Facebook Twitter
ఫౌల్... ఫౌల్ (కథ)

 

ఫౌల్... ఫౌల్ (కథ)


- జంపన పెద్దిరాజు


              కాలం అప్పుడప్పుడు కుట్రలు చేస్తుంది. ఒక బాలగంగాధర తిలక్, ఒక శారద (నటరాజన్), ఒక త్రిపురనేని శ్రీనివాస్ ఇలా తెలుగు సాహిత్యంలో గొప్పవాళ్లగా ఎదిగే వాళ్లను కబళిస్తుంది. అలా మరణం తన దగ్గరకు తీసుకున్న వారిలో జంపన పెద్దిరాజు ఒకరు. 24 సంవత్సరాలకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అప్పటికి అతను రాసింది మూడు కథలే మంచం, దేవత, ఫౌల్... ఫౌల్. ఈ కథ విద్యార్థి కథల సంపుటిలో ముద్రితమైంది. ఒక సినిమా పాట కూడా రాశారు. కాలం పురోగమిస్తున్నా, అంతా సుఖంగా ఉంది అంటే నేను నమ్మను, బతికున్న మనిషిని నాకొక్కడిని చూపించు... అని తన కవిత ద్వారా అభివృద్ధికే సవాల్ విసిరిన కథా రచయిత, కవి జంపన పెద్దిరాజు. వీరు రాసిన ఫౌల్... ఫౌల్ కథ ఓ క్రీడాకారిని మనసు సంఘర్షణకు అద్దం పడుతుంది. మనుషుల్లోని లోపాన్ని సూటిగా ప్రశ్నిస్తుంది.
         కథలోకి వెళ్తే- లా కాలేజ్ గ్రౌండ్ లో టెన్నిస్ పోటీలు జరుగుతుంటాయి. ఆ యూనివర్శిటీ ప్లేయర్ మిస్ టానియా ఆడుతుంటుంది. ఆ ఆడ టెన్నిస్ చూడడానికి వందలు వేలు జనం వస్తారు. కార్లు, స్కూటర్లు, సైకిళ్లు, పెద్దలు, ముసలాళ్లు అంతా టెన్నిస్ చూడ్డానికి వస్తారు. అలా మూడు రోజుల నుంచి టెన్నిస్ తార టానియా పేరు మారు మోగుతుంటుంది. టెన్నిస్ కోర్టులోని ఆమె ప్రతి కదలికను మింగుతూ ఉఁటాయి కొన్ని వేల కళ్లు, కొన్ని వందల కళ్లజోళ్లు. అలా టానియా హిప్ హిప్, టానియా జిందాబాద్ ల మధ్య మద్రాసు పై రెండుసెట్లు వరసగా తీసుకొని ఫైనల్స్ కు వస్తుంది టానియా. గెలవగానే జనం చప్పట్లు, అంపైర్ ఆంజనేయుడిలా ఉబ్బిపోతాడు. వాలంటీర్ల హడావుడి. టానియా చేతిని గుళ్లో గంటలా, పూజారి తీర్థంలో అభిమానులు ముట్టుకొని పోతుంటారు. ఖరీదైన మూడు నల్లకొట్లు తొడుక్కున్న వాళ్లు టానియాను రాత్రికి డిన్నర్ కు ఆహ్వానించారు. టానియా రెండు డిన్నర్లకు వెళ్తుంది. ఒక డిన్నర్ లో తిని, రెండో డిన్నర్ లో తప్పదన్నట్లు యాపిల్స్, సలాడ్ మాత్రమే తీసుకొని తన రూమ్ కు వచ్చి పడుకుంటుంది.
          పడుకున్న టానియాకు పదకొండు అయినా నిద్రపట్టదు. కడుపులో ఏదో వికారంగా అనిపిస్తుంది. నైట్ గౌను వేసుకొని మిస్ టానియా తన రూమ్ నుంచి బైటకు వస్తుంది. అన్నిటిని దాటుకుంటూ టెన్నిస్ కోర్టుకు వెళ్తుంది. కోర్టులో విరిగిపోయిన కుర్చీలు మధ్యతరగతి జీవితాల్లా ఉంటాయి. ప్యూడల్ వ్యవస్థకు ప్రతిబింబాల్లా గొప్పవాళ్లకోసం ప్రత్యేకించబడ్డ సోఫాలు, కుర్చీలు మంచుతాగి నిద్రపోతుంటాయి. వ్యభిచారి వేసుకున్న లిప్ స్టిక్ లా స్కోరు బోర్డు తగిలించుకొన్న విల్స్ అడ్వర్ టైజ్ మెంట్ కనిపిస్తాయి. