూమారెడ్డి (విన‌య్ వ‌ర్మ‌), ఆ పక్క ఊరు ఎర్ర‌కాలువ‌లోని ఉండే అత‌ని శత్రువు వీరారెడ్డి (నాగ‌మ‌హేశ్‌) మ‌ధ్య జ‌రిగే పోరులో ఇరుక్కుపోతారు. మారియోతో పాటు క‌ర్నూలు వెళ్లిన భ‌ద్ర (కిరీటి) అనే ఫ్రెండ్ జాంబీగా మారిపోతాడు. ఆ త‌ర్వాత రుద్ర‌వ‌రం ప‌రిస్థితి ఏమ‌య్యింది?  మారియో వెళ్లిన ప‌ని ఏమైంది? భ‌ద్ర జాంబీగా ఎందుకు మారాడు?  త‌న గేమ్ ప‌నికోసం వెళ్లిన మారియో అక్క‌డ ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్ని ఎదుర్కొన్నాడు? అనేవి మిగ‌తా క‌థ‌లో మ‌నం తెలుసుకుంటాం.



ఎనాలసిస్ :

జాంబీ జాన‌ర్‌లో వ‌చ్చిన తొలి తెలుగు సినిమా 'జాంబి రెడ్డి'. నిజానికి ఇది ప్యూర్ జాంబీ జాన‌ర్ మూవీ క‌థ కాదు. హాలీవుడ్ స‌హా ఇంట‌ర్నేష‌న‌ల్‌గా జాంబీ జాన‌ర్‌లో ప‌లు సినిమాలు ఓ వేవ్‌లా వ‌చ్చాయి. వాటిలో కొన్ని సినిమాలు ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకోగా, మిగ‌తావి ఇలా వ‌చ్చి అలా పోయాయి. జాంబీ స్టోరీల‌కు లాజిక్ ఉండ‌దు. ఆ లాజిక్‌ను ఆడియెన్స్ ప‌ట్టించుకోకుండా ఉండాలంటే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఒక్క‌టే మార్గం. ఆ విష‌యంలో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ కొంత‌మేర‌కు స‌క్సెస‌య్యాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ జాంబీ ఫిలిమ్స్‌లో సాధార‌ణంగా జాంబీలుగా మారిన‌వాళ్లు మ‌ళ్లీ మామూలు కావ‌డం ఉండ‌దు. వారు వింత‌మృగాలుగా ప్ర‌వ‌ర్తిస్తూనే చ‌నిపోతుంటారు.

ప్ర‌శాంత్ వ‌ర్మ ఆ త‌ర‌హాని కాకుండా జాంబీ స్టోరీని ఇండియ‌నైజ్ చేశాడు. మ‌న సెన్సిబిలిటీస్‌, మ‌న సెంటిమెంట్స్‌కు త‌గ్గ‌ట్లుగా క్లైమాక్స్‌ను రూపొందించాడు. ముందు చెప్పిన‌ట్లుగా అక్క‌డ ఆడియెన్స్ లాజిక్‌ను ప‌ట్టించుకోకుండా ఉంటేనే సినిమా స‌క్సెస్ అవుతుంది. సినిమా ఓపెనింగ్ సీన్‌లో ఓ పావురం పిడుగుపాటుకు గురై ఓ గుడిలోని కొల‌నులో ప‌డిపోయి, మ‌ళ్లీ బ‌తికి ఎగిరిపోతుంది. ఆ షాట్‌కూ, క్లైమాక్స్‌కూ ముడిపెట్ట‌డం డైరెక్ట‌ర్ ప‌నిత‌నానికి నిద‌ర్శ‌నం.

జాంబీ స్టోరీకి ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్నంతా వ‌ణికిస్తోన్న క‌రోనాను క‌నెక్ట్ చేశారు కానీ, ఇందులో క‌రోనా అనేది ప్ర‌ధానాంశం కాదు. ఉన్మాదిగా మారిన ఓ సైంటిస్ట్ (త్రిపుర‌నేని చిట్టి) ఎర్ర‌‌కాలువ ఊరి పొలిమేర‌లో ర‌హ‌స్యంగా కొవిడ్ వ్యాక్సిన్ ప్ర‌యోగాలు చేస్తుంటాడు. జంతువుల మీద కాకుండా డైరెక్ట్‌గా మ‌నుషుల మీదే అత‌ను చేస్తున్న ప్ర‌యోగాలు విక‌టించి, ఒక వ్య‌క్తి జాంబీగా మారిపోయాడ‌నీ, అత‌ను కొర‌క‌డం వ‌ల్లే మారియో ఫ్రెండ్ భ‌ద్ర కూడా జాంబీగా మారిపోవ‌డం ఫ‌స్టాఫ్‌లోనే మ‌నం చూస్తాం. ఇక సెకండాఫ్ అంతా జాంబీల్యాండ్‌గా రుద్ర‌వ‌రం ఎలా మారిపోయిందో, జాంబీల నుంచి త‌ప్పించుకోడానికి మారియో బృందం ఎలాంటి క‌ష్టాలు ప‌డిందో చూస్తాం. రాయ‌ల‌సీమ‌లో ఈ క‌థ జ‌ర‌గ‌డం వ‌ల్ల దీనికి డైరెక్ట‌ర్ ఫ్యాక్ష‌నిజాన్ని జోడించాడు. నందినీ రెడ్డి (ఆనంది) క్యారెక్ట‌ర్‌లోని ట్విస్ట్ ప్రీ క్లైమాక్స్‌లో వెల్ల‌డై అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది.

