సైరా’ వి అన్నీ అబద్ధాలే!
on Jan 4, 2018
‘సైరా’ ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ.. పాపం... రోజుకొక రూమర్. ఆ సినిమా గురించి మీడియా చేతికొచ్చినట్టు రాసేస్తుంటే... అది చదివిన జనాలు నోటికొచ్చినట్లు మాట్టాడేసుకుంటున్నారు. వ్యూస్ కోసం.. సినిమాను భష్టు పట్టించేస్తున్నారంటే నమ్మండి. రీసెంట్ గా చిరంజీవి నీట్ గా గడ్డం షేవ్ చేసుకొని కనిపించాడు. అప్పుడు వీళ్లేం రాయాలి? ‘సైరా’ కి బ్రేక్ ఇచ్చిన మెగాస్టార్ అని రాయాలి. కానీ అలా రాస్తే మజా ఏముంటుంది? వ్యూస్ కూడా పెద్ద రావు కదా! అందుకే.. ’ ‘సైరా’ను ఆపేసిన చిరంజీవి’ అని రాసేశారు. చివరకు గడ్డం గీసుకోవడం కూడా పాపమైపోయింది. పాపం.. మెగాస్టార్.
ఆ సినిమా నుంచి సంగీత దర్శకుడు రెహ్మాన్ తప్పుకున్న మాట నిజమే. అయితే... ఆ ప్లేస్ లో తమన్ ని తీసుకున్నారని రాసేశారు. అది పచ్చి అబద్ధం. ఇంతవరకూ ‘సైరా నరసింహారెడ్డి’ కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ కాలేదు. కీరవాణి కోసం ప్రయత్నాలు జరుగుతున్న మాట కొంతవరకు నిజం. అలాగే.... ఆ సినిమా నుంచి కెమెరా మేన్ రవివర్మ తప్పుకున్న మాట కూడా నిజమే. ప్రస్తుతం ఆ స్థానంలో రత్నవేలును తీసుకున్నారు. అయితే... రవివర్మకు దర్శకునికీ అభిప్రాయ బేధాలు వచ్చాయనీ.. అందుకే ఆయన సినిమా నుంచి తప్పుకున్నాడనీ కూడా రాసేశారు. అందులో కూడా ఏ మాత్రం నిజం లేదు. అంతకుముందే ఒప్పుకున్న కమిట్మెంట్ల కారణంగా రవివర్మ ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
అంతేనా.. ‘సైరా’ డైలాగులని కొన్ని డైలాగులు కూడా మీడియాలో హల్ చల్ చేశాయ్. తామే రచయితలుగా ఫీలై... కొందరు అభిమానులు రాసుకున్న డైలాగులవి. తెలీక అవే ‘సైరా’ డైలాగులని అందరూ భావించారు. ఆ తర్వాత నిజం తెలుసుకున్నారనుకోండి. అది వేరే విషయం.
‘సైరా’ దర్శకుడు సురేందర్ రెడ్డికీ... రచయితలు పరుచూరి గోపాలకృష్ణకు మధ్య విబేధాలు తలెత్తాయని రాశారు. అందులో కూడా ఏ మాత్రం నిజం లేదు. ఎందుకంటే... ఆ సినిమా కథ విస్తరణ విషయంలో మాత్రమే పరుచూరి వారి పాత్ర ఉంది. అంతేతప్ప... సంభాషణల విషయంలో పరుచూరి బ్రదర్స్ పాత్ర లేదు. ‘సైరా నరసింహారెడ్డి’కి పూర్తిస్థాయిలో సంభాషణలు అందిస్తున్నది సాయిమాధవ్ బుర్రా. ఈ విషయం కూడా తెలీని కొందరు ఏదేదో కాసేశారు.
ఇంకా ఇందులో వెంకటేశ్ ఉన్నాడని, పవన్ కల్యాణ్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడనీ, చిరంజీవికి ఫోన్ చేసి... స్వయంగా నాగార్జునే ‘సైరా’లో నేను నటిస్తానని అడిగాడనీ... ఇలా చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలనూ ‘సైరా’లో నటింపజేసింది మీడియా.
కాయలున్న చెట్లకే రాళ్ల దెబ్బలు. క్రేజ్ ఉన్న సినిమాపైనా గాసిప్పులు. ఇన్ని గాసిప్పులు ఈ మధ్య ఏ సినిమాకీ రాలేదంటే నమ్ముతారా? ‘సైరా’ క్రేజ్ అలా ఉంది మరి. ప్రస్తుతం కొన్ని రోజులు చిరంజీవి షూటింగ్ ఆపారు. అందుకే షేవ్ చేసుకున్నాడు. త్వరలోనే మళ్లీ సిినిమా షూటింగ్ మొదలుకానుంది. సో... ఈ లోపు.. ఇంకేవైనా కొత్త గాసిప్పుల గురించి ఆలోచిస్తే బావుంటుంది. ఏమంటారు మీడియా ఫ్రెండ్స్.