నానికి సపోర్ట్ చేసేవారే కరువయ్యారా..?
on Feb 20, 2018
మంచిపని ఎవరు చేసినా దానికి సపోర్ట్ చేయాలని పెద్దలు అంటూ ఉంటారు. ఏ రంగంలో ఉన్న వారికైనా ఇది వర్తిస్తుంది. సినీ పరిశ్రమలో ఉన్న వారు ఈ విషయాన్ని ఇంకాస్త ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. అందుకు తగ్గట్టుగానే మంచి సినిమాలు వచ్చినప్పుడు.. చేసినవారిని అభినందిస్తూ.. గుడ్ లక్ అనో.. గుడ్ అటెంప్ట్ అనో ట్వీట్ చేసి తమ తోటి నటుడిని ప్రొత్సహిస్తూ ఉంటారు. రీసెంట్గా నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి తీసిన "అ!" సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి.
సినిమా చూసిన అభిమానులు కొత్తగా ఫీలయ్యామని.. నానిని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే నాని ప్రయత్నం గురించి గానీ.. "అ!" సినిమా ఎలా ఉందని గానీ.. ఇండస్ట్రీకి సంబంధించిన వారెవ్వరూ స్పందించిన దాఖలాలు లేవు. ఆడియో లాంఛ్ రోజు వచ్చిన ఏ ఒక్క పెద్దమనిషి కూడా ఇంత వరకు నోరెత్తలేదు. సహజంగానే మంచి సినిమాలు.. చిన్న సినిమాల గురించి ట్వీట్ చేసి.. వాటి విజయానికి తనవంతు సాయం చేసే.. దర్శకధీరుడు రాజమౌళి కూడా స్పందించకపోవడం ఆశ్చర్యకరం. చిన్న సినిమాలు తీసే వారికి డబ్బులు రాకపోయినా పర్లేదు కానీ.. తోటి వారి నుంచి బాగుందన్న ఒక చిన్న మాట.. వారికి కొండంత బలాన్నిస్తుంది.