ఈ శుక్రవారం గట్టెక్కుతుందా?
on Sep 6, 2017
పండగలు అడపాదడపా వస్తుంటాయ్. కానీ... సినిమా వాళ్లకు ప్రతి శుక్రవారం పండగే. ఎందుకంటే... సాథ్యమైనంతవరకూ సినిమాలు విడుదలయ్యేది శుక్రవారమే కదా! గత శుక్రవారం ఒక్క సినిమానే విడుదలైంది. అదే ‘పైసా వసూల్’. హడావిడి అంత ఆ సినిమాదే. రేపు శుక్రవారం మాత్రం రెండు సినిమాలొస్తున్నాయ్. యుద్ధం శరణం, మేడ మీద అబ్బాయ్. మరి ఈ సినిమాల హంగామా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
‘రా రండోయ్ వేడుక చూద్దాం’ తర్వాత రాబోతున్న నాగచైతన్య సినిమా ‘యుద్ధం శరణం’. నిజానికి ఈ సినిమాపై మంచి హైప్ ఉండాలి. కానీ అలాంటిదేం లేకపోవడం విచిత్రం. ‘సోగ్గాడే చిన్నినాయన’చిత్రంలో నాగార్జునకు జోడీగా నటించిన లావణ్య త్రిపాఠి.. ఈ సినిమాలో నాగ్ తనయుడు నాగచైతన్యతో జతకట్టడం ఓ విశేషమైతే... ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ విలన్ గా ఎంట్రీ ఇవ్వడం మరో విశేషం. పోస్టర్ పబ్లిసిటీ అంతా... నాగార్జున ‘శివ’ సినిమాను గుర్తు చేసేలా ఉండటం మరో విశేషం. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రేపు శుక్రవారం రానుంది.
రేపు శుక్రవారం విడుదలవ్వనున్న మరో సినిమా ‘మేడ మీద అబ్బాయ్’. కొంత విరామం తీసుకొని అల్లరి నరేశ్ చేసిన సినిమా ఇది. పాపం... ఈ సినిమా విజయం అల్లరి నరేష్ కి చాలా అవసరం. అందుకే... ఈ దఫా రిస్క్ చేయకుండా రీమేక్ ని ఎంచుకున్నాడు నరేష్. మలయాళంలో హిట్ అయిన ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’... ఈ చిత్రానికి మాతృక. ప్రజిత్.జి దర్శకుడు. మాతృకకు కూడా ఈయనే దర్శకుడు కావడం విశేషం. ఈ సినిమాపై నరేష్ కొండంత ఆశతో ఉన్నాడు. కానీ... సినిమాపై హైప్ లేదు. థియేటర్లు కూడా దొరకని పరిస్థితి. మరి ఇన్ని కష్టాల మధ్య విడుదల అవుతున్న ఈ సినిమా భవితవ్యం రేపు శుక్రవారం తేలిపోనుంది.
ఈ నెల 2న ‘పైసా వసూల్ ’ విడుదలైంది. వీకెండ్ పర్వాలేదనిపించినా... ప్రస్తుతం మాత్రం వసూళ్లు పెద్దగా లేవని టాక్. ఈ నేపథ్యంలో రేపు శుక్రవారం... యుద్ధం శరణం, మేడమీద అబ్బాయ్ రానున్నాయ్. మరి బాక్సాఫీస్ పై ఇవి ఏ మాత్రం ప్రభావం చూపిస్తాయో చూడాలి. ఏది ఏమైనా... 21న ‘జై లవకుశ’విడుదలయ్యే వరకూ పెద్ద సినిమాలేం లేవు. ఈ మూడు సినిమాలే ప్రేక్షకులకు దిక్కు. మరి ఈ అవకాశాన్ని ఈ సినిమాలు సరిగ్గా అందిపుచ్చుకుంటాయా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.