లెజెండ్ సంబరాలు ప్రారంభమయ్యాయి
on Mar 25, 2014
బాలకృష్ణ నటించిన "లెజెండ్" చిత్రం మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. "సింహ" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్స్ కు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగులకు సినిమాపై ఉన్న అంచనాలను తారస్థాయికి చేర్చాయి.
దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కు బాలయ్యతో ఇది రెండవ సినిమా. "సింహ" తర్వాత బాలయ్యను ఒక లెజెండ్ గా చూపిస్తున్నాడు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కించాడు బోయపాటి. బాలయ్య అభిమానులను అంచనాలకు ఒక మెట్టు ఎక్కువగా ఉండే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని తెలిసింది. ఇందులో విలన్ పాత్రలో జగపతి బాబు అదరగొట్టాడని ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ చూస్తే అర్థమవుతుంది. అలాగే బాలయ్యతో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కు ఇది తొలిసినిమా. వీరిద్దరి కలయికలో వస్తున్న మొదటి చిత్రం కావడంతో దేవి కూడా అదిరిపోయే పాటలతో పాటుగా రోమాలు నిక్కబొడుచుకునే విధంగా రీ-రికార్డింగ్ ఇచ్చాడని తెలిసింది.
ఇప్పటికే ఈ సినిమా ప్రదర్శించే ప్రదేశాలలో భారీ ఈ సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. టాలీవుడ్ రికార్డ్స్ తిరగరాయడం ఖాయమని టాలీవుడ్ మొత్తం చెబుతుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.
లెజెండ్ వస్తుందని తెలిసిన పలు చిత్రాల దర్శక, నిర్మాతలు తమ చిత్రాలను వాయిదా వేసుకున్నారు. "రేసుగుర్రం", "రౌడీ" వంటి పెద్ద చిత్రాలు సైతం వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక చిన్న సినిమాల సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదని అర్థమైపోయింది. మరి లెజెండ్ వేడి తగ్గేవరకు వేరే సినిమాల విడుదల వాయిదా పడుతూనే ఉంటాయో లేక ధైర్యం చేసి విడుదల అవుతాయో చూడాలి.