Home » Stories »  ద్వితీయ బహుమతి

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా తెలుగువన్.కామ్ నిర్వహించిన కథ

 

పోటీలల్లో ద్వితీయ బహుమతి పొందిన కథ.

 

జీవనరాగం – కలలతీరం

డి. లలిత

 

 

పెరట్లో .....పారిజాతం, నందివర్ధనం చాన్నాళ్ళకు కలిసిన అక్కచెల్లెళ్ళలాగా కొమ్మలు పెనవేసుకుని అందినంతమేరా నేలమీద నీడను పరిచాయి. ఆ పలచటి నీడలో నాపరాయిబల్లమీద కూర్చొని ఒళ్ళోఉన్న రాగిపళ్ళెంలోంచీ నాలుగేసి దళాలు గుత్తిలా అమరుస్తూ తులసి మాల అల్లుతుంది సీతాదేవి.

 

ఆవిడ నిర్లక్షంగా వదిలేసిన చీరచెంగూ నేలమీద జీరాడుతుంది. అన్యమనస్కంగా అల్లిన జడ పాయలు విడిపోయివుంది. కొమ్మల్లు కదిలినప్పుడల్లా ఆకుల సందుల్లోంచీ పడుతున్న ఎండకు ఆవిడ తలలో అక్కడక్కడా పరుచుకున్న తెల్లని వెంట్రుకలు వెండితీగల్లాగా చటుక్కున మెరుసి ఆరుతున్నాయి.

 

ఆవిడ మనసంతా గందరగోళంగావుంది. తొలిపొద్దునూ, నులివెచ్చని కిరణాలను, దూరం నుంచీ గాలివాలుకు ఆగాగి వినవస్తున్న ఘంటసాల గాత్రాన్నీ దేన్నీ ఆవిడ గుర్తించేలాలేదు.

 

తెల్ల తెర వారుతున్నవేళ రంగులు చిమ్ముకుంటూ వచ్చి వెళ్ళిన ఆ కలనే ఆవిడ పదే పదే నెమరేస్తూ.....కొంత ఆందోళనా మరికొంతా ఆలోచనా కలగలిసిపోగా దిగులుగా నిట్టూర్చి తలవిదిలించింది. కానీ కల రాలిపడలేదు ఇంకా అలానే వేళ్ళడుతూవుంది. ఆకాశం నుంచీ తానున్న ఎత్తుకు దిగి వచ్చింది ఇంద్రధనుస్సు.

 

అసలేమాత్రం ఆకర్షణ లేని మట్టిరంగు రెక్కల పురుగులు ఆ ఇంద్ర ధనుస్సులోనికి వెళ్ళి సప్తవర్ణాలు పులుముకుని ఎగురుతూ బయటికొస్తున్నాయి. వాటి రంగుల చెమ్మ తనకి అనుభూతిలోకి వస్తుంది. వేళ్ళతో తాకిచూడాలని ప్రయత్నిస్తుంది తాను. ఎంత ప్రయత్నించినా చేయి కదపలేకపోతుంది.

 

సాలెగూడు లాంటి సన్నని దారం తన చేతిని బలంగా చుట్టి పట్టుకుంది. కళ్ళు తిప్పిచూస్తే తెల్లని పావురాలగుంపు శ్రావ్యంగా పాడుతున్న రంగుల పక్షిచుట్టూ చేరి కువకువల కోరస్ అందిస్తున్నాయి. తనకి తెలిసిన రాగమేదో తనూ పాడబోయింది.

 

గొంతు చుట్టూ బిగుసుకునుంది అతి సన్నని దారం. బంగారు రంగులో మెరుస్తున్న పట్టుదారంలా వుంది. నిరాశతో కూలబడింది. కొలనులోంచీ బయటికి ఎగిరొచ్చిన చేపలు కోతులతో కలిసి చెట్లెక్కడం నేర్చుకుంటున్నాయి.

 

పక పకా నవ్వాలనుకుంది. పళ్ళు బయటపడ్డాయి కానీ నవ్వు కళ్ళలోనే దాక్కుండిపోయింది. అక్కడ కుందేలూ తాబేలూ పరుగుపందెం ఆపి కులాసాగా కబుర్లాడుకుంటున్నాయి. అటు పరిగెత్తి ఆ కబుర్లు తానందుకుని తన దగ్గరున్న మూటలో కబుర్లు వాటికి పంచాలనుకుంది. రెండుపాదాలూ భూమిలో దిగబడిపోయాయి ఇంకెలా కదులుతుంది.

