బాలకృష్ణకు విలన్గా తమ్ముడు..?
on Jul 4, 2017
విలన్ గా కెరీర్ మొదలు పెట్టి, తర్వాత హీరో గా మారి తెలుగు సినిమాలో తన కంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు శ్రీకాంత్. కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలో అనవసరంగా వచ్చిన సినెమాలన్నింటినీ ఒప్పుకొని ఫ్లాపుల బారిన పడ్డాడు. ఒకానొక సమయంలో శ్రీకాంత్ లెక్కలేనన్ని సినిమాలు చేసాడు. కానీ, వాటిలో ప్రేక్షకులు మెచ్చినవి కొన్నే. తర్వాత తేరుకున్న శ్రీకాంత్ తన వయసుకు తగ్గ పాత్రలు ఎన్నుకోవడం మొదలు పెట్టాడు. హీరో పాత్రలే చేస్తానని గిరిగీసుకొని కూర్చోక నచ్చితే, అన్నయ్య గానో, తమ్ముడిగానో లేదా బాబాయ్ గానో తనకు నప్పే క్యారెక్టర్లు చేసాడు.
ఈ మధ్య, సూపర్ హిట్ సినిమా సరైనోడు లో అల్లు అర్జున్ కి బాబాయ్ గా చేసి అందర్నీ మెప్పించాడు. ప్రస్తుతం, నాగ చైతన్య తదుపరి చిత్రం యుద్ధం శరణంలో ఒక ప్రముఖ పాత్ర చేస్తున్న శ్రీకాంత్ కి, బాలకృష్ణ 102 వ సినిమాలో విలన్ పాత్ర చేసే అవకాశం వచ్చిందని సమాచారం. ఇంతకు ముందు శ్రీరామరాజ్యంలో బాలయ్యకు తమ్ముడిగా నటించారు శ్రీకాంత్.. కే యస్ రవికుమార్ దర్శకత్వం వహించనున్న "రెడ్డి గారు" సినిమాలో మరోసారి బాలకృష్ణతో నటించే అవకాశం కూడా కొట్టేసాడు శ్రీకాంత్, అదీ ప్రధాన విలన్ పాత్ర కి. ఇంతకు ముందు నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేసినప్పటికీ, శ్రీకాంత్ పూర్తి స్థాయి విలన్ రోల్ ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు ఆ అదృష్టం బాలకృష్ణ సినిమా ద్వారా వరించింది. ఈ సదావకాశాన్ని శ్రీకాంత్ సద్వినియోగ పరుచుకుంటాడని ఆశిద్దాం.