టాయిలెట్ వస్తే ఎటెళ్లమంటారు? నిర్మాతనే నిలదీసింది..!
on Jul 11, 2017
దాదాపు ఓ మూడేళ్ల క్రితం.. సుందర నగరం వైజాగ్ లో ఓ ప్రేమకథ షూటింగ్ జరుగుతోంది. పేరున్న హీరోహీరోయిన్లే నటిస్తున్నారు. డైరెక్టర్ గారికి అది రెండే సినిమా. పెద్ద నిర్మాణ సంస్థ. షూటింగ్ సరదాగా గడిచిపోతోంది. ఇంతలో నిర్మాత గారికి ఫోన్. అవతల నుంచి వినిపించిన గొంతు విని నిర్మాత ఠపీ మని ఎలర్టయ్యారు. ‘‘వైజాగ్ లో నా పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశాం. మీకు తెలుసు కదా. నేను రేపు వైజాగ్ వస్తున్నాను. అక్కడ బాగా ఎండలంట కదా... కాస్త మీ కేరవాన్ నాకు అరైంజ్ చేయగలరా’’..అని అవతల గొంతు అడగడం పూర్తవ్వకుండానే... ‘‘అయ్యో... మీరడగాలా బాబూ... రేపు మీరు వచ్చేసరికి ఇక్కడ కేరవాన్ రెడీగా ఉంటుంది’’ అని సమాధానం ఇచ్చారు నిర్మాత. థ్యాంక్స్ చెప్పి అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాడు.
ఇక నిర్మాత గారికి ఒకటే టెన్షన్. ఆయన దగ్గర ఉందేమో... ఒకే ఒక్క కేరవాన్. అది కూడా హీరోహీరోయిన్లు ఇద్దరూ చెరోవైపు పంచుకున్నారు. ఫోన్ చేసిందేమో... టాలీవుడ్ నంబర్ వన్ స్టార్. ఇక చేసేదేం లేక.. విషయం మొత్తం హీరోహీరోయిన్లకు చెప్పేరు నిర్మాత. హీరోగారు విశాల హృదయంతో ‘‘అయ్యో... భలేవారే సార్.. అంతపెద్ద స్టార్ ఫోన్ చేసి అడిగాక మనం కాదంటే ఎలా. నేను ఖాళీ చేసేస్తాను’’అన్నాడు. కానీ హీరోయిన్ మాత్రం నేను ఖాళీ చేయను. అని ఖరాకండీగా చెప్పేసింది. ‘‘కాదమ్మా.. ఆయనంతటి వాడు మనల్ని రిక్వెస్ట్ చేసి అడిగినప్పుడు ఇవ్వడం మన ధర్మం కదా’’ అని నిర్మాత ఎంత నచ్చజెప్పినా... హీరోయిన్ మాత్రం పట్టు వదల్లేదు. సరికదా... ‘‘సరే.. ఖాళీ చేస్తానండీ... జరుగుతోంది అవుట్ డోర్ షూటింగ్.. అనుకోకుండా నాకు టాయిలెట్ వస్తుంది...
ఎక్కడికెళ్లమంటారు? బట్టలు మార్చుకోవాల్సొస్తుంది.. ఎటెళ్లమంటారు? చెట్టుచాటుకెళ్లమంటారా? కాదు.. కూడదూ ఖాళీ చేయాల్సిందే.. అనంటే చెప్పండి.. లొకేషన్నే ఖాళీ చేసి వెళ్లిపోతాను’’ అనే ఆమె సరికి అక్కడంతా షాక్. ‘‘అది కాదమ్మా... వచ్చేది టాలీవుడ్ నంబర్ వన్..రేపు నీకే ఆయనతో నటించే అవకాశం రావచ్చు’’ అనంటే.. ‘‘నాకు అవసరం లేదండీ... ఆయనతో నటించాలని కూడా నాకు లేదు. ఆ ఆఫర్ నాకు వద్దు’’అని ముఖం మీదే అనేసింది ఆ హీరోయిన్. దాంతో అవాక్కవడం అక్కడున్నవారి వంతైంది.
అప్పటికే ఆ అమ్మాయి సగం పైగా షూటింగ్ పూర్తి చేసేసింది. ఇక చేసేదేమీ లేక... నిర్మాత గారు హైదరాబాద్ ఫోన్ చేశాడు. ‘‘రాత్రికి రాత్రి ఇక్కడ కేరవాన్ ఉండాలి. ఖర్చు ఎంతైనా సరే’’ అని ఆర్డర్ వేశారు. తెల్లారే సరికి అన్ని హంగులతో సరికొత్త కేరవాన్ వైజాగ్ కి వచ్చి లొకేషన్ లో ఆగింది. సగర్వంగా నిర్మాతగారు... టాప్ స్టార్ కి కేరవాన్ పంపించారు.
కొసమెరుపు ఏంటంటే... జరిగిన తంతంగమేదీ... ఇప్పటికి కూడా ఆ‘టాప్ స్టార్’కి తెలీదు. ఇంతకీ ఆ సినిమా ఏంటి?... నిర్మాతనే ఎదిరించిన ఆ హీరోయిన్ ఎవరు? ఆ నిర్మాత గారు ఎవరు? వైజాగ్ లో రాజకీయ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న ఆ టాప్ స్టార్ ఎవరు? చెప్పుకోండి చూద్దాం.