 

ఒక నీడ తన దగ్గరగా వచ్చింది ...తాను చేతులెత్తింది పైకి లాగమని ...... కానీ ఆ నీడ తన రెండు చేతులనీ కలిపి కట్టేసి, తలకి నల్లని ముసుగు వేసేసి బరువుగా తన మీద పడుతుంది. వద్దొద్దు....నన్నలా తాకొద్దు నాకు కంపరంగావుంటుంది.....అయ్యో నా కాళ్ళే కాదు, కళ్ళూ చెవులూ, నోరు గొంతూ అన్నీ మూసుకుపోయాయి ....నాకు ఊపిరాడ్డంలేదు నన్ను ఇక్కడినుంచీ బయట పడేయండి ....... గాలి తగలకపోతే నేను చచ్చిపోతాను.

 

కావాలంటే నా కాళ్ళూ చేతులూ, కళ్ళూ చెవులూ అన్నీ బంధించెయ్యండి. నోరు కూడా గట్టిగా కుట్టేయండి కానీ .....నాకు గాలి కావాలి....నేను ఊపిరి పీల్చుకోవాలి.... నేనీ బరువును మోయలేను...... ఎవరో ఒకరు రండి .... విదిలించుకుంటూ అరుస్తున్నానుకుంది ...ఊహు మూలుగుతుంది......సన్నగా దిగులుగా ....మరో చెవికి సోకనంత నిశ్శబ్ధంగా ......ఇతరులెవరూ కనిపెట్టలేనంత రహస్యంగా ......... మూలుగుతుంది .... ”వద్దొద్దు”......పెనుగులాడుతూ మూలుగుతుంది .

 

“ ఛీ...ఛీ.... దరిద్రం...రోజూ ఇదే ఏడుపు .. .....పో .....పోయి అవతల గదిలో అఘోరించు ఈ మాత్రానికి ఇక్కడెందుకు ....మంచం ఇరుకు చేసుకోటం " నిన్నే...." భుజం పట్టుకు తోసినంత పని చేస్తే ... చప్పున కళ్ళు తెరిచి, కలలో ఉందో నిజంలో పడిందో తేల్చుకోలేక ఒక్క క్షణం నిశ్చేస్టురాలయిపోయింది. వెల్లకిలా పడుకుని ముఖం చిట్లించి నోరు పడేసుకుంటున్న భర్తని చూస్తూనే గాఢంగా గుండెలనిండా ఊపిరి తీసుకుంది.

 

అలవాటయిన ఈసడింపుని ఆనవాయితీగా విదిలించుకుని చీర సర్దుకుంటూ హాల్లోకొచ్చి పడింది. ఏంటో !! ఆ కల అలావుంది. కలలో రంగులూ ...రాగాలూ....ఆటలూ .....అరమరికలు లేని స్నేహాలూ ......అన్నీ బావున్నాయి కానీ.....తనకేవయిందీ ? ఎవరితోనూ కలవలేక అలా వొంటరిగా నేలలో కూరుకుపోయి.......అవునూ ఆ నీడెవరిదీ??

 

తనకి సాయం చేయకపోగా అదేం పని !!......వచ్చింది పీడకలో రంగుల కలో అర్ధం కాలేదు ఆమెకి. ఈ క్షణం వరకూ అదే ఆలోచిస్తుంది ఏ వందసార్లో రంగుల రాట్నం తిరిగినట్టూ అలా ఆమె మస్తిష్కంలో తిరుగుతూనే వుందా కల.

 

పూర్తయిన మాలను చూసింది. ఖాళీ ఖాళీగా అక్కడక్కడా ముడులు మాత్రమే కనిపిస్తూ కొన్ని చోట్ల సాగదీసినట్టూ .....!! చిన్నప్పుడు నాన్నమ్మ తిట్టేది. పాపిడి తిన్నగా రానప్పుడూ, ముగ్గు వంకరగా వేసినప్పుడూ , గోరింటాకు ఎర్రగా పండకపోయినా తిట్టేది. అవన్నీ కుదురుగ్గా వస్తేనే .... కాపురం కుదురుగా సాగుతుందట. చేతులు ఎర్రగా పండించుకోవు. వెంటనే కడిగేసుకుంటావు ....ఓర్పూ నేర్పూ లేకపోతే మొగుణ్ణేం సుఖపెడతావు అనేది.

