బాలయ్య 40 ఇయర్స్ ఇండస్ట్రీ
on Aug 30, 2014
నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటికి నలభై యేళ్లు అవుతోంది. నందమూరి తారక రామారావు గారి వారసుడిగా తాతమ్మ కల సినిమాతో 1974 ఆగస్ట్ 30 సినీ రంగ ప్రవేశం చేశారు బాలయ్య. అలా తాతమ్మ కల, దానవీరశూరకర్ణ, శ్రీ మద్విరాట్ పర్వం, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీవెంకటేశ్వర కళ్యాణం లాంటి సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. 'అన్నదమ్ముల అనుబంధం 'సినిమాలో ఎన్టీఆర్ కు తమ్ముడిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
1984లో సాహసమే జీవితం సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి, అదే యేడాది వచ్చిన మంగమ్మగారి మనవడు సినిమాతో బాక్స్ ఆఫీస్ షేక్ చేసి స్టార్ హీరోగా ఎదిగాడు. తన సమకాలీన హీరోల్లో బాలకృష్ణ చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు మరే నటుడూ చేయలేదని చెప్పొచ్చు. ఆదిత్య 369, నారీ నారీ నడుమ మురారి, భైరవద్వీపం, సీతారామ కళ్యాణం, రౌడీ ఇన్స్ పెక్టర్, బంగారు బుల్లోడు, ముద్దుల మావయ్య, బొబ్బిలి సింహం, సమర సింహ రెడ్డి, నరసింహ నాయుడు, సింహా, లెజెండ్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇన్నేళ్లపాటు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అభిమానులను అలరించిన బాలయ్య మరిన్ని మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.