నటీనటులు: రాజ్ తరుణ్, మాళవికా నాయర్, హెబ్బా పటేల్, మధునందన్, సీనియర్ నరేష్, పోసాని కృష్ణమురళి, వాణీ విశ్వనాథ్ తదితరులు
మాటలు: నంద్యాల రవి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ
సంగీతం: అనూప్ రూబెన్స్
దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
నిర్మాత: కెకె రాధామోహన్
విడుదల తేదీ: 1 అక్టోబర్ 2020 (ఆహా ఓటీటీలో)
కరోనా వల్ల ఎఫెక్ట్ అయిన సినిమాల్లో 'ఒరేయ్ బుజ్జిగా' ముందువరుసలో ఉంటుంది. మార్చిలో సినిమాకి ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. సినిమాను విడుదల చేయాలని సిద్ధమవుతున్న తరుణంలో కరోనా వల్ల థియేటర్లు బంద్ కావడం, సినిమా విడుదల వాయిదా పడటం జరిగాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీలో విడుదలైంది. 'గుండెజారి గల్లంతయ్యిందే', 'ఒక లైలా కోసం' సినిమాల తరవాత చాలా విరామం తీసుకుని విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉంది? రాజ్ తరుణ్ కి మరో విజయాన్ని అందిస్తుందా?
కథ
చెన్నైలో బీటెక్ చదివిన బుజ్జిగాడి (రాజ్ తరుణ్) సొంత ఊరు నిడదవోలు. చదువు పూర్తి చేసుకుని ఇంటికి రాగానే తండ్రి కోటేశ్వరరావు (పోసాని కృష్ణమురళి) పెళ్లి చేయడానికి సిద్ధమవుతాడు. ఆల్రెడీ హైదరాబాద్ లో ఒక అమ్మాయిని బుజ్జిగాడు ప్రేమిస్తాడు. అయితే, ఆ విషయం అమ్మాయికి చెప్పడు. ప్రపోజ్ చేద్దామని ఇంట్లో అమ్మకి చెప్పి వెళ్ళిపోతాడు. అదే రోజున నిడదవోలులోని కృష్ణవేణి (మాళవికా నాయర్) పెళ్లి. బావతో నిశ్చయించిన ఆ సంబంధం ఆమెకు ఇష్టం లేదు. అందుకని, ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇద్దరూ ఒకే ట్రైన్ ఎక్కడం చూసిన ఊళ్ళో ఒకడు... కలిసి లేచిపోయారని చెబుతాడు. తరవాత ఏం జరిగింది? ఆ విషయం తెలిసిన బుజ్జిగాడు, కృష్ణవేణి ఏం చేశారు? వాళ్ళకు ఒకరికొకరు పరిచయమైన తరవాత ప్రేమలో ఎప్పుడు పడ్డారు? అసలు నిజం ఎవరికి ఎప్పుడు తెలిసింది? అనేది చిత్రకథ.
సినిమా ప్రారంభమైన పావుగంట, ఇరవై నిమిషాలకి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందనేది ప్రేక్షకులకు ఒక ఐడియా వస్తుంది. అరగంట తరవాత మేజర్ ట్విస్ట్ ఏంటో, ఇంటర్వెల్ ఎలా ఉంటుందో, క్లైమాక్స్ ఏంటో కూడా ఊహించవచ్చు. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో సినిమా తీస్తున్నప్పుడు కామెడీతో ప్రేక్షకులను కితకితలు పెట్టేలా ఉండాలి. ఆ విషయంలో దర్శకుడు విజయ్ కుమార్ కొండా, మాటల రచయిత నంద్యాల రవి ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. ఏదో అక్కడక్కడా నవ్వించగలిగారు తప్పితే ఎక్కువసేపు బోర్ కొట్టించారు. సినిమా చూస్తున్నంతసేపూ దర్శకుడి గత సినిమాలు గుర్తుకు వస్తాయి. పాటలు కూడా సోసోగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్, కెమెరా వర్క్ పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
రాజ్ తరుణ్
కామెడీ
మైనస్ పాయింట్స్
స్టోరీ, స్క్రీన్ ప్లే
రొటీన్ సన్నివేశాలు
సినిమా నిడివి
సంగీతం
నటీనటుల పనితీరు
రాజ్ తరుణ్ తనకు అలవాటైన పక్కింటి కుర్రాడి పాత్రలో మరోసారి నటించాడు. ఆ క్యారెక్టర్, సన్నివేశాలకు అతడి నేచురల్ డైలాగ్ డెలివరీ సూట్ అయింది. నటిగా మాళవికా నాయర్‌కి చెప్పుకోదగ్గ పాత్ర లభించలేదు. ఆమె స్టయిలింగ్ బాలేదు. సినిమాలో ఎక్కువసేపు కనిపించినప్పటికీ ఎక్కువగా ఏమీ చేయలేకపోయింది. హెబ్బాది అతిథి పాత్రకు కాస్త ఎక్కువ ఉంటుందంతే. డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ అసలు సూట్ కాలేదు. మధునందన్, నరేష్, పోసాని, సత్య తదితరులవి రొటీన్ పాత్రలే. వాణీ విశ్వనాథ్ ఇమేజ్ వల్ల ఆ పాత్రకు కాస్త హుందాతనం వచ్చింది.
ప్రేక్షకులను నవ్వించే ఉద్దేశంతో తీసిన 'ఒరేయ్ బుజ్జిగా'. కథలో కొత్తదనం ఏమీ లేదు. కామెడీకి కథతో పనిలేదు. సన్నివేశాలు, డైలాగులు వర్కవుట్ అయితే చాలు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు రొటీన్ అయినప్పటికీ వర్కవుట్ అయ్యాయి. మరికొన్ని వర్కవుట్ కాలేదు. ఓటీటీలో ప్రేక్షకులకు ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే... నచ్చని సన్నివేశాలను ఫార్వార్డ్ చేసుకోవడం. అలా ఫార్వార్డ్ చేసుకుంటూ వెళితే కొంతవరకూ చూడొచ్చు.