 

పువ్వులు అందంగా వత్తుగా సరి సమానంగా మాల కట్టే అమ్మాయి సంసారాన్ని కూడా అలానే ఒద్దికగా చేసుకుంటుందట. సాధించి మరీ నేర్పించేది అవన్నీ. తనకేమో అన్నీ అల్లిబిల్లిగా ఉంటే ఇష్టం, కుదురులో ఒక పద్ధతిగా పెరిగే మొక్కల కన్నా తనకి నచ్చినట్టూ స్వేచ్చగా, పందిరంతా అల్లుకుపోయే పూల తీగలంటే ఇష్టం. అయినా తన ఇష్టం ఎప్పుడు చెల్లింది. దుర్గ తో స్నేహం చేస్తే నప్పేది కాదు.

 

”శూద్రపిల్ల తో స్నేహం ఏంటే సీతా “ అని కోప్పడింది. “ఇంకోసారి మా పిల్లతో కనిపిస్తే కాళ్ళిరగ్గొడతాను” అని భయపెట్టింది. తనకిష్టమని దుర్గ తెచ్చి పెట్టే మామిడి తాండ్ర, మాగాయ ముక్కలు తినకుండా చేసింది.

 

దుర్గతో కలిసి కంచెల్లో పండే పుల్లరేగుపళ్ళూ, వాక్కాయలూ, చేలల్లో చెట్లెక్కి కోసుకునే యలక్కాయలు అన్నిటికీ దూరం చేసింది. ఎవరి పెరట్లోంచో అలుపులేకుండా కూసే కోయిల స్వరానికి బదులిస్తూ కూ....అంటే, కూ....అని కోకిలని రెచ్చగొట్టడం తనకి ఎంతిష్టమని.

 

నాన్నమ్మ వింటే “హుష్....తప్పూ ఏంటా నోరెట్టుకుని అరవడం” అని కసిరేది. తొమ్మిదో తరగతిలో ఉండగా కదూ ఎంత మొత్తుకున్నా వినకుండా చదువు మానిపించేసాడు నాన్న. “తల్లి లేని పిల్లని గారాబం చేస్తే రేపు మనం బాధ పడ్డా ప్రయోజనం ఉండదు“ అని నాన్నమ్మ వంత పాడింది . చదువూ, ఆటలూ అన్నిటినీ వదిలేసుకుని ఎందుకు తింటుందో ఎందుకు పెరుగుతుందో తెలియని ఆ రోజుల్లో ఆ రేడియో అబ్బాయి ......పక్క పోర్షన్ లో దిగాడు. కిటికీకి దగ్గరగా తనకి వినిపించేలా పెద్ద సౌండ్ తో పాటలు పెట్టేవాడు.

 

ఇవతల గోడకి జారబడి తను పాటలు వింటున్నట్టూ ఎలా కనిపెట్టాడు!! ఒకరోజు రెండు పుస్తకాలు కిటికీలోంచీ విసిరేసి పోయాడు. ఒకటి ' కృష్ణ పక్షం ' ఒక కవిత ఇప్పటికీ గుర్తుంది తనకి. "నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గూ నా ఇచ్చమే గాక నాకేటి వెరపు" ........ “పక్షి నయ్యెద చిన్ని ఋక్ష మయ్యెదను మధుప మయ్యెద చందమామ నయ్యెదను మేఘ మయ్యెద వింత మెరపు నయ్యెదను అలరు నయ్యెద చిగురాకు నయ్యెదను” చదవుతుంటే ఎంతో బావుంది.

 

కానీ అలా అయిపోవడం ఎలా కుదురుతుందీ ........వీధరుగు మీంచి చెంగున దూకాలన్న చిన్న సరదానే తీరడంలేదే తనకు ఆ రేడియో అబ్బాయిని ఇంటికి పిల్చి, మండువాలో బల్లమంచం మీద కూర్చోమని, తినడానికి గవ్వలో జంతికలో పెట్టీ ....అప్పుడు ఆ కవితలన్నీ పెద్ద గొంతుతో చదువుతూ అదెలా సాధ్యమో అడగాలని పేద్ధ కోరికగా ఉండేది తనకి.

