'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' తర్వాత అఖిల్ డైరెక్టర్ ఎవరు?
on Aug 7, 2020
సమకాలీన దర్శకుల్లో ఫ్లాప్ అంటూ ఎరుగని వాళ్లలో అనిల్ రావిపూడి ఒకరు. 'పటాస్'తో ప్రారంభమైన ఆయన విజయ పరంపర ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన బ్లాక్బస్టర్ 'సరిలేరు నీకెవ్వరు' మూవీ వరకు అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. ఈ మధ్యలో 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్ 2' సినిమాలను ఆయన రూపొందించాడు. లాక్డౌన్ విధించాక ప్రకాశం జిల్లాలోని స్వస్థలం యద్దనపూడికి వెళ్లి అక్కడే స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటూ వస్తోన్న ఆయన 'ఎఫ్ 3'కి సిద్ధమవుతున్నాడంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
కాగా మూడు సినిమాలు చేసిన హిట్ రుచి చూడలేకపోయిన అఖిల్ అక్కినేని, ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ రూపొందిస్తోన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ సినిమా అయినా సక్సెస్ అయ్యి, తన ట్రాక్ రికార్డును మారుస్తుందేమోననే ఆశతో అతనున్నాడు. ఇప్పుడు దిల్ రాజు కాంపౌండ్ నుంచి వినవస్తోన్న దాని ప్రకారం అనిల్ రావిపూడి డైరెక్షన్లో అఖిల్ నటించనున్నాడు. అంటే ఈ ప్రాజెక్టును దిల్ రాజు బ్యానర్ నిర్మించనున్నదన్న మాట. అయితే ఇదింకా చర్చల దశలోనే ఉందంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరింత సమాచారం బయటకు రావచ్చు.