ఏకంగా ‘బాహుబలి’కే పెట్టాడబ్బా! టార్గెట్టూ...
on Aug 23, 2017
రికార్డుల వేట... అంటే చిరంజీవికి ఆట. పక్కహీరో రికార్డులను అస్సలు బతకనిచ్చేవాడు కాదంటే నమ్మండి. ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి.. అది ఎంత నిజమో మీకే అర్థమవుతుంది. వాస్తవ పరిస్థితులను బట్టి చూస్తే... మెగాస్టార్ రికార్డుల పరంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఒకట్రెండు స్థానాల్లో ఉన్న సినిమాలేంటో అందిరికీ తెలుసు. ‘బాహుబలి.. ది బిగినింగ్’, ‘బాహుబలి.. ది కంక్లూషన్’. సో... ఇప్పుడు మెగాస్టార్ టార్గెట్ ‘బాహుబలి’ సినిమాలే అని చెప్పకతప్పదు. ‘సైరా నరసింహారెడ్డి’ విషయంలో మెగాస్టార్ అనుసరిస్తున్న ప్రణాళికలు చూస్తుంటే.. ‘బాహుబలి’కి బలంగానే టార్గెట్ పెట్టాడని అర్థమైపోతుంది.
విశ్వవ్యాప్తంగా తెలుగు సినిమా విడుదలవుతున్న నేటి తరుణంలో... మెగాస్టార్ సినిమా అంటే... వసూళ్లు అసాధారణంగా ఉండటం కామన్. అయితే... ‘బాహుబలి’ రికార్డులు బద్దలవ్వడానికి అవి చాలవ్. దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లోనూ సినిమా విడుదలవ్వాలి. విడుదలైన ప్రతిచోటా ఆడియన్స్ సినిమాను ఓన్ చేసుకోవాలి. అప్పుడైతేనే... ‘బాహుబలి’ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. అందుకే... చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నాడు మెగాస్టార్.
‘సైరా నరసింహారెడ్డి’ కోసం.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ ని తీసుకోవడం కూడా ఈ వ్యూహంలో భాగమే. ఇందులో నరసింహారెడ్డి గురువుగా కీలక పాత్ర పోషించనున్నారాయన. అమితాబ్ సినిమా అంటే... బాలీవుడ్ ఓపెనింగులకు ఇక కొదవేం ఉంటుంది చెప్పండి.
ఏ.ఆర్.రెహమాన్, నయనతార... వీరిద్దరికీ తమిళనాట ఉన్న క్రేజ్ తెలిసిందే. వీరే కాక... తమిళ యువహీరో విజయ్ సేతుపతిని కూడా ఇందులో ప్రత్యేక పాత్రకు తీసుకున్నారు. తమిళనాట భారీ ఓపెనింగ్స్ రావడానికి ఈ ముగ్గురూ చాలు. ఇక మెగాస్టార్ కి అక్కడ కూడా కావల్సినంత క్రేజ్ ఉండనే ఉంది.
ఇక కిచ్చా సుదీప్... కన్నడలో సుదీప్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పైగా చిరంజీవికి కర్నాటక అంటే.. మొదట్నుంచీ కంచుకోటే. ఆయన ప్రతి సినిమాకూ అక్కడ వసూళ్ల వర్షమే. కర్నాటక ప్రజలకు ఇష్టమైన హీరో చిరంజీవి. అక్కడ ఓపెనింగ్స్ కి ఈ కారణాలు చాలు.
కేరళలో చిరంజీవి ‘ఘారానామొగుడు‘ చిత్రం ‘హే రాజా’గా విడులై .. అప్పట్లో శతదినోత్సవాలు జరుపుకుంది. మెగాస్టార్ కి కేరళలో ఉన్న క్రేజ్ అలాంటిది. ఇదే గాక, ఓ క్రేజీ మలయాళ నటుడ్ని కూడా ఇందులో నటింపజేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయ్.
సో... దేశంలో ప్రధానంగా చెప్పుకునే... బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, శాండిల్ వుడ్ లలో... భారీ వసూళ్లు రాబట్టడానికి తగిన వ్యూహమే రచించింది ‘సైరా నరసింహారెడ్డి’ టీమ్. ఇక ఓవర్సీస్ లో చిరంజీవికి కావల్సినంత క్రేజ్. ఈ గణాంకాలన్నింటినీ పరిశీలిస్తే... ‘బాహుబలి’కి భారీగానే టార్గెట్ పెట్టాడు మెగాస్టార్ అని అర్థమైపోతోంది.
అయితే... ఇన్నాళ్లూ చిరంజీవి సాటి హీరోలతో పోటీ పడ్డాడు. తన రికార్డులను బద్దలు చేసిన హీరోల రికార్డులనూ... అంతే వేగంగా బద్దలు కొట్టి... ‘ఔరా మెగాస్టార్’ అనిపించుకున్నాడు. అయితే... ఇప్పుడు చిరంజీవి పోరాటం హీరోలపై కాదు... ఓ దర్శకుడిపై. ‘బాహుబలి’ తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ యవనికపై నిలబెట్టిన రాజమౌళి రికార్డులతో. మరి ఆ రికార్డులను మెగాస్టార్ బద్దలుకొట్టి... ‘సై.. సైరా నరసింహారెడ్డీ...’ అని ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకోగలుగుతాడా? లేక... సాహోరే... బాహుబలి.. అంటూ చేతులెత్తేస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. వచ్చే వేసవి దాకా ఆగాల్సిందే.
- నరసింహ బుర్రా