కాజల్‌తో కళ్యాణ్‌రామ్ 'కుమ్ముడు'
on May 16, 2017
కృష్ణవంశీ 'చందమామ'తో కాజల్ అగర్వాల్ కి గుర్తింపు వచ్చి ఉండొచ్చు. రాజమౌళి 'మగధీర'తో ఆమె కెరీర్ మెగా మలుపు తిరిగి, ఓ మైల్ స్టోన్ గా మారి ఉండొచ్చు. కానీ పంచదార పలుకులాంటి పంజాబీ పుత్తడి బొమ్మ కాజల్ అగర్వాల్ తెలుగులో నటించిన మొదటి చిత్రం మాత్రం 'లక్ష్మీ కళ్యాణం'. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఆ చిత్రానికి తేజ దర్శకత్వం వహించాడు. ఇది దాదాపు పది పన్నెండేళ్ల క్రితం మాట. పుష్కర కాలం తర్వాత వీరిద్దరూ జత కడుతున్నారు. తెలుగుతోపాటు, తమిళ, హిందీ భాషల్లోనూ తిరుగులేని పాపులారిటీ కలిగిన కాజల్ వల్ల.. ఆయా భాషల్లో డబ్బింగ్ రైట్స్ దండిగా పలుకుతాయనే ఆలోచనతో.. కాజల్ ను తన తాజా చిత్రం కోసం ఎంపిక చేసుకొనేందు కళ్యాణ్ రామ్ ఆసక్తి చూపుతున్నారని సమాచారం.
చిరంజీవికి జంటగా 'ఖైదీ నంబర్ 150'లో నటించేందుకు కాజల్ కోటిన్నర తీసుకుందని చెప్పుకున్నారు. అదే కనక నిజమైతే.. కళ్యాణ్ రామ్ తో జత కట్టేందుకు ఈ అమ్మడు కనీసం రెండు కోట్లు డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదు. కాజల్ ప్రస్తుతం తమిళంలో రెండు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తోంది. ఒక సినిమాకు హీరో అజిత్ కాగా.. రెండో సినిమాకు హీరో విజయ్. ఇవి కాక తెలుగులో రానాతో 'నేనే రాజు.. నేనే మంత్రి' సినిమా చేస్తోంది కాజల్. మరి 'లక్ష్మీ కళ్యాణం' అనంతరం కళ్యాణ్ రామ్ సరసన నటించే సినిమాకు కాజల్ సైన్ చేస్తోందా లేదా అన్నది త్వరలోనే తేలిపోనుంది!!