Home » Movie Reviews » 30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా



Facebook Twitter Google


సినిమా పేరు: 30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?
తారాగ‌ణం: ప్ర‌దీప్ మాచిరాజు, అమృతా అయ్య‌ర్‌, వైవా హ‌ర్ష‌, భ‌ద్రం, పోసాని కృష్ణ‌ముర‌ళి, శివ‌న్నారాయ‌ణ‌, హేమ‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేశ్‌, పావ‌ని, శ‌ర‌ణ్య‌, స‌మీర్ (గెస్ట్‌), సుధ (గెస్ట్‌), హైప‌ర్ ఆది
పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, అనంత శ్రీ‌రామ్‌, మున్నా
సంగీతం: అనూప్ రూబెన్స్‌
సినిమాటోగ్ర‌ఫీ: దాశ‌ర‌థి శివేంద్ర‌
ఎడిటింగ్‌: కార్తీక శ్రీ‌నివాస్‌
ఆర్ట్‌: న‌రేశ్ తిమ్మిరి
నిర్మాత‌: ఎస్వీ బాబు
స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, డైరెక్ష‌న్‌: ఫ‌ణి ప్ర‌దీప్ (మున్నా)
బ్యాన‌ర్‌: ఎస్వీ ప్రొడక్ష‌న్స్‌
విడుద‌ల తేదీ: 29 జ‌న‌వ‌రి 2021

టెలివిజ‌న్ యాంక‌ర్‌గా టాప్ రేంజ్‌ను ఎంజాయ్ చేస్తున్న ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న సినిమా కావ‌డంతో '30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?' స‌హ‌జంగానే ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీని రేకెత్తించింది. "నీలి నీలి ఆకాశం ఇద్దామ‌నుకున్నా" పాట యూట్యూబ్‌లో 220 మిలియ‌న్ వ్యూస్ పైగా సాధించడం కూడా సినిమాపై అంచ‌నాలు పెంచాయి. డెబ్యూ డైరెక్ట‌ర్ ఫ‌ణి ప్ర‌దీప్ (మున్నా) రూపొందించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా పబ్లిసిటీ పొందిన ఈ మూవీ నిజానికి ఎలా ఉందో తెలుసా?...

క‌థ‌
ఒకే కాలేజీలో చ‌దువుకొనే అర్జున్ (ప్ర‌దీప్ మాచిరాజు), అక్ష‌ర (అమృతా అయ్య‌ర్‌)కు ఒక‌రంటే ఒక‌రికి ఏమాత్రం గిట్ట‌దు. చ‌దువులో అక్ష‌ర టాప‌ర్ అయితే, అర్జున్ సో పూర్‌. ఒక్క స‌బ్జెక్ట్ కూడా పాస్ కాకుండా ఫైన‌ల్ ఇయ‌ర్ దాకా వ‌చ్చేస్తాడు. కానీ అత‌డికి బాక్సింగ్ అంటే ప్రాణం. ఎప్పుడూ పోట్లాడుకుంటూ, టీజ్ చేసుకుంటూ ఉండే వాళ్లిద్ద‌రూ ఓసారి అర‌కుకు ఎక్స్‌క‌ర్ష‌న్‌కు వెళ్లి, అనూహ్య ప‌రిస్థితుల్లో వారి ప్ర‌మేయం లేకుండానే ఒక‌రి శ‌రీరంలోకి మ‌రొక‌రు మారిపోతారు. అలా ఎందుకు జ‌రిగింది?  గ‌త‌జ‌న్మ‌‌లో ప్రేమికులైన ఆ ఇద్ద‌రూ ఈ జ‌న్మ‌లో శ‌త్రువుల్లాగా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తున్నారు? తిరిగి ఎవ‌రి శ‌రీరాల‌ను వారు పొందారా? ఈ క్ర‌మంలో ఎలాంటి అనుభ‌వాల‌ను ఎదుర్కొన్నార‌నేది మిగ‌తా క‌థ‌.



ఎనాలసిస్ :

