Facebook Twitter
రేడియో అక్కయ్య (కథకురాలి కథనం)

 

 

కథకురాలి కథనం

- తురగా జానకీరాణి


           తురగా జనాకీరాణి రేడియో అక్కయ్యగా అందరికి సుపరిచితమైన పేరు. బాలనందం పేరుతో ఎన్నో నాటికలు, రూపకాలు, పాటలు నిర్వహించారు. స్త్రీల సమస్యలకు పరిష్కారాలు చూపుతూ 'ఇది నా సమస్య' అనే శీర్షికను కూడా నిర్వహించారు. అమూల్యమైన బాలసాహిత్యాన్ని సృష్టించారు. నవలలు, కథలు రాశారు. అనువాదాలు కూడా చేశారు. అనేక  సత్కారాలు, అవార్డులు అందుకున్నారు. వీరు రాసిందే 'కథకురాలి కథనం' కథ. భార్యభర్తల మధ్య సంబంధాన్ని స్త్రీకోణం నుంచి అద్భుతంగా చిత్రీకరించారు జానకీరాణి.
         కథలో  సావిత్రి, శర్మ భార్య భర్తలు. శర్మ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. సావిత్రి రచయిత. కథలు రాస్తూ ఉంటుంది. సావిత్రి అందాన్ని చూసి శర్మ ఏరికోరి పెళ్లి చేసుకుంటాడు. సావిత్రి బి.ఎ. చదువుకున్నా ఇంటి దగ్గరే ఉంటూ కథలు రాస్తుంది. ఆమె కథల్ని అన్ని పత్రికలు ప్రచురిస్తుంటాయి. శర్మ కూడా సావిత్రి రాసిన కథలు చదువుతుంటాడు. అసలు శర్మకు పత్రికలు చదివే అలవాటు ఎక్కువే. పెళ్లైన కొత్తలో సావిత్రి కథలు రాయడం మానుకొని, ఆ అనుభుతుల వెల్లువలో మునిగి పోతుంది. రెండు నెలల తర్వాత మళ్లీ కథలు రాయడం మొదలు పెడుతుంది.
           ఒకరోజు శర్మ ఇంటికి ఆలశ్యంగా వచ్చి తిండి కూడా తినకుండా డాబామీద మంచంపై పడుకంటాడు. సావిత్రి కూడా తినదు. డాబామీదకు వెళ్లి, భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనిస్తుంది. భర్త మీదకు వంగి ఆప్యాయంగా 'ఏమిటి ఆలోచిస్తున్నారు. ఎందుకు కోపం' అని అడుగుతుంది. శర్మ సావిత్రిని నిమిలి మింగేసేలా చూస్తూ- 'ఆ రాత్రి ప్రభాకరం ఎక్కడ పడుకున్నాడు' అని అడుగుతాడు. దాంతో సావిత్రి గతానికి సంబంధించిన ఆలోచనల్లోకి వెళ్తుంది.
      ఒకరోజు సావిత్రి కథ రాస్తుంటే శర్మ మెల్లగా దగ్గరకు వచ్చి 'ఇంత గొప్పగా కథలు ఎలా రాస్తావు. నువ్వు నాకు సాధారణ స్త్రీగానే కనిపిస్తాయి. ఇంత విప్లవాత్మకమైన కథలు నువ్వేనా రాసేదనిపిస్తుంది' అని ప్రేమగా అడుగుతాడు. అందుకు సావిత్రి 'నా కథల్లో సంఘటనలు కొన్ని నావి, నే విన్నవి, చూసినవి, కొన్ని నేను అనుభవించినవి ఉంటాయి.  కానీ ఆవేశాలు, మమతలు అన్నీ అనుభవిస్తాను రాసేముందు' అని చెప్తుంది. దానికి శర్మ రచయితలు తాము స్వయంగా అనుభవిస్తేనే బాగా రాయగలరు, రచయితలందరూ స్వానుభవాలే రాస్తారు అని నిర్ణయించుకుంటాడు. కొంత బాధపడతాడు. తర్వాత తేలికపడి, మామూలై పోతాడు. శర్మ ఆఫీసర్లతో సినిమాకు వెళ్లినప్పుడు సావిత్రి స్నేహితురాలు శచి వస్తుంది. ఇద్దరూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటారు. శచి సావిత్రి శర్మ కలిసి దిగిన ఫొటోను చూస్తుంది. దాంతో శచిలో ఆదో విధమైన భావం కలుగుతుంది. ఆమెలోని సందేహం, భయం, విషాదాన్ని గమనించిన సావిత్రి 'ఏమిటి... ఏమైంది' అని అడుగుతుంది. చివరకు శచి రెండేళ్లనాటి గాథ అని చెప్తుంది. అది విన్న సావిత్రి బాధపడదు. ఏడ్వదు. ఒక్క నిట్టూర్పు మాత్రం విడుస్తుంది. శర్మ వచ్చేలోపే శచి వెళ్లిపోతంది.