 

ఆ కోరిక తీరకపోగా అసలుకే మోసం వచ్చింది. ఆ రెండో పుస్తకం నాన్న కంట పడింది "ప్రేమలేఖలు" కావల్సి వచ్చాయేనీకు .....అంటూ ప్రారంభించి తన మెళ్ళో మూడు ముళ్ళూ వేయించి కానీ ముగించలేదు.

 

“బాబూ...పిల్లని ఎంతో పద్ధతిగా పెంచాం. వంచిన తలెత్తడం మాటకి మాట ఎదురాడ్డం దానికి చాత కాదు. నువ్వెలా చెపితే అలా నడుచుకుంటుంది. తల్లిలేని పిల్ల అన్నీ నువ్వే నాయనా జాగ్రత్తగా చూసుకో వాలి “ అంటూ ....మరో నాలుగు ముళ్ళేసి పోయిందా పెద్దావిడ.

 

వంటింట్లో గిన్నెలు కొట్టుకున్న శబ్ధంతో సీతదేవి ఆలోచనలు తెగిపడ్డాయి. “రాత్రి తీరని ఆకలికి పొద్దున్నేపుట్టిన ఆకలి తోడయ్యింది. ఇక శివాలే ....” అనుకుంటూ కదిలిందామె. నేతితో వేయించిన పెసరట్టులో జీడిపప్పు ఉప్మా సర్ది పేపర్లో మునిగిన భర్త ముందుంచింది.

 

“పెసరట్టు మాడింది“ అన్నాడాయన ఆవిడ ఎటో చూస్తూ నుంచుంది "ఒకటి చాలదా ....రెండు టిఫిన్లు ఎందుకూ దండగా" అన్నాడు ఉప్మా జరిపేస్తూ ..... "కలిపి తింటే బావుంటుంది ...."

"ఈ వయసులో అరిగి చావొద్దూ ...." అన్నాడు పెసరట్టు నోట్లో కుక్కుకుంటూ

 

"రాత్రి తగ్గిన వయసు తెల్లారేపాటికి పెరిగిపోయిందా..." అనాలనిపించినా అనలేదు. ఎదురు మాట్టాడం రాదని ఆ నాడెపుడో నాన్నమ్మ చెప్పిన మాటని ఈ నాటివరకూ నిజం చేస్తూ వచ్చింది ఆవిడ. టి. వి. లో వస్తున్న దరిద్రపు ప్రకటనని తదేకంగా చూస్తున్నాడతను .

 

రోజుకో కేప్సూల్ మింగితే నవ మన్మధులయిపోవచ్చు అని ఊరిస్తూ చెపుతుంది అమ్మాయి. తన కలలో చేపలకి చెట్లెక్కడం నేర్పిస్తున్న కోతి పిల్ల గుర్తొచ్చింది. ఈ టైముకే సంగీత విభావరి ప్రోగ్రాం వచ్చేది. అతడు త్వరగా తిని స్నానాకి లేస్తే తను ఛానెల్ మార్చుకోవచ్చని చూస్తుంది ఆవిడ.

 

బ్రేవ్ మంటూ త్రేంచి......ప్లేటు ఆవిడకి అందిచి తాను పేపరు అందుకున్నాడు. రిమోట్ వొళ్ళోనేవుంది. అతను చూడటం లేదు కదా అని తనకి నచ్చిన ఛానెల్ పెట్టుకుని చివాట్లు తింది ఒకసారి. ఆరోజు కళ్ళల్లో పొంగుతున్న నీటినీ, గొంతులో ఉబుకుతున్న దుఖాన్నీ ఆపుకోటానికి పెద్దగా కష్టపడలేదు. ఎందుకంటే అది ఆవిడకి అలవాటయిపోయింది

 

ఉల్లిపాయ ఘాటులాగా. వంటేం చేసావ్ అని ఆయన అడగడానికీ.......లేదా, భోజనానికి లేవండి అని ఆవిడ అనడానికీ మధ్య మూడు గంటల పాటు వాకిట్లో కాకులగోల టి.వి. లో వార్తల గోల తప్ప మిగిలిందంతా నిశ్శబ్ధమే.

