పేరుకి తెలుగమ్మాయే అయినా తమిళ చిత్రాలతోనే నటిగా మంచి గుర్తింపును పొందారు ఐశ్వర్యా రాజేష్. తెలుగులో 'కౌసల్య కృష్ణమూర్తి', 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రాల్లో సందడి చేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీకి.. ఆ రెండు సినిమాలూ నటిగా మంచి పేరు తీసుకువచ్చినా కమర్షియల్ గా మాత్రం వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని 'టక్ జగదీష్' లో రెండో హీరోయిన్ గా నటిస్తున్నారు ఐశ్వర్య.
ఇదిలా ఉంటే.. పాత్ర నిడివి తక్కువే అయినా రెండు మెగా ప్రాజెక్ట్స్ లో నటించే ఛాన్స్ ఐష్ కి దక్కిందని టాలీవుడ్ టాక్. అందులో ఒకటి 'ఆర్ ఆర్ ఆర్' కాగా.. మరొకటి 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్. 'ఆర్ ఆర్ ఆర్' లో యంగ్ టైగర్ జూనియర్ యన్టీఆర్ ని ఆరాధించే గిరిజన యువతి పాత్రలో ఐశ్వర్య కనిపిస్తారని.. ఇక 'అయ్యప్పనుమ్ కోషియుమ్' లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి.. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.