ఫ‌స్టాఫ్ బోరింగ్ స్క్రీన్‌ప్లే, సెకండాఫ్ ఓవ‌ర్ డోస్ మెలోడ్రామా.. '30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?' ఇంతే! ఇది రెండు జ‌న్మ‌ల క‌థ‌. కాక‌పోతే 2 గంట‌ల 23 నిమిషాల సినిమాలో ఒక జ‌న్మ‌క‌థ 20 నిమిషాల కంటే ఎక్కువ ఉండ‌దు. నిజానికి సినిమా స్టార్ట‌య్యేది మునుప‌టి జ‌న్మ క‌థ‌తోటే. ఫ్లాష్‌బ్యాక్ నెరేష‌న్‌తో కాకుండా స్ట్రయిట్ నెరేష‌న్‌తోనే డైరెక్ట‌ర్ సినిమా న‌డ‌ప‌డం ఒకింత రిలీఫ్‌. నిజ‌మైన ప్రేమ అంటే ఏమిట‌ని ఓ స్వామీజీ (శుభ‌లేఖ సుధాక‌ర్‌)ని శిష్యుడు (జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేశ్‌) ప్ర‌శ్నించ‌డంతో ఒక‌రంటే ఒక‌రికి ప్రాణ‌మైన ఇద్ద‌రు స్వ‌చ్ఛ‌మైన మ‌న‌సున్న ప్రేమికుల క‌థ‌ను  చెప్ప‌డంతో సినిమా మొద‌ల‌వుతుంది. 1947లో స్వాతంత్ర్యం వ‌స్తున్న కాలంలో ఒక చిన్న అపోహ‌తో ఇద్ద‌రు ప్రేమికులు చ‌నిపోతారని చూపించారు. ఆ ప్రేమికులు మ‌ళ్లీ పుట్టార‌ని, నీ ప్ర‌శ్న‌కు స‌మాధానం వారి క‌థే చెబుతుంద‌నీ శిష్యుడికి చెప్తాడు స్వామీజీ. ఆ త‌ర్వాత క‌థ ప్ర‌స్తుతానికి వ‌స్తుంది. కాలేజీ సీన్ల‌లో హీరో హీరోయిన్లు అర్జున్‌, అక్ష‌ర మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల కంటే హీరో ఫ్రెండ్స్‌గా క‌నిపించే నాగార్జున (వైవా హ‌ర్ష‌), భ‌ద్రం (భ‌ద్రం) పాత్ర‌ల‌కీ, అర్జున్‌కీ మ‌ధ్య స‌న్నివేశాల‌నే కాస్తంత ఆక‌ట్టుకొనే రీతిలో డైరెక్ట‌ర్ చిత్రించాడు. హాస్ట‌ల్‌లో ఉండి చ‌దువుకొనే కాలేజీ అమ్మాయిలు ఎలాంటి ప‌నులు చేస్తుంటార‌నే విష‌యాన్ని ద‌ర్శ‌కుడు చూపించిన విధానం ఎంట‌ర్‌టైన్‌మెంట్ కంటే ఏవ‌గింపునే ఎక్కువ క‌లిగించింది. ఆ అమ్మాయిల అమ్మ‌లు చీపుర్లు, క‌ర్ర‌ల‌తో వ‌చ్చి త‌మ కూతుళ్ల భ‌ర‌తం ప‌ట్టార‌ని చూపించే సీన్లను భ‌రించ‌లేం.

30 రోజుల్లో ప్రేమ‌లో ప‌డ‌టానికి అర్జున్‌, అక్ష‌ర చేసే ప్ర‌య‌త్నాలను అల‌రించే రీతిలో తియ్య‌డంలో డైరెక్ట‌ర్ ఫెయిల‌య్యాడు. వారి మ‌ధ్య క‌ల్పించిన సీన్లు బోరింగ్‌గా అని‌పిస్తాయి. ఫ‌స్టాఫ్‌లో కంటే సెకండాఫ్‌లో కొన్ని మంచి సీన్లు రాసుకున్నాడు డైరెక్ట‌ర్‌. కానీ కొన్ని సీన్ల‌లో మెలోడ్రామా మోతాడు మించ‌డంతో, రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ కాస్తా మెలోడ్రామా మూవీగా మారిపోయింది. అక్ష‌ర అక్క (శ‌ర‌ణ్య‌) పురిటినొప్పులు ప‌డే సీన్ మాత్రం హృద‌యాన్ని స్పృశిస్తుంది. క‌థను న‌డిపించ‌డానికి స్వామీజీ, శిష్యుల పాత్ర‌ల‌ను ఎంచుకోవ‌డం వ‌ల్ల‌ క‌థాగ‌మ‌నాన్నిఅన‌స‌వ‌రంగా డిస్ట‌ర్బ్ చేస్తున్నాన‌ని డైరెక్ట‌ర్ గ్ర‌హించ‌లేక‌పోయాడు.

హీరో హీరోయిన్లు ఒక‌రి స్థానంలోకి మ‌రొక‌రు వ‌చ్చాక వారి క్యారెక్ట‌రైజేష‌న్లు కాస్త బెట‌ర్‌గా అనిపించాయి. కానీ ముందే చెప్పిన‌ట్లు ఓవ‌ర్ మెలోడ్రామాతో చేజేతులా డైరెక్ట‌ర్ దారిత‌ప్పాడు. హీరోయిన్ ఫాద‌ర్ పోసాని సుబ్బారావు (పోసాని కృష్ణ‌ముర‌ళి)కు రాసిన సీన్లు ఆక‌ట్టుకుంటాయి. హీరో త‌ల్లిదండ్రుల పాత్ర‌ల‌ను ప్రీ క్లైమాక్స్ దాకా ఒక విధంగా చూపించి, అక్క‌డ్నుంచి వేరే విధంగా చూపించ‌డం సింక్ కాలేదు. ఆ మాట‌కొస్తే అమ్మానాన్న‌ల విష‌యంలో హీరో రియ‌లైజ్ అయ్యే సీన్ల‌ను డైరెక్ట‌ర్ స‌రిగా మ‌ల‌చ‌లేక‌పోయాడు. అందువ‌ల్ల హీరోతో ఆడియెన్స్ క‌నెక్ట్ అయ్యే చాన్సులు చాలా త‌క్కువ‌.