 

"మీవారు భలే సరదాగా మాట్లాడతారండీ "అంది అప్పుడెప్పుడో ఒకావిడ, రోడ్డుమీద కూరలబండి దగ్గర పరిచయం తనకీ ఆమెకీ .......” అవునా !!“ అని హాస్చర్యం ప్రకటించాలనిపించింది కానీ నవ్వేసి ఊరుకుంది తను. తాను పిల్లని ఎత్తుకొచ్చాకా కదూ ... అతని దగ్గరికి ఆఫీస్ పనిమీద ఒకతను వస్తూవుండేవాడు.

 

"అతను నవ్వు ఎంత స్వచ్చంగా ఉంటుందో కదండీ......నోరంతా తెరిచి నవ్వుతుంటే ఆ చిన్ని కళ్ళు మరింత చిన్నవయిపోతాయ్ అతన్నలా చూస్తూ మనం నవ్వకుండా వుండలేం"... అంది అబ్బురంగా.

 

ఆ తర్వాత ఎప్పుడూ మళ్ళీ ఆ నవ్వు తన కళ్ళపడలేదు ..... ’ఏవయ్యిందానవ్వు‘ అని తనూ ఆరా తీయలేదు. అతనేవిటో ఏ మాత్రం తెలియని కొత్తల్లో ఓ రాత్రి డబామీద పక్కలేసింది. ఎందుకు చేయాలనిపించిందో అలా, తలలో పెట్టుకునే పువ్వుల్ని తలగడ మీద జల్లింది. వెల్లకిలా పడుకుని చందమామతో మేఘాలు ఆడుతున్న దోబూచులు చూస్తుంది పవిటని గాలికి వదిలేసి “ ఏంటీ వేషాలు ఇవన్నీ ఎక్కడ నేర్చావ్!? “కటువుగా వుందామాట.

 

"తెగ కబుర్లు చెప్పింది మీ నాన్నమ్మ ఆ రోజు ....." తెల్లగా పాలిపోయిన అతని ముఖం ముందు వెన్నెల నల్లగా ఉందనిపించింది. వెనక్కి తిరిగి చూడకుండా ఒక్క గెంతులో వెళ్ళిపోయాడు. తను చేసిన తప్పేంటో తెలీకపోయినా, హడలిపోయింది వణికిపోయింది. ఆ భయం ఎన్నాళ్ళో ఎన్నెళ్ళో తనని వీడలేదు.

 

ఇప్పటికీ దేహంలో ఏదో మూల ఆ భయం అలా ముణగదీసుకుని ఉండిపోయిందేమో కూడా!! మనసూ మనసూ కలిసినప్పుడే పిల్లలు పుట్టే ఏర్పాటు ఆ దేవుడు చేయనందువల్ల .... చూస్తుండగానే ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు. పిల్లల పోషణ, ఇంటి సంరక్షణ తప్ప ఆవిడకి మరో పని లేదు. ప్రాధమిక అవసరాలు తీర్చుకోటమే పరమావధిగా జీవితం గిర్రున తిరిగింది.

 

“అమ్మాయిని చదివిద్దాం ....అపుడే పెళ్ళెందుకూ“ అని మాటమాత్రంగా అనగలిగింది కానీ, పట్టుపట్టి ఆపలేకపోయింది.

 

“నువ్వు నోర్మూసుకో.....ఏం చెయ్యాలో నాకు తెలీదా! పిల్లలముందు తన ప్రతాపం ప్రదర్శించాడు భర్త.” నాన్నకు కోపం తెప్పిస్తావెందుకమ్మా .....నా బట్టలు సర్దావా నేను హాస్టల్ కి వెళ్ళిపోవాలి“.

 

“నోరుమూసుకుని నీ పని చూసుకో” అనడంలో లౌక్యం చూపించాడు కొడుకు. పండక్కి పుట్టింటికొచ్చిన కూతురు స్నేహితురాలితో మనసు విప్పి మాట్లాడుతుంది. "చదువుకోటానికి అతన్ని ఎలా వొప్పించావ్! ఆ సీక్రెట్ ఏదో నాకూ చెప్పవే" ఉత్సాహంగా అడుగుతుంది స్నేహితురాలు. మరి మా అమ్మలా అనుకున్నావా ....” కళ్ళెగరేసి చెపుతుంది కూతురు.”

 

కోతుల్ని ఆడించడానికీ, పాముల్ని ఆడించడానికీ ట్రిక్స్ ఉన్నట్టే ....మొగుడ్ని ఆడించడానికీ కొన్ని ట్రిక్స్ ఉంటాయ్లే” ... అంటూ ఆ స్నేహితురాలి చెవిలో ఏదో చెప్పింది ఇద్దరూ గలగలా నవ్వుతున్నారు. సీతాదేవికి సంతోషం వేసింది. తన కూతురుకి తన పోలిక రానందుకు.

