Home » Articles » ఆరోగ్యానికి ఉగాది పచ్చడి

ఆరోగ్యానికి ఉగాది పచ్చడి


రచన : యం.వి.ఎస్. సుబ్రహ్మణ్యం

 

 

 

'ఉగాది'నాడు "నింబకుశుమ భక్షణం''చేయాలని శాస్త్రవచనం. "నింబ కుశుమం'' అంటే "వేపపువ్వు''. వేపపువ్వును ఉపయోగించి, ఈ పచ్చడిని తయారుచేయాలి.ఈ పచ్చడి తీపి, ఉప్పు, పులుపు, కారం, చేదు, వగరు అనే షడ్రుచుల సమ్మేళనం. మన వంటకాలలో యిది తొలి పచ్చడిగా చెప్పుకోవాలి.

 

- ఋతువులలో తొలి ఋతువైన ఈ వసంత ఋతువులో,

- మాసాలలో తొలి మాసమైన చైత్రమాసంలో,

- పక్షాలలో తొలిపక్షమైన శుక్లపక్షంలో,

- తిథులలో తొలి తిథియైన పాడ్యమి తిథినాడు,

- పువ్వులలో తొలిపువ్వు అయిన వేపపువ్వుతో,

- వంటలలో తొలి వంటకమైన బెల్లాన్ని కలిపి,

- తొలిపండు అయిన చింతపండును తగినంతగా చేర్చి,

- తొలి పంట అయిన మిరియాల పొడిని కలిపి,

- తొలి కాయ అయిన లేత మామిడి పిందెల ముక్కలను చేర్చి,

- తొలి రుచిగా చెప్పుకునే ఉప్పును తగినంతకలిపి, ఈ ఉగాది పచ్చడిని తయారుచేసి,

- కుటుంబంలో తొలి పురుషుడైన తండ్రి చేత,

- తొలి దైవమైన కాలపురుషునకు నివేదన చేసి,

ఆ తండ్రి చేతులమీదుగా ఈ పచ్చడిని కుటుంబంలో వారందరూ స్వీకరించాలి. ఇదే ఉగాది పచ్చడి స్వీకరించే విధానం. షడ్రుచులలో చవులూరించే ఈ పచ్చడి ఆరోగ్యదాయిని అని ఆయుర్వేదం చెబుతోంది.

- వేపపువ్వులోని చేదు కఫ, పిత్తాలను తగ్గించి ఆకలిని పెంచుతుంది. దగ్గు, జ్వరం, వ్రణాలకు యిది మంచి ఔషదం. చర్మవ్యాధులను తగ్గిస్తుంది.

- బెల్లంలోని తీపి శరీరంలోని వాతాన్ని తగ్గించి, బలాన్ని పెంచి, వీర్యవృద్ధి కల్గిస్తుంది.

- చింతపండులోని పులుపు విరేచన కారకం. వాపును పక్వం చేస్తుంది. వాతాన్ని తగ్గిస్తుంది.

- మిరియాలలోని కారం కఫ, వాత హారం. ఆకలిని పెంచుతుంది.

- పచ్చిమామిడిలోని వగరు విరేచనాలను, బహుమూత్రత్వాన్ని నిరోధించి, గుండెకు మేలు చేస్తుంది.

- ఉప్పు కఫహరం, విషహరం, మలమూత్రాదులలోని యిబ్బందులను తొలగిస్తుంది.


 

 

ఆరోగ్యపరంగా యిన్ని రకాలుగా ప్రయోజనకారియైన ఉగాదిపచ్చడి మనకు మన సంప్రదాయం అందించిన ప్రకృతి ఔషధం. ఈ తొలి ఉగాదిపచ్చడిని ప్రీతిగా ఆరగించి, నూతనోత్తేజాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని స్వాగతిద్దాం.