మెగాస్టార్ చిరంజీవి ముచ్చటపడ్డ రీమేక్ 'లూసిఫర్'. మోహన్ లాల్ నటించిన సదరు మలయాళ చిత్రం తెలుగులో అనువాదమైనా.. చిరు ఈ రీమేక్ పై ఎనలేని ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఆ కథకు న్యాయం చేయగల దర్శకుడు దొరకడం లేదన్నదే ఇండస్ట్రీ బజ్. మొదట 'సాహో' డైరెక్టర్ సుజీత్ ని అనుకున్నా.. ఎందుకో తరువాత తన లక్కీ డైరెక్టర్ వి.వి. వినాయక్ వైపు మొగ్గు చూపారు చిరు. ఇద్దరి మధ్య ఈ రీమేక్ విషయమై సుదీర్ఘంగా చర్చలు కూడా జరిగాయని టాక్.
అయితే ఏమైందో ఏమో ఇప్పుడు వినయ్ కంటే హరీష్ శంకర్ అయితేనే ఈ రీమేక్ కి న్యాయం జరుగుతుందని చిరు భావిస్తున్నారట. ఇప్పటికే మెగా కాంపౌండ్ లో 'గబ్బర్ సింగ్', 'గద్దలకొండ గణేష్' వంటి రీమేక్ హిట్స్ హరీష్ కు ఉండడంతో.. తనైతే బావుంటుందనేది చిరు అభిప్రాయం. దానికి తోడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ చేయాలనుకుంటున్న సినిమా వాయిదా పడే అవకాశం ఉండడంతో.. ఈ రీమేక్ కి హరీష్ దాదాపు ఖాయమనే అంటున్నారు. మరి చూడాలి.. 'లూసిఫర్' కెప్టెన్ ఎవరవుతారో?