బాలయ్య విలన్ సంజయ్ దత్!
on Jul 15, 2020
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న సినిమా షూటింగ్‌ను పునరుద్ధరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ టైటిల్ ఖరారు చేయకపోవడంతో, ఆ ఇద్దరి కాంబినేషన్లో తయారవుతోన్న మూడో సినిమా కాబట్టి 'బీబీ3' అంటూ దాన్ని పరిగణిస్తున్నారు. గతంలో వాళ్లు కలిసి చేసిన 'సింహా', 'లెజెండ్' సినిమాలు రెండు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యాయి. బాలయ్య బర్త్‌డే సందర్భంగా 'బీబీ3 ఫస్ట్ రోర్' పేరుతో జూన్ 10న రిలీజ్ చేసిన టీజర్‌కు ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకూ దానికి 9.5 మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం.
కాగా, ఈ మూవీలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ నటించనున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది. బాలయ్యకు బలమైన ప్రత్యర్థి కోసం బోయపాటి చేస్తున్న అన్వేషణ సంజయ్ దత్ దగ్గర ఆగినట్లు, విలన్‌గా చెయ్యడానికి ఆయన అంగీకరించినట్లూ చెప్పుకుంటున్నారు. 'బీబీ3'లో బాలయ్య ద్విపాత్రలు చేస్తున్నారు. టీజర్లో చూపించిన క్యారెక్టర్ ఒకటి కాగా, మరొకటి ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే అఘోరా క్యారెక్టర్ అని సమాచారం.
నిజానికి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ముందుగానే సంజయ్ దత్ కోసం బోయపాటి ట్రై చేశాడు. అప్పుడాయన తెలీని కారణాలతో ఆఫర్‌ను తిరస్కరించాడు. కానీ ఇప్పుడు బోయపాటి మరోసారి ఆయనను సంప్రదించడం, సంజయ్ ఓకే అనడం జరిగిందని ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఈ విషయాన్ని త్వరలోనే నిర్మాతలు వెల్లడించవచ్చునని తెలుస్తోంది. ఇప్పటికే 'కేజీఎఫ్ చాప్టర్ 2'లో క్రూరుడైన విలన్ అధీరగా నటిస్తోన్న సంజయ్ దత్‌కు సౌత్‌లో ఇది రెండో సినిమా కానున్నది. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా తయారవుతున్న 'బీబీ3'కి తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.