ఆ సినిమాకు ‘నో’ చెప్పేసిన ఎన్టీయార్!
on Feb 17, 2018
బయోపిక్ లు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయ్. గొప్పవాళ్ల కథలు తెరకెక్కించాలనే ఆలోచన బాగానే ఉంది. అయితే... వారి జీవితాలో ముడి పడిపడి ఉన్న ఇంకొందరు లెజెండ్లను చూపించాల్సొస్తున్నప్పుడే సమస్యలు తలెత్తుతున్నాయ్. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న బయోపిక్ ‘మహానటి’. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ కథలో ఎన్టీయార్, ఏఎన్నార్‌ల కేరక్టర్లు ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీయార్, ఏఎన్నార్లు లేని సావిత్రి కథను ఊహించలేం. అసలు చిక్కంతా అక్కడే వచ్చింది. అక్కినేని పాత్ర చేయడానికి నాగచైతన్య రెడీ. పమస్యంతా ఎన్టీయార్ పాత్ర విషయంలోనే.
మనవడు, పైగా పోలికలు ఉంటాయ్ కాబట్టి.. ఆ కేరక్టర్‌ను తారక్‌తో చేయించేయాలని దర్శక, నిర్మాతలు భావించారు. తారక్‌ను ఒప్పించడానికి శ్రమించారు కూడా. ఎన్టీయార్, ఏఎన్నార్ లతో ముడిపడి ఉన్న షూటింగ్ మినహా.. దాదాపు మొత్తం ఈ లోగా పూర్తి చేశారు. తారక్ ‘ఓకే’ అనగానే... షూటింగ్ మొదలుపెడదాం... అని ఇన్నాళ్లూ ఎదురు చూశారు. అయితే... ‘తాతగారి పాత్ర నేను చేయను గాక చేయను’ అని ‘మహానటి’ టీమ్ ఆశలపై నీళ్లు చల్లేశాడు తారక్. ‘తాతగారి పాత్రను ఓ వైపు బాలయ్య బాబాయ్ చేస్తున్నారు. ఆయన చేస్తున్నప్పుడు అదే పాత్ర వేరే సినిమాలో నేను చేస్తే.. రాంగ్ సిగ్నల్స్ వెళతాయ్. సో.. నేను చేయను’ అని కుండ బద్దలు కొ్ట్టి మరీ చెప్పాడట తారక్. తారక్ అన్నదాంట్లో కూడా నిజం లేకపోలేదు. ఎందుకంటే... ఇప్పటికే బాబాయ్, అబ్బాయ్‌ల మధ్య సత్సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయ్.
ఈ పరిణామంతో ఖంగు తిన్న ‘మహానటి’ టీమ్... ప్రత్యామ్నయాన్ని వెతికే పనిలో పడ్డారు. ఎన్టీయార్ పాత్రను చేయగలిగే స్ట్రేచర్ ఉన్న హీరో ఎవరు? ఒకవేళ ఉన్నా... సదరు హీరో ఆ పాత్ర చేయడానికి అంగీకరిస్తాడా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రస్తుతం ‘మహానటి’ దర్శక, నిర్మాతల దృష్టి తమిళ హీరో సూర్యపై ఉంది. ఎన్టీయార్ పాత్రకు సూర్య ‘ఓకే’ అంటే... సినిమాకు కొత్త బలం రావడం ఖాయం.
మరోవైపు బాలకృష్ణ చేయనున్న ఎన్టీయార్ బయోపిక్ విషయంలో కూడా ఇలాంటి సమస్యలే తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఎందుకంటే...ఎన్టీయార్ జీవితం అంటే... అందులో సగ భాగం అక్కినేనిదే. సినీ జీవితంలో ఎన్టీయార్ ప్రత్యర్థి ఒక్క అక్కినేని మాత్రమే. బాలయ్య ఎన్టీయార్‌గా చేస్తున్నప్పుడు అక్కినేని పాత్రను ఎవరితో చేయిస్తారు? అంత స్ట్రేచర్ ఉన్న హీరో ఎవరు? అంతేకాదు... ఇందిరాగాంధీ పాత్ర కూడా ఎన్టీయార్ బయోపిక్ లో కీలకం. ఆ పాత్రను ఎవరితో చేయిస్తారు? ఎన్టీయార్ సతీమణి బసవతారకం, కొడుకులు హరికృష్ణ, బాలకృష్ణ, అల్లుడు చంద్రబాబు... ఈ పాత్రలన్నీ ఎవరితో చేయిస్తారు? ఇంతకీ లక్ష్మీపార్వతి ఎవరు? జనాలను తొలిచి వేస్తున్న ప్రశ్నలివి? వీటికి కాలమే సమాధానం చెప్పాలి.