Home » Movie Reviews » మిడిల్ క్లాస్ మెలోడీస్



Facebook Twitter Google


నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, చైతన్య గరికిపాటి, దివ్య శ్రీపాద, ప్రేమ్ సాగర్ తదితరులు
కథ, మాటలు, స్క్రీన్ ప్లే: జనార్దన్ పసుమర్తి 
సినిమాటోగ్రఫీ: సన్నీ కె
స్వరాలు: స్వీకార్ అగస్తీ 
నేపథ్య సంగీతం: ఆర్.హెచ్. విక్రమ్
అడిషనల్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వినోద్ ఆనంతోజు 
నిర్మాత: వి. ఆనంద ప్రసాద్ 
విడుదల తేదీ: 20 అక్టోబర్ 2020 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో)

'దొరసాని'తో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి కథానాయకుడిగా వచ్చారు. దాంతో ఆశించిన విజయం అందుకోలేదు. ఆనంద్ హీరోగా నటించిన రెండో సినిమా 'మిడిల్ క్లాస్ మెలోడీస్'. థియేటర్లలో విడుదల చేయాలని భవ్య క్రియేషన్స్ అధినేత వి. ఆనందప్రసాద్ సినిమా ప్రారంభించారు. కరోనా కారణంగా పరిస్థితులు మారడంతో ఓటీటీలో విడుదల చేశారు. మరి, ఈ సినిమా ఎలా ఉంది? ఆనంద్ దేవరకొండకు విజయాన్ని అందించిందా? 

కథ: రాఘవ (ఆనంద్ దేవరకొండ) తండ్రి కొండలరావు గుంటూరుకి కొంత దూరంలోని కొలకలూరులో చిన్న హోటల్ ఉంటుంది. తండ్రికి సహాయం చేస్తున్నప్పటికీ గుంటూరు వెళ్లి హోటల్ పెట్టి సక్సెస్ అవ్వాలనేది రాఘవ కోరిక. తాను చేసే బొంబాయి చట్నీ ఓసారి రుచి చూసినవాళ్లు మళ్ళీ మళ్ళీ హోటల్ కి వస్తారనేది అతడి నమ్మకం. కానీ, అలా ఏమీ జరగదు. పైగా, 'నీ చట్నీ అంత గొప్పగా ఏమీ ఉండదు బావా! నేను తిన్నగా... నీ కంటే మా సందు చివర తోపుడు బండి దగ్గర బ్రహ్మాండంగా ఉంటుంది' అని సంధ్య (వర్ష బొల్లమ్మ) ముఖం మీద చెబుతుంది. ఆమె ఎందుకలా చెప్పింది? మరదలు సంధ్యతో రాఘవ ప్రేమకథ ఏమైంది? మధ్యలో ఎటువంటి కష్టాలు వచ్చాయి? చివరికి, ఎలా సుఖాంతమైంది? అనేది సినిమా. 



ఎనాలసిస్ :

 సినిమాలో పెద్ద కథేమీ లేదు. మన పల్లెటూళ్లలో పాత్రలను, వాళ్ల ఆశలను తెరపైకి తీసుకు రావాలని చేసిన ప్రయత్నమే 'మిడిల్ క్లాస్ మెలోడీస్'. గతంలో 'కేరాఫ్ కంచరపాలెం', 'ఉయ్యాలా జంపాలా' సినిమాల్లో ఇటువంటి ప్రయత్నాలు జరిగాయి. విజయాలు సాధించాయి. ఆ సినిమాల స్థాయిలో ఈ సినిమా నిలబడలేకపోవడానికి ప్రధాన కారణం కథలో కాన్‌ఫ్లిక్ట్, లవ్ ట్రాక్. సినిమాలో క్యారెక్టర్లు కరెక్టుగా కుదిరాయి. కానీ, క్యారెక్టర్లకు తగ్గట్టు చక్కటి కథను రాయడంలో జనార్దన్ పసుమర్తి, ఎంచుకోవడంలో దర్శకుడు వినోద్, నిర్మాత ఆనంద ప్రసాద్ చిన్న చిన్న తప్పులు చేశారు. 

బావను హీరోయిన్ అంతలా ప్రేమించడానికి గల కారణాలు ఏవో సరిగా చూపించలేదు. హోటల్ సక్సెస్ కాలేదని హీరో పడే స్ట్రగుల్, తర్వాత సక్సెస్ కావడం వంటివి విపులంగా చూపించకుండా సింపుల్ గా ముగించారు. దానికి తోడు సెకండాఫ్ లో కథ ఎంతసేపటికీ ముందుకు కదలకుండా విసిగించింది. పతాక సన్నివేశాలను ఆదరాబాదరాగా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. బహుశా... కరోనా వల్ల చిత్రీకరణ చేయలేక అడ్జస్టులు చేశారేమో! అయితే... సినిమాను సహజంగా తెరకెక్కించడంతో టీమ్ అంతా సక్సెస్ అయ్యారు. కుటుంబమంతా కలిసి చూసే వినోదాత్మక సన్నివేశాలను అందించారు. హీరో తండ్రి క్యారెక్టరైజేషన్, అందులో గోపరాజు రమణ నటన సినిమాను చాలాసేపు ముందుకు లాగించింది. స్వీకర్ అగస్తీ పాటలు బావున్నాయి. పల్లె వాతావరణానికి తగ్గట్టు మంచి బాణీలు ఇచ్చాడు. ఆర్.హెచ్. విక్రమ్ నేపథ్య సంగీతం ఓకే. ఎడిటింగ్ బాలేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌:
హీరో తండ్రి పాత్ర, నటన 
సినిమాలో సహజత్వం
పాటలు

మైనస్‌ పాయింట్స్‌:
కథ, కథలో కాన్‌ఫ్లిక్ట్
లవ్ ట్రాక్
సెకండాఫ్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం 

నటీనటుల పనితీరు: హీరో తండ్రి కొండలరావు పాత్రలో గోపరాజు రమణ నటించారు. బహుశా... ఆ పాత్రలో ఆవేశపరుడిగా ఆయన కంటే అద్భుతంగా ఎవరూ జీవించలేరేమో! పాత్రకు ప్రాణం పోశారు. పాత్రలో ఆయన ఆవేశం నవ్విస్తుంది. ఆయన యాస, భాష కూడా బాగున్నాయి. ఆనంద్ దేవరకొండ పక్కింటి పల్లెటూరి కుర్రాడిగా నటించారు. వేషభాషలు పర్వాలేదు. కానీ, గుంటూరు యాస మాట్లాడటంలో తడబడ్డారు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ అందంగా ఉంది. ఎమోషనల్ సన్నివేశాల్లో అంతే అందంగా నటించింది. హీరోయిన్ తండ్రిగా ప్రేమ్ సాగర్ బాగా నటించారు. హీరో స్నేహితుడిగా చైతన్య గరికపాటి ఒదిగిపోయారు. దివ్య శ్రీపాద పాత్ర, అందులో ఆమె నటన తాగుబోతు తండ్రులు ఉన్న పిల్లల పరిస్థితిని ఆవిష్కరించాయి. తరుణ్ భాస్కర్ అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు.



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

'మిడిల్ క్లాస్ మెలోడీస్'... జస్ట్ టైమ్ పాస్ మూవీ. ఓటీటీ కాబట్టి ఫార్వార్డ్ చేసుకొనే అవకాశం ఉంది. హీరో తండ్రి క్యారెక్టర్ తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. సాంగ్స్ వినసొంపుగా ఉన్నాయి. కథ మీద ఇంకొంచెం దృష్టి పెట్టి ఉంటే బావుండేది. 

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.