యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, పరుచూరి మురళి దర్శకత్వంలో, యమ్.యల్.కుమార్ చౌదరి నిర్మించిన విభిన్న కథా చిత్రం "అధినాయకుడు" రేపు జూన్ ఒకటవ తేదీన విడుదల కాబోతూంది. ఈ ‘అధినాయకుడు’ చిత్రానికి వైఎస్ జగన్ అరెస్టు సెగ తాకే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కారణం ఈ చిత్రంలో బాలయ్య చెప్పిన కొన్ని డైలాగులు జగన్‌ను టార్గెట్ చేస్తున్నట్లు ఉండటమే. ఈ చిత్రంలోని ‘‘మంచి నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలే గానీ, రోడ్డమీద బొమ్మల్లో కాదు...ఉన్నట్టుండి ఈ విగ్రహాల రాజకీయం ఎందుకు మొదలు పెట్టావో చెబుతావా? చెప్పించమంటావా?’’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.
ఈ డైలాగులో బాలయ్య ఎక్కడ కూడా జగన్ పేరు ప్రస్తావించక పోయినప్పటికీ....అది జగన్‌ను టార్గెట్ చేస్తూ ఉందనేది కాదనలేని సత్యం. కాగా జగన్ అరెస్టుతో ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న వైఎస్ఆర్‌సి కాంగ్రెస్ నేతలు...సినిమా విడుదల సమయంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే చిరంజీవిపై కూడా ఈ చిత్రంలో సెటైర్లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ చిత్రంలోని డైలాగుల మీద ప్రేక్షకుల స్పందన ఎలా ఉండబోతుందనేది తెలుసుకోవాలంటే జూన్ ఒకటి వరకూ ఆగాల్సిందే.