 

మొగుణ్ణి ఆడించే ట్రిక్ ఏదో ఆ పిల్ల నేర్చుకున్నందుకు. ముఖ్యంగా అమ్మలా కానందుకు. ఒక ధనుర్మాసపు సాయంత్రం....... "అన్నీ టేబుల్ మీదే ఉన్నాయి. గంటలో వచ్చేస్తాను. గుళ్ళో స్వామీజీ ప్రసంగ వుందట ...శారదగారితో వెళుతున్నాను" అతనికి రాగల సందేహాలేవో ముందే తెలుసున్నట్టూ వరసగా సమాధానాలు పేర్చుకొచ్చింది. “రోజుకో దొంగ స్వామి భాగోతం బయటపడుతున్నా .....మీరు మారరు.

 

టి.విలోనూ పేపర్లోనూ ఎందరెందరు సన్నాసుల్ని ఎండగడుతున్నారో ......ఎక్కడ చూసినా దొంగ ముం .....కొడుకులే. అయినా మీలాంటి తెలివి తక్కువ దద్దమ్మలు ఇంటికొకరు బయల్దేరుతుంటే వాళ్ళననుకోటం దేనికిలే....” పెద్ద ఉపన్యాసమే అయింది. ఉన్నంతలో మంచిని వెతుక్కుంటూ పోవాలి కానీ,

 

అంతా కుళ్ళే అని కూర్చుంటే ...అడుగు ముందుకు వేయగలమా !! అనుకుని ఆవిడ గడప దాటుతుండగా కొట్టాడు చివరి దెబ్బ" హు....ఏదో వంకతో ఊరుమీద పడ్డం కావాలి" అతని చేతిలో మస్కిటో బేట్ కి చీక్కిన దోమ కరెంటు షాక్ కి గిలగిల్లాడుతుంటే తలతిప్పుకుంది ఆవిడ.

 

రామాయణంలో సీత రాముణ్ణి వదిలి వెళ్ళిందా వదిలించుకుని వెళ్ళిందా అన్న సందేహం కలిగిందావిడకి మొదటిసారి. సహనం చచ్చిపోయి కదూ సీత అతన్ని కాదని అమ్మ వడి చేరిందీ!!. ఆ మాత్రం తెగింపు తనకెప్పుడయినా కలుగుతుందా ......!! వెనక్కి వెళ్ళీ అతని చెంప పగలగొట్టాలన్న ఆలోచనని అతికష్టం మీద నిభాళించుకుని, ఆ ఆలోచనకే లెంపలేసుకుని బయటికి నడిచింది.

 

గుళ్ళో ముందంతా తొడతొక్కిడిగా అనిపించి ఎక్కడయినా వినడమేకదా కావలిసింది వెనకవైపు కూర్చుంటానని, శారదగారికి చెప్పి గర్భగుడికి వెనకవైపు ఎత్తు గట్టెక్కి కూర్చుంది.

 

అందరూ స్వామీజీని చూడాలనీ, వీలయితే కాళ్ళమీదపడి ఆయన దివ్య ఆశీస్సులతో తమ బాధలన్నీ తొలగించుకోవాలనీ ఉవ్విళ్ళూరుతూ గుడిముందు తోసుకుంటున్నారు. వెనక ప్రశాంతంగావుంది. ఎదురుగా అద్దాలమండపం ..... గోడకి వరుసగా పేర్చిన అద్దాల్లో తనకి తాను కనిపిస్తూంది. అలా చూస్తుండగానే ఒక్కో అద్దంలోంచీ తను కనుమరుగైపోతుంది.

 

వరుసగా నాన్నమ్మ, నాన్న, భర్త , పిల్లలు ....ఇంకా ఎవరెవరో కనిపిస్తున్నారు. ‘మీరెప్పుడూ ఇంతే నాకు అడ్డుగా నిలబడతారు. తప్పుకోండి మీరంతా... నన్ను నేను చూసుకోవాలి‘ అని అర్వాలనిపించిందామెకు. కానీ అలా అరిస్తే నలుగురూ పోగయిపోరూ ......!! నిస్సహాయంగా అద్దాల్లో కనిపించని తన ప్రతిబింబాన్ని వెతుక్కుంటుంది.

