కీరవాణి కూడా కాపీ మాస్టరేనా?
on Jan 30, 2018
కాపీల గోలతో తెలుగు చిత్ర పరిశ్రమ ఓ వైపు అతలాకుతలం అవుతుంటే... ఇవి చాలవన్నట్టు..ఇప్పుడు ఓ కొత్త కాపీ వివాదం వెలుగు చూసింది. ఇన్నాళ్లూ కథల్ని కాపీ కొట్టి సినిమాలు తీసిన దర్శకులనే చూశాం. ఇప్పుడు సంగీత దర్శకుల వంతు వచ్చింది. ఈ దఫా ఈ వివాదంలో తెలుగు లెజెండ్రీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి చిక్కుకున్నాడు.
కీరవాణి లాంటి టాలెంటెడ్ సంగీత దర్శకుడు కాపీలు కొట్టడం ఏంటి? అనే ఆశ్చర్యం కలగొచ్చు. కానీ... ఆధారాలతో సహా ఓ లింక్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ లింకేంటి? ఈ కాపీ గోలేంటి? అనే విషయంలోకెళ్తే...
‘బాహుబలి’ సినిమాల కోసం కీరవాణి ఓ బీజియమ్ వాడాడు. ఆ బీజియమ్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది కూడా. అయితే... అక్కినేని నాగేశ్వరరావు నటించిన అద్భుత జానపద చిత్రం ‘కీలుగుర్రం’ సినిమాలోని బీజియమ్ కీ... ’బాహుబలి’ కోసం కీరవాణి చేసిన బీజియమ్ కీ దగ్గర పోలికలున్నాయనీ...ఇప్పుడు వివాదం. కీరవాణి ‘కీలుగుర్రం’ బీజియమ్ ని కాపీ కొట్టి ‘బాహుబలి’కి వాడాడనేది ఆరోపణ. దానికి సాక్ష్యంగా ఓ లింక్ ని కూడా విడుదల చేశారు నెటిజన్లు. అయితే... ‘అది కాపీ కాదు’ అనేవాళ్లు కూడా ఇప్పుడు లేకపోలేదు. ‘ఒకే రకం ఆలోచనలు ఇద్దరికి రావడం కామన్... కీలుగుర్రం సంగీత దర్శకుని ఆలోచనే.. ‘బాహుబలి’ సమయంలో కీరవాణికి వచ్చి ఉండొచ్చు’ అని కొందరంటున్నారు.
నిజానికి కీరవాణిపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణే ఎదురైంది. ’ ‘ఛత్రపతి’ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్... ఓ జపాన్ సినిమా నేపథ్య సంగీతానికి కాపీ..’ అని అప్పట్లో కొందరు వివాదాన్ని లేపారు. అయితే... అది వెంటనే సద్దుమణిగింది. ఇప్పుడు ఈ వివాదం. మరి ఇందులో ఏది నిజమో కీరవాణికే తెలియాలి.