'బంగార్రాజు'లో శ్రియ.. మరి రమ్యకృష్ణ?..
on Jul 26, 2021
నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా'. 2016లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఇందులో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్ర ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగా అదే టైటిల్ తో 'బంగార్రాజు' మూవీ రానుంది.
సోగ్గాడే చిన్నినాయనా తర్వాత నాగార్జున-కల్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో రానున్న సినిమా కావడంతో 'బంగార్రాజు'పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఆగస్టు రెండవ వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. అయితే ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా శ్రియను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. సోగ్గాడే చిన్నినాయనాలో నాగ్ భార్యగా రమ్యకృష్ణ నటించింది. దీంతో బంగార్రాజులో కూడా రమ్యకృష్ణ నటించనుందని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు శ్రియ పేరు తెరమీదకు వచ్చింది. రమ్యకృష్ణ స్థానంలో శ్రియను తీసుకున్నారా? లేదంటే ఇది వేరే పాత్రనా? అనేది తెలియాల్సి ఉంది.
ఈ సినిమాలో నాగచైతన్య కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. 'మనం' తర్వాత నాగార్జున- నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. ఇందులో చైతుకి జోడీగా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నటించనుందట.