బన్నీ క్లాసులకు డైరెక్టర్లు భయపడుతున్నారా..?
on Jan 19, 2018
టాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు.. సినిమా సినిమాకు తన క్రేజ్‌తో పాటు మార్కెట్‌ను పెంచుకుంటూ వెళుతున్నాడు బన్నీ. అలాంటి అల్లు అర్జున్‌తో సినిమాలు చేయడానికి కొత్త దర్శకులతో పాటు.. టాప్ డైరెక్టర్స్ క్యూకడుతూ ఉంటారు అని బన్నీ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదంటున్నారు టాలీవుడ్ జనాలు. అర్జున్‌ని చాలామంది టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ దూరం పెడుతున్నారనే వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఆయనకు కథలు వినిపించడానికి కేవలం కొత్త కుర్రాళ్లు మాత్రమే లైనులో కనిపిస్తున్నారట. ఇందుకు కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
కెరీర్ స్టార్టింగ్ నుంచి నేటి వరకు ఒకటి రెండు సార్లు తప్ప మిగిలిన అన్ని సినిమాలకు స్టార్ డైరెక్టర్లకే ఛాన్స్ ఇస్తూ వస్తున్నాడు.. ఇక మీదట కూడా బన్నీ ఇదే ఫార్ములాతోనే ముందుకు వెళతాడనేది క్రిటిక్స్ మాట. దీనిలో భాగంగానే బాహుబలితో రికార్డులు తిరగరాసిన రాజమౌళీ నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని బన్నీ ఎన్నో ప్రయత్నాలు చేశాడట. అయితే జక్కన్న తన మల్టీస్టారర్‌కు ఎన్టీఆర్-చరణ్లనే తీసుకున్నాడు. దీని తర్వాత కొరటాల శివను దిల్‌రాజు ద్వారా దువ్వినప్పటికీ కొరటాల కూడా అల్లు అర్జున్‌తో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపలేదట. త్రివక్రమ్.. జూనియర్ ఎన్టీఆర్‌తో బిజీ అవ్వగా.. వంశీ పైడిపల్లి, సుకుమార్‌లు మహేశ్ వైపు చూస్తున్నారు.
టాప్ డైరెక్టర్స్ అంతా ఇలా సైడ్ అవ్వడానికి బన్నీ, అల్లు అరవింద్‌ల వ్యవహార శైలే కారణం అంటున్నారు సినీ జనాలు. స్క్రిప్ట్ దగ్గరి నుంచి ఫ్రేమ్ సెట్టింగ్ దాకా ప్రతి విషయంలోనూ తండ్రి, కొడుకుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుందని.. వీరి క్లాసులు భరించే ఓపిక లేక చాలామంది స్టార్ డైరెక్టర్లు గీతా కాంపౌండ్ వైపు వెళ్లడం మానేశారట. మరోవైపు ఈ టాప్ డైరెక్టర్స్ అందరూ సినిమాల విషయంలో ముందే అగ్రిమెంట్లు చేసుకోవడం వల్లనే బన్నీతో సినిమా చేయలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య సినిమాలో నటిస్తున్నారు.