 

"ఇక్కడ కూర్చోవచ్చా" ...తల తిప్పి చూసింది. అచ్చం తను కట్టుకున్న చీరలాంటిదే కట్టుకుందామె. "నువ్వంటే నీకిష్టమేనా .....?" పక్కనే కూర్చొని హటాత్తుగా అంది. సీతాదేవికి అర్ధం కాలేదు ......ఏవంటుంది నేనంటే మీకిష్టమేనా అందా !! "నీకేం కావాలో నువ్వెప్పుడన్నా తెలుసుకున్నావా??"

 

"నీ అశాంతికి నువ్వే కారణం అని ఎప్పుడూ అనిపించలేదా?? "నీ జీవితంలోకి సంతోషాన్ని ఆనందాన్ని తెచ్చుకోవాలని నువ్వెప్పుడయినా గట్టి ప్రయట్నం చేసావా?? “ఎందుకు తప్పు అందరిమీదా తోస్తావ్ .....నిన్ను నువ్వు నిలుపుకోలేనపుడు ఆ శూన్యంలో ఏదో ఒకటి నిండాలి కదా అలా నిన్ను ఆక్రమించినవాళ్ళే వీళ్ళంతా ...” అద్దాలవైపు చూపించింది.

 

సీతాదేవి ఆశక్తిగా వింటుంది ...... ఎదో మంత్రం వేసినట్టూ రెప్పలు వేయటం కూడా మర్చిపోయి ఆమెనే చూస్తూ వళ్ళంతా చెవులు చేసుకు ఆ అపరిచితురాలిని వింటుంది సీతాదేవి నీకు గుర్తుందా .....చిన్నప్పుడు చెవి పోగులూ ఎవరూ తెంచుకుపోకుండా నాన్నమ్మ బూచాడు భయం పెట్టింది.

 

ఆ చివరి మెట్టు దిగావో బూచాడు ఎత్తుకెళ్ళి నిన్ను నమిలి తినేస్తాడు అని ఆవిడంటే .....నువ్వక్కడే ఆగిపోయావు. నీ మనసు ఆనవాలు నీకు దొరికేలావుందని నాన్న కనిపెట్టేసాడు. అందుకే పెళ్ళి చేసి ప్రమాదాన్ని తప్పించానుకున్నాడు.

 

అక్కడితో నువ్వూ వెతుకులాట ఆపేసావు. భార్యని తన స్వంత వస్తువుగా భావించడానికి సర్వాధికారాలూ కలిగిన వాడినని నీ భర్త గ్రహించాడు. ఆ అధికారంతో ‘నీలోంచి నిన్నే‘ పూర్తిగా గెంటేసాడు. దాన్ని నువ్వో ధర్మంగా అమలుపరిచావు.

 

ఎప్పుడూ ఏ భావాలూ కనపరచని నువ్వో ‘ఖాళీ డబ్బావి‘ అనుకున్నారేమో పిల్లలు వాళ్ళూ నిన్ను గాల్లోకి తన్ని ఆనందించారు. నా పిల్లలే కదాని నువ్వూ చప్పుడు చెయ్యకుండా పడి ఉండిపోయావు.

 

“ఇంకే చేయగలను.....నాకు విలువియ్యటం మాట అటుంచి ఎవ్వరూ కనీసం నన్నో మనిషిగా అయినా గుర్తించడంలేదు“ జాలిగా నవ్వుతుందనుకుంటే మెరుస్తున్న కళ్ళతో చల్లగా నవ్వి అంది ..... ఇప్పటికీ ఆలశ్యం కాలేదు.

 

ఈ క్షణమే దాని ఉనికిని కనిపెట్టు. సందేహంగా చూసిందావిడ ’దేన్నీ‘ అన్నట్టూ.... నీలో ఒక ఆత్మవుంది. దాన్ని అణచిపెట్టడం, లేదా పూర్తిగా మాయం చేయడం వేరొకరివల్ల అయ్యేదికాదు.

