Home » Articles » ఉగాది రోజున ఏం చేయాలి

ఉగాది విశిష్టత

రచన : యం.వి.ఎస్. సుబ్రహ్మణ్యం.

 

 

విజయనామ సంవత్సరం "విజయీభవ'' అని దీవిస్తూ వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయింది. జయనామ సంవత్సరం "జయీభవ'' అని ఆశీర్వదిస్తూ కాలకన్య ముంగిట వసంత ఋతువు శోభతో కొలువు తీరింది. కొత్త ఆశలతో జగతి ముందు నిలిచింది.

ఇలా ఎన్ని సంవత్సరాలు గతించినా... కాలానికి వయసు పెరగదు, వ్యార్థకం రాదు. అందుకే కాలం మహావేగంగా పరుగుతీస్తుంది. అట్టి కాలం యొక్క వేగాన్ని సులభంగా లెక్కించటానికి మన ఋషులు ప్రభవ, విభవ, ప్రమోదుతాదిగా గల 60 సంవత్సరాలను ఏర్పరిచారు. సంవత్సర ప్రమాణం కల కాలానికి చైత్రం, వైశాఖం అనే మాస నామాలను గవ్యస్థానాలుగా, ప్రతి మాసానికి పాడ్యమి, విదియాదిగాగల తిథులను మైలురాళ్ళుగా నిర్ణయించి, కాల గమనాన్ని లెక్కించడం ప్రారంభించారు. ఈ కాలగమనంలో చైత్ర మాస శుక్ల పాడ్యమి "ఉగాది''. కాల గణితం ప్రారంభమైన రోజు. ఈ 'ఉగాది' రోజునే చతుర్ముఖబ్రహ్మ సృష్ఠి ప్రారంభించాడు. అదే నవయుగానికి నాంది.

 


ఆ యుగమే "యుగాది'' అయింది. ఆ "యుగాది'' కాలగమనంలో "ఉగాది''గా రూపాంతరం చెందినది. "యుగం'' అంటే జంట అనే అర్థం కూడా ఉంది. ఉత్తరాయణం, దక్షిణాయణం అనే జంట ఆయనాలతో కూడిన యుగ ప్రారంభానికి యిది తొలి రోజు కనుక దీనిని "ఉగాది'' అన్నారు. సృష్ఠి ఆరంభంలో తొలి సూర్యోదయం చైత్రశుద్ధ పాడ్యమి నాడు (ఉగాది) లంకానగరంలో జరిగిందని, భాస్కరా చార్యుడు "సిద్ధాంత శిరోమణి''లో ప్రస్తావించాడు.


చైత్ర శుద్ధ పాడ్యమి నాడే కలియుగం ప్రారంభమైంది. త్రేతాయుగంలో ఉగాది నాడే శ్రీరాముడు పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ ఉగాది నాడే శ్రీమహావిష్ణువు తన తొలి అవతారమైన మత్సావతారాన్ని ధరించి, సోమకాసురుని సంహరించి, వేదాలను రక్షించి, బ్రహ్మకు అప్పగించాడని పురాణకథణం. విక్రమార్క, శాలివాహన చక్రవర్తుల ఈ ఉగాది రోజునే సింహాసనం అధిష్ఠించారు. ఇన్ని విశేషాలు కలది కనుకనే "ఉగాది'' మనకు పండుగ రోజు అయింది.

 

మన హిందూ సంప్రదాయంలో మన పండుగలు ఒక ప్రత్యేక దైవరాధనతో జరుపుకోవడం మన ఆచారం. కానీ "ఉగాది'' ఏ దైవరాధనకు సంబంధించినది కాదు. కాలాన్ని ఆరాధించే పండుగ. ఇందులోనూ అంతర్లీనంగా దైవచింతన ఉంది. "కాలః కాలయతా మహం'' అన్నాడు శ్రీకృష్ణుడు. కంటికి కనిపించని ఆ కాలం యొక్క స్వరూపం నేనే అంటాడు ఆ గీతాచార్యుడు. అందుకే "ఉగాది'' రోజున విష్ణు సంకీర్తనం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభప్రదం.