మారియో, నందినీరెడ్డి, భూమారెడ్డి, వీరారెడ్డి, క‌ల్యాణ్ క్యారెక్ట‌రైజేష‌న్స్ ఆక‌ట్టుకుంటాయి. నిజం చెప్పాలంటే చిన్న చిన్న‌ పాత్ర‌ల్ని కూడా చాలా శ్ర‌ద్ధ‌గా ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దాడు. క్లైమాక్స్‌లో ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా వెల్ల‌డ‌య్యే విష‌యాలు మ‌న‌ల్ని ఆశ్చ‌ర్యచ‌కితుల్ని చేస్తాయి. గెట‌ప్ శ్రీ‌ను, పృథ్వీ, హేమంత్, మ‌హేశ్ విట్టా పాత్ర‌లు హార‌ర్‌లోనూ వినోదాన్ని పంచుతాయి.

టైటిక్ ట్రాక్‌లో సాహిత్యం ఏమాత్రం అర్థంకాకుండా గ‌జిబిజిగా ఉండి, ఇబ్బంది పెడుతుంది. అయితే మార్క్ కె. రాబిన్ బ్యాగ్రౌండ్ స్కోర్ 'జాంబి రెడ్డి' స్టోరీకి టెంపోను తీసుకొచ్చింది. అనిత్ సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్‌గా ఉంది. సాయిబాబు ఎడిటింగ్ సినిమాకు ఎస్సెట్‌. డైరెక్ట‌ర్ ఎంత నిడివి సినిమాని తీశాడో తెలీదు కానీ, రెండు గంట‌ల ఐదు నిమిషాల‌కే దాన్ని కుదించి, ఉత్కంఠ‌భ‌రితంగా సినిమా న‌డ‌వ‌డానికి అత‌ను ప్ర‌య‌త్నించాడు. ప్రొడ‌క్ష‌న్ విలువ‌లు బాగానే ఉన్నాయి.

న‌టీన‌టుల అభిన‌యం
మారియో అలియాస్ మ‌ర్రిపాలెం ఓబుల్ రెడ్డిగా తేజ స‌జ్జా రాణించాడు. హీరోగా తొలి సినిమా అయినా, ఎక్క‌డా తొట్రుపాటు లేకుండా ఆ క్యారెక్ట‌ర్ పోషించాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కావాల్సినంత ఎక్స్‌పీరియెన్స్ ఉండ‌టంతో కెమెరా ఫియ‌ర్ లేకుండా అల‌వాటైన ప‌నిలా సునాయాసంగా చేసుకుపోయాడు. 'బ‌స్‌స్టాప్' మూవీలో చూసిన ఆనంది, 'జాంబి రెడ్డి'లో చూసిన ఆనంది ఒక‌రేనా అనే డౌట్ వ‌స్తుంది. నందినీరెడ్డి క్యారెక్ట‌ర్‌లో ఆమె వండ్రఫుల్ ప‌ర్ఫార్మెన్స్ ప్ర‌ద‌ర్శించింది. ఆగ‌ర్భ శ‌త్రువుల్లాగా క‌నిపించే ఫ్యాక్ష‌నిస్టులుగా నాగ‌మ‌హేశ్‌, విన‌య్ వ‌ర్మ రాణించారు. పెళ్లికొడుకు క‌ల్యాణ్‌గా హేమంత్ త‌న బాడీ లాంగ్వేజ్‌కు స‌రిపోయిన క్యారెక్ట‌ర్‌ను ఈజీగా చేశాడు. మారియో ఫ్రెండ్స్‌గా ద‌క్ష‌, కిరిటి... వీరారెడ్డి అనుచ‌రుడిగా పృథ్వీ... భూమారెడ్డి త‌ల్లిగా అన్న‌పూర్ణ‌... అనుచ‌రులుగా గెట‌ప్ శ్రీ‌ను, మ‌హేశ్ విట్టా... మారియో తండ్రి ప్ర‌తాప‌రెడ్డిగా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ త‌మ పాత్ర‌ల‌ను అర్థం చేసుకొని న‌టించారు.



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

జాంబీ జాన‌ర్ ల‌వ‌ర్స్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు త‌గ్గ రీతిలో ఈ సినిమా ఉండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే.. ఇది ప్యూర్ జాంబీ జాన‌ర్ మూవీ కాదు. 'జాంబి రెడ్డి'ని జాంబీ కామెడీ జాన‌ర్ మూవీగా పేర్కొన‌వ‌చ్చు. ఆ జాన‌ర్‌ను ప్ర‌శాంత్ వ‌ర్మ మ‌న‌కు ప‌రిచ‌యం చేశాడు. ఎలాంటి ఎక్స్‌పెక్టేష‌న్స్ లేకుండా వెళ్తే ఎంజాయ్ చేయ‌ద‌గ్గ సినిమా.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.