 

ఇది ఎంతగా నువ్వు గుర్తించగలిగితే అంత గా నీ జీవితం పరిపూర్ణమవుతుంది. కలిమిలేములతోనూ కష్ట సుఖాలతోనూ సంభంధ లేని ఆనందం నీ సొంతమవుతుంది. సెలయేరులాంటి చల్లని స్వరంతో ఆమె అలా అనునయంగా మాట్లాడుతుంటే సీతాదేవికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

 

"ఎవరునువ్వూ.....నా చిన్నప్పుడే చచ్చిపోయిన మా అమ్మవా?? "

 

“సీతా ఇంకా అర్ధం కాలేదా .... అమ్మయినా, నాన్నయినా, పిల్లలయినా ఎవరూ ఒకరికోసం ఒకరు పుట్టరు. ఎవరూ ఎవరికీ పూర్తి తోడవ్వరు .......” నీకు నువ్వే సాయపడాలి నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి.

 

“ఉద్ధరే దాత్మనా త్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనోబన్దురాత్మైవ రిపురాత్మనః॥“... అనేకదా భగవానుడు చెప్పాడు నీ స్థితికి కారణం నీలో దొరుకుతుంది. నీ మనసును వెతికిపట్టుకో ...అసంతృప్తికి కారణం కనిపెట్టు ......ఇష్టాలకు ఊపిరిపొయ్యి ......కోయిలలా గొంతెత్తి పాడు, నెమలిలా వొళ్ళువిరుచుకుని నాట్యం చెయ్యి,

 

సీతాకోకచిలుకలా రంగులు నింపుకుని నచ్చిన చోటికి ఎగురుతూవెళ్ళు .....నలుగురినీ నీతో కలుపుకో ...... నీలో నువ్వుండు. సీతాదేవికి మనసూ శరీరం దూదిపింజలా ఉంది. కొత్త వెలుగేదో వెచ్చగా తనని కపినట్టూ హాయిగావుంది.

 

దివ్యమయిన అనుభూతి ఏదో అణువణువూ ఆవరించినట్లైంది. ఏనాడో పోగొట్టుకున్న అపురూప వస్తువేదో అనుకోకుండా కళ్ళపడితే ఎంత విస్మయంగా వుంటుందో అలావుంది.

 

ఆ రాత్రి ..... ఇంద్రధనుస్సు కు ఊయల కట్టి భూమికీ ఆకాశానికీ మధ్య నిర్భయంగా ఊగుతూంది తను. పంచవన్నెల రామ చిలుక తన భుజం మీద వాలి చక్కిలిగిలి పెడుతుంది. తను సుతారంగా దాని రెక్కల్ని సవరిస్తూవుంది.

 

గాల్లో ఊరేగుతూ వచ్చిన మెత్తని పూరేకులు జలజలా తలబ్రాల్లా రాలుతున్నాయి. ఆ స్పర్శకి పులకించిపోతూ దూరం నించీ వినవస్తున్న సన్నాయిరాగానికి ముగ్ధురాలై చిన్నగా తల ఊపుతూ కూనిరాగం తీస్తుంది

 

...... ఆ రాగం మోహన..... కళ్యాణి..... ఆనందభైరవి .....కాదు కాదు అదో కొత్త రాగం .. "జీవరాగం" నుదుటిమీద నిలిచిన వెచ్చటి పెదవుల స్పర్శ ని ఇష్టంగా తడుముకుని అతనికి దగ్గరగా చేరింది.

********

ఉదయపు నీరెండకి తల ఆరబోసుకుంటూ, చక్కగా తయారయిన చేతిలో మాలను చూస్తూ అనుకుంది ...

 

‘ఆ రోజు గుళ్ళో కలిసి, నన్ను నాకు దగ్గర చేసిన ఆమె ఎవరూ. వెళుతూ వెళుతూ తనెవరో చెప్పిందే....!!’

“సీతా ...” .

మొహమాటంగా ఎవరికీ వినపడకూడదు అన్నంత రహస్యంగా పిలిచాడాయన. మొదటిసారి భర్త నోటివెంట నిన్నే....ఏమేవ్..వసేయ్....వంటి పదాలు కాకుండా సీతా అన్న తియ్యని పిలుపు ఆవిడ మనసులో అలజడులు రేపుతుండగా ఉద్వేగాన్ని అణచుకుంటూ......

 

"ఇదిగో వస్తున్నా...." అంటూ కుచ్చిళ్ళు సర్దుకుని కదిలింది.

 

ఆనాడు గుళ్ళో తను విన్నది నిజమే ఇప్పటికీ ఆలశ్యం కాలేదు.