Facebook Twitter
కవిత్వం



 

కనీ కనిపించని అలజడులే గుప్పెడు మనసును స్పృశించినపుడు
ఉప్పెనలా పొంగుతున్న భావాలను తెల్లకాగితంపై
ఒంపుకోవాలనుకున్నపుడు
మది చెందే ఉద్వేగానికి పసివాడైపోతాడు కవి..

నాలుగు గోడల నడుమ నిశ్చేష్టుడై నిదురించే నిశిరాత్రిలో మనసు ముసుగులో నిశాచరాలై
విహరించే భావాలు అనేకం..

కవి ఒక నిరంతర మానసిక శ్రమైక జీవి..
కవిత్వం ఎంత త్రవ్వినా తరగని విజ్ఞానఖని..

రెండు చప్పట్లు..
నాలుగు మెచ్చుకోళ్ళు..
పదిమంది అభిమానులు కాదు కవి అంటే...

ఆపదొచ్చినప్పుడు నాలుగు తిట్లు..
అరముక్క కూడా అర్థంకాని కొన్ని అతితెలివి మాటలు..
పబ్లిసిటీ,డబ్బుకోసం చేసే వ్యాపారం కాదు కవిత్వమంటే...

విజ్ఞానపు పొదరింట్లో పురుడు పోసుకున్న
అగ్నిపూల్లాంటి అక్షరాలు కవిత్వమంటే..

సమాజంలో యుద్ధం అవసరమైనపుడు
కలాన్ని ఆయుధంగా వాడి పోరాడేవాడు కవి అంటే..

చదువుతున్న కళ్ళు ధీర్ఘంగా విప్పారి
గుండెకు తగిలిన అక్షర తూటాలకు బానిసై
భాద్యతను గుర్తుచేసేది కవిత్వమంటే...

మనసులోని భావాలను సిరాగా పోసి
సమాజ అభ్యుదయానికి అజరామరంగా కృషి చేసేవాడు కవి అంటే ..

రెక్కలు లేకున్నా అనంతానంత లోకాల్లో
తన్మయత్వంతో విహరింపజేసేది కవిత్వమంటే..

నీకు నిన్ను పరిచయం చేసేది కవిత్వమంటే..
కవిత్వమంటే విజ్ఞానం..
కవిత్వమంటే ఆదర్శం..
కవిత్వమంటే ఆనందం..
కవిత్వమంటే తపన..
కవిత్వమంటే " జీవితం" ..

 

 

 

......... సరిత భూపతి