        ఒకరోజు శర్మ స్నేహితుడు ప్రభాకరం ఇంటికి వస్తాడు. ప్రభాకరానికి సాహిత్యం మీద మంచి పట్టు ఉఁటుంది. ఆ రోజు రాత్రి డాబామీద ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభాకరం దగ్గర సావిత్రి సాహిత్యానికి సంబంధించి చాలా విషయాలు తెలుసుకుంటుంది. అదీగాక శర్మకు ఆరోజు భార్య చాలా అందంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అలా ముగ్గురు మాట్లాడుకుంటుంటే శర్మ మేనమామకు సీరియస్ గా ఉందని టెలిగ్రాం వస్తుంది. శర్మ వెంటనే ఊరికి బయలుదేరుతాడు. సావిత్రి కూడా వస్తానన్నా వద్దంటాడు. ప్రభాకరం కూడా ఆ రాత్రే బయలుదేరు తానంటే భార్యకు తోడు ఉండమని చెప్పి, భార్యను తెల్లవారి బంధువుల ఇంటికి వెళ్లమంటాడు. కానీ సావిత్రికి బంధువుల ఇంటికి వెళ్లడానికి కుదరదు. మేనమామ చనిపోవడంతో పది రోజుల తర్వాత శర్మ ఇంటికి తిరిగి వస్తాడు. హఠాత్తుగా వెళ్లినందుకు ప్రభాకరానికి సారీ చెప్తూ ఉత్తరం కూడా రాస్తాడు. కానీ పదిహేను రోజుల తర్వాత సావిత్రి రాసిన కథ 'ఒక రేయి పొరబాటు' పత్రికలో వస్తే శర్మ చదువుతాడు. ఆ కథలో ఇతివృత్తమే భర్త ఇంట్లో లేనప్పుడు అతని స్నేహితునితో భార్య తప్పు చేయడం.ఆ కథ చదివిన శర్మ మనసు కకావికలమై పోతుంది. ప్రభాకర్, సావిత్రిని ఆ కథలో ఊహించుకుంటాడు.
       శర్మ 'ఆ రాత్రి ప్రభాకర్ ఎక్కడ పడుకున్నాడు అంటే...' చెప్పదు. 'జస్ట్ ఇమేజినేషన్' అని ఆటపట్టిస్తుంది. చివరకు 'మీరు సినిమాకు వెళ్లినప్పుడు, నా స్నేహితురాలు శచి వచ్చింది. మీరు మద్రాసులో వారి ఇంటికి వెళ్లడం, ఆ రోజు ఆమె భర్త సెక్రటేరియట్ లో పని ఉండి రాకపోవడం, ఆమె బీచ్ కు వెళ్తే.. మీరు వెన్నంటి వెళ్లారు. చివరకు ఆవేశ పూరితురాలైన శచితో...' అని బాధపడుతుంది. చివరకు మౌనంగా ఉన్న శర్మ.. 'నన్ను క్షమించు సావిత్రీ' అని ప్రాదేయపడతాడు. 'ఇకనుంటి నీ కథల్లో నా జీవితాన్ని వెతుక్కోవడం మానేస్తాను' అని
అంటూ ఆమె తల్లోని పూల వాసనను పీల్చుకుంటాడు.           
              వ్యవహారిక భాష, కథ ప్రారంభంలోనే ట్విస్టు, చివరిలో ఆ ట్విస్టును విప్పడం అద్భుతమైన కథా శిల్పం. పాత్రల మానసిక సంఘర్షణ, సావిత్రిలోని ఉదారమైన భావాలు, శర్మలో ఉంటే అనుమాన బీజాలు...ఇలా కథంతా ఓ పకడ్బందీగా సాగింది. అందుకే ఎక్కడా పాఠకుడి మనసు పక్కకు మల్లదు. అందుకే ఈ కథను ఎప్పుడు చదివినా స్త్రీ మనసు లొని గొప్పతనం ఇంకా ఇంకా తెలుస్తూనే ఉంటుంది.    

.......డా. ఎ.రవీంద్రబాబు