విసుగొచ్చేసిందయ్యా వినాయకా?
on Feb 12, 2018
సక్సెస్ వెనకాల పరిగెత్తడం సినిమా ఇండస్ట్రీలో పరిపాటే. సక్సెస్ ఫుల్ దర్శకునితో పనిచేయాలని హీరోలు కోరుకోవడం... సక్సెస్ ఉన్న హీరోను డైరెక్ట్ చేయాలని దర్శకులు ఆశించడం... సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో సినిమాలు నిర్మించాలని నిర్మాతలు ఆరాటపడటం... ఇదంతా సినిమా ఇండస్ట్రీలో కామన్. అది తప్పుపట్టాల్సిన విషయం కూడా కాదు.
అయితే... ఓ తరహా కథ విజయాన్నివ్వగానే... అదే తరహా కథలతో సినిమాలు తీయడం మాత్రం కచ్చితంగా తప్పుపట్టాల్సిన విషయమే. ఇదే పద్ధతిని ఫాలో అయ్యి... చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. ఉదాహరణకు ‘ఢి’ హిట్ అయ్యింది.. అదే దారిలో సినిమాలు తీసుకుంటూపోయాడు శ్రీనువైట్ల. ఇప్పుడేమైంది?
‘పోకిరి’ హిట్ అయ్యింది. అదే తరహాలో సినిమాలో ముందుకెళ్లాడు పూరీ జగన్నాథ్. ఇప్పుడు పరిస్థితేంటి? 90ల్లో కె.రాఘవేంద్రరావు కూడా ఒకేతరహా సినిమాలు తీస్తూ.. కొన్నాళ్లు గెటన్ అయ్యాడు. తర్వాత ఏమైంది? భక్తి కథలే దిక్కాయ్యాయ్. విషయం ఏంటంటే... ఆయన ఏదైనా తీయగల సమర్థుడు కబట్టి వెంటనే... భక్తి సినిమాలతో విజయాలను అందుకున్నాడు. ఇప్పుటి దర్శకులకు అంత సీనుందా?
ఇప్పుడు ఇదంతా దేనికంటే... ప్రస్తుతం ఇదే తరహా తప్పు చేసి ప్రమాదపు అంచులో ఉన్నాడు దర్శకుడు వి.వి.వినాయక్. ‘కృష్ణ’ సినిమా దగ్గర్నుంచి అదే తరహాలో సినిమాలు చేస్తూ కొంతవరకు ‘ఓకే’ అనిపించాడు. కానీ... ఇప్పుడు జనాలకు విసుగు మొదలైంది. ఇకనైనా మారకపోతే... శృంగభంగమే.
నిజానికి కెరీర్ తొలినాళ్లలో వైరైటీ కథలతో సినిమాలు చేశాడు వినాయక్. ఆది, చెన్నకేశవరెడ్డి ఫ్యాక్షన్ కథలైతే... ’ఠాగూర్’ సమకాలీన సమస్యలను ప్రశ్నించే సినిమా. ‘దిల్’ యూత్ ఫుల్ యాక్షన్ లవ్ స్టోరీ. ఇలా అనమాట. ఈ మధ్య వచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ కూడా ’ఠాగూర్’ తరహా కథే. అందుకే మంచి విజయం లభించింది. రీసెంట్ ‘ఇంటిలిజెంట్’ విషయంలో మాత్రం మళ్లీ పాత దారిలోనే వెళ్లాడు. ఫలితంగా బోక్కబోర్లా పడ్డాడు. ఇప్పటికీ చేయి దాటిపోలేదు. వినాయక్ అదృష్టం తను కథకుడు కాకపోవడమే. కె.రాఘవేంద్రరావు, బి.గోపాల్ తరహాలో బయటి కథల్నే తెరకెక్కించే దర్శకుడు వినాయక్. మనకు చాలామంది రచయితలున్నారు. ఆకుల శివ వెంటే పడకుండా.. రకరకాల కథలు వింటూ ముందుకెళ్తే... విజయాలు అవే వస్తాయ్. ఏమంటారు ఫ్రెండ్స్.
వినాయక్ త్వరలో బాలయ్యబాబుతో సినిమా చేస్తాడనే వార్తలు ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. ‘చెన్నకేశవరెడ్డి’ గా బాలయ్యను ఓ రేంజ్ లో ప్రజెంట్ చేసిన వినాయక్.. ఈ దఫా ఏ విధంగా చూపిస్తాడో చూడాలి. నిజానికి కూడా వినాయక్, బాలయ్య కాంబినేషన్ సూపర్బ్ కాంబినేషన్. సరైన కథ పడాలే కానీ... రికార్డుల వరదే. ఏమంటారు ఫ్రెండ్స్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
