పవర్ స్టార్ ముందు తట్టుకోగలరా?
on Oct 20, 2017
గత సంక్రాంతికీ... రాబోతున్న సంక్రాంతికి చాలా పోలికలు కనబడుతున్నాయ్. ఏ విషయంలో అనుకుంటున్నారా? అదేనండీ... సినిమాల విషయంలో. గత సంక్రాంతి పందెం కోళ్లు.. చిరంజీవి, బాలకృష్ణ. వీళ్లిద్దరూ చాలా సంక్రాంతుల్లో కొట్టుకున్నారు. అదేనండీ సినిమాల విషయంలో. ఓ సంక్రాంతి చిరంజీవిది అయితే.. ఇంకో సంక్రాంతి బాలయ్యది. అలా దాదాపు ఇరవై ఏళ్లు అప్రతిహతంగా వీరి పోటీ సాగింది. అయితే.. చాలా విరామం తర్వాత వీరిద్దరూ పోటీపడ్డ సంవత్సరం 2017. ఈ సీనియర్ హీరోలిద్దరూ సంక్రాంతి పోటీలో నిలిచేసరికి... రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు. ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే.. గెలుపు మాత్రం ఇద్దరినీ వరించింది. రెండూ హిట్లయ్యాయ్. రెండూ నిర్మాతలకు లాభాల పంటలు పండించాయ్. అయితే... వీటిల్లో డబ్బులు చిరంజీవికి ఎక్కువొస్తే.. ప్రశంసలు బాలయ్యకు వచ్చాయ్.
ఇద్దరు మదగజాల మధ్య లేడిపిల్లలా శర్వానంద్ ‘శతమానం భవతి’ అంటూ అదే సంక్రాంతికి వచ్చాడు. తను కూడా విజయాన్ని అందుకున్నాడు. అసలు సంక్రాంతి తీరే అలా వుంటుంది లేండీ. బావుంటే కాసుల పంటే. ఎన్ని సినిమాలనైనా భరించే కెపాసిటీ సంక్రాంతి పండుగకు మాత్రమే ఉంటుంది.
రేపు రాబోతున్న సంక్రాంతికి కూడా దాదాపు ఇలాగే సినిమాలు విడుదల కానున్నాయ్. ఈ దఫా కూడా సంక్రాంతి బరిలో సీనియర్ కోడి పుంజు బాలయ్య ఉన్నాడు. అయితే... బాలయ్య పోటీపడేది మాత్రం.. చాలా‘పవర్’ఫుల్ కోడిపుంజుని. దానిపేరు పవన్ కల్యాణ్. గత సంక్రాంతి మాదిరిగానే.. ఈ దఫా కూడా ఈ మదగజాల మధ్య ఓ లేడిపిల్ల రాబోతోంది. అదే... రాజ్ తరుణ్. ‘రాజుగాడు’ సినిమాతో ఈ సూపర్ స్టార్లిద్దరితో పోటీపడనున్నాడు రాజ్ తరుణ్. అదృష్ణం బావుండి.. మూడూ హిట్లయితే.. సూపర్. పొరపాటున పెద్ద తలకాయలిద్దరూ హిట్లు కొట్టారంటే.. లేడి పిల్ల పలహారం అయిపోవడం ఖాయం. ఏది ఏమైనా.. సంక్రాంతి కాబట్టి... అన్నీ బావుంటే.. ప్రతి సినిమాకూ కాసుల పంటే.
బాలయ్య.. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీబిజీగా ఉన్నాడు. ఆయన గత చిత్రాలకు ఇది పూర్తి భిన్నమైన కథ అని తెలుస్తోంది. ఇందులో బాలయ్య కేరక్టర్లో చాలా వేరేషన్లు ఉంటాయట. తొలుత ప్రేమికునిగా, తర్వాత విఫల ప్రేమికునిగా, ఆ తర్వాత నడి వయస్కునిగా.. ఓ ఆడపిల్లను శత్రువుల నుంచి రక్షించే అంగరక్షకునిగా... ఇలా రకరకాల కోణాలున్న పాత్రను ఆయన చేస్తున్నాడు. సినిమా విజయంపై యూనిట్ మొత్తం నమ్మకంతో ఉంది.
ఇక పవర్ స్టార్, త్రివిక్రమ్... ఈ పేర్లు చెబితే చాలు... ఓపెనింగ్సే వందకోట్లు దాటతాయని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇది కూడా చాలా విభిన్నమైన కథలే అని తెలుస్తోంది. పైగా పవర్ స్టార్ కు జోడీగా కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటిస్తున్నారు. దీన్ని బట్టి ఈ సినిమా ఎంత కలర్ ఫుల్గా ఉంటుందో చెప్పాలా?. మరి రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ ఎలా ఉంటాడో... తెలియాల్సివుంది.