టెక్నిక‌ల్‌గా చూస్తే, అనూప్ రూబెన్స్ మ్యూజిక్‌కు అగ్ర‌స్థానం ల‌భిస్తుంది. మెలోడీ, ఫాస్ట్ బీట్‌, సెంటిమెంట్ సాంగ్స్‌కు భిన్న రీతుల్లో ట్యూన్స్ క‌ట్టి త‌న టాలెంట్‌ను ప్ర‌ద‌ర్శించాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా టాప్ క్లాస్‌లో ఉంది. దాశ‌ర‌థి శివేంద్ర సినిమాటోగ్ర‌ఫీ కూడా ఈ సినిమాకు ఓ ప్ల‌స్ పాయింట్‌. సినిమా రిచ్‌గా క‌నిపించ‌డంలో ప్ర‌ధాన పాత్ర మ్యూజిక్‌, సినిమాటోగ్ర‌ఫీల‌దే. ఫ‌స్టాఫ్‌లో స్క్రీన్‌ప్లే వీక్‌గా ఉంద‌నే విష‌యం, సెకండాఫ్‌లో మెలోడ్రామా సీన్లు ఎక్కువ‌య్యాయ‌నే విష‌యం ఎడిట‌ర్ గుర్తించ‌లేక‌పోయాడు. కొన్ని డైలాగ్స్‌ ఆక‌ట్టుకునేవిధంగా, కొన్ని డైలాగ్స్ చికాకు క‌లిగించే విధంగా ఉన్నాయి.

న‌టీన‌టుల అభిన‌యం
యాంక‌ర్‌గా వీక్ష‌కుల అభిమానాన్ని బాగా పొందిన ప్ర‌దీప్ '30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?'లో అర్జున్‌గా ఓ మాదిరిగానే ఆక‌ట్టుకున్నాడు. కాక‌పోతే అత‌ను హీరో మెటీరియ‌ల్ కాద‌నిపిస్తుంది. అత‌ని ఎక్స్‌ప్రెష‌న్స్‌లో యాంక‌రే క‌నిపిస్తున్నాడు కానీ, యాక్ట‌ర్ క‌నిపించ‌డం లేదు. అక్ష‌ర పాత్ర‌లో అమృతా అయ్య‌ర్ ఒదిగిపోయింది. న‌టిగా ఫుల్ మార్క్స్ కొట్టేసింది. వైవా హ‌ర్ష‌, భ‌ద్రం త‌మ‌కు ఇచ్చిన పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు. సినిమాకు రిలీఫ్ పాయింట్ వారి క్యారెక్ట‌ర్లే. పోసాని ఎప్ప‌ట్లా త‌న మార్క్ చూపించాడు. ఎక్కువ‌గా కామెడీ త‌ర‌హా రోల్స్‌లోనే క‌నిపించే హేమ ఈ మూవీలో అర్జున్ త‌ల్లిగా భిన్న‌మైన క్యారెక్ట‌ర్‌లో మెప్పించింది. సెంటిమెంట్‌ను బాగా పండించింది. అర్జున్ తండ్రిగా శివ‌న్నారాయ‌ణ స‌రిపోయాడు. హీరోయిన్ అక్క‌గా శ‌ర‌ణ్య ప్ర‌స‌వ స‌న్నివేశంలో జీవించింది. స్వామీజీ, శిష్యుడి పాత్ర‌ల్లో శుభ‌లేఖ సుధాక‌ర్‌, మ‌హేశ్‌, హీరోయిన్ ఫ్రెండ్ మ‌హాల‌క్ష్మిగా పావ‌ని, గెస్ట్ రోల్స్‌లో స‌మీర్‌, సుధ క‌నిపించారు.



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

భిన్న త‌ర‌హా కాన్సెప్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో కొత్త ద‌ర్శ‌కులు స‌త్తా చాటుతున్న కాల‌మిది. అలాంటిది.. పాత క‌థ‌తో, మూస ధోర‌ణి క‌థ‌నం, స‌న్నివేశాల క‌ల్ప‌న‌తో రూపొందిన '30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?'ని ప్రేక్షకులు ఎలా ప్రేమిస్తారా? డౌటే!

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.