మహేష్ బాబుకి ఫిదా నచ్చలేదా?
on Sep 2, 2017
సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ప్రపంచంలోకి అడుగిడి ఏడు సంవత్సరాలు పైబడింది. తనకి 3 .79 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, మహేష్ బాబు ఫాలో అవుతుంది మాత్రం కేవలం ఒక్కరినే- అదీ తనకు అత్యంత ఆప్తుడయిన బావ జయదేవ్ గల్లాని. ఇక ఇన్ని ఏళ్లలో మహేష్ వేసిన ట్వీట్లు ఎన్నో తెలుసా- కేవలం 1132 . దీన్ని బట్టే మనం అర్ధం చేసుకోవచ్చు, మహేష్ బాబు ట్విట్టర్ ని ఎంత పొదుపుగా వాడతాడో అని. ఇంత తక్కువగా సోషల్ మీడియా లో పోస్ట్ లు వేసే మహేష్ బాబు, ఒక చిన్న సినిమా పై తన అభిప్రాయం పెట్టాడు. కొందరి ప్రశంసలు, మరికొందరి విమర్శలు ఎదుర్కొంటున్న అర్జున్ రెడ్డి సినిమా తనకి తెగ నచ్చిందని మహేష్ ట్వీటాడు. అయితే, మహేష్ బాబు కి అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు పొందిన ఫిదా నచ్చ లేదా అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మహేష్ బాబు లాంటి స్టార్ ఒక అడల్ట్ సర్టిఫికెట్ తెచ్చుకున్న సినిమాని తెగ పొగిడి, సూపర్ హిట్ అయిన ఒక కుటుంబ కథా చిత్రాన్ని విస్మరించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్ లో తక్కువగా తన అభిప్రాయాలూ చెప్పే మహేష్ బాబు ఏ సినిమా గురించి మాట్లాడక పోయినా పెద్దగా ఇబ్బంది వచ్చేదేం కాదు. కానీ, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఒక సినిమా గురించి అంతగా ప్రశంసించడం కొందరికి నచ్చలేదు. అసలు ఇండస్ట్రీ లో ఏ స్టార్ హీరో కూడా అర్జున్ రెడ్డి గురించి అంతగా స్పందించ లేదు, అయితే ఫిదా ని మాత్రం అందరూ పొగిడారు.