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. టానియాకు మనసు చికాగ్గా అనిపిస్తుంది. దూరంగా మూడు ఆకారాలు మాట్లాడుకున్నట్లు అనిపించి అక్కడకు వెళ్తుంది. వాళ్లు కోర్టులో మట్టిని సరిచేస్తూ... తట్టలతో మట్టి ఎత్తి పోస్తుంటారు. వాళ్లలో ఒక ఆమె దగ్గితే రక్తం పడుతుంది. మంచినీళ్లు లేవా అని మరొకామెను అడుగుతుంది. టానియా మట్టి గడ్డకట్టిన రక్తాన్ని చూస్తుంది. వాళ్ల బట్టలు, వాళ్ల శ్రమ, వాళ్ల శరీరాల్ని చూసి చలించిపోతుంది. అందరూ నిద్రపోతుంటే వాళ్లెందుకు పనిచేయాలని ప్రశ్నించుకుంటుంది. రక్తం కక్కిన తిరుపతి తట్ట ఎత్తలేకపోతే తను పైకి లేపబోతుంది. కానీ టానియా ఆ తట్టను మోయలేక పోతుంది. ఈ పనులు చదువుకునే వాళ్లు చేసేవి కాదు అని చెప్తారు వాళ్లు. దాంతో టానియా మనసు వివిధ రకాలుగా ఆలోచిస్తుంది. కొంత టెక్నిక్ తో టెన్నిస్ ఆడితేనే తనకు అంత గుర్తింపు వచ్చింది. మరి బరువులు మోయడంలో వీళ్లకు గొప్ప ప్రావీణ్యం ఉంది, నిద్రలేకుండా, రక్తం కక్కుతున్నా బరువులు మోయడం సామాన్య విషయం కాదని అనుకుంటుంది. అంతలో మట్టి తట్టఎత్తుకున్న తిరుపతి కిందపడిపోతుంది. తల పగిలి రక్తం వచ్చేస్తుంది. అక్కడి కక్కడే టానియా ఆడే టెన్నిస్ రాకెట్ ఖరీదు కూడా చేయని తిరుపతి చచ్చిపోతుంది. టానియా రూమ్ కు వచ్చి సముద్ర కెరటంలా, ఆకు కదలని చెట్టులా, మనసులేని మనిషిలా... జీవంలేని శవంలా పడుకుంటుంది.
          మరసటి రోజు ఇదేమీ పట్టనట్లు, తిరుపతి చచ్చిపోయినా తెలియనట్లు ఆర్గనైజర్స్ హడావుడితో టెన్నిస్ ఫైనల్ స్టార్ట్ అవుతుంది. ఫైనల్ కావడంతో స్కూళ్లకు, కాలేజ్ లకు, ఆఫీసులకు పండగ. ముందురోజుల్లానే కార్లు, సైకిళ్లు, కోట్లు, చీరలు, బ్లౌజులు... జనం జనం జనం టానియాను చూస్తుంటాయి. టానియా ఆటను చూస్తుంటాయి. టానియా శరీరం మాత్రం టెన్నిస్ ఆడుతుంటుంది. కానీ ఆమె హృదయం మాత్రం సైగల్ గొంతులోని విషాద ఘోషలా ఉంటుంది. మొదటి సెట్టు ఎదుటి అమ్మాయి గెలుస్తుంది. దాంతో జనాల్లోంచి అరుపులు- టానియా కొట్టు, టానియా బీకేర్ ఫుల్, టానియా డోన్ట్ వర్రీ... కానీ టానియా మాత్రం ఆడలేక పోతుంది. తిరుపతమ్మ కక్కిన రక్తం గడ్డకట్టిన మట్టి కళ్ల ముందు కనిపిస్తుంది. ఆమె చావు టానియా మనసులో గిర్రున తిరుగుతుంటుంది. టానియాకు ఈ రోజు ఆట ఆపేయాలని పిస్తుంది. తిరుపతమ్మకు సంతాపం ప్రకటించాలని ఉంటుంది. గట్టిగా మైక్ దగ్గరకు వెళ్లి అరవాలనిపిస్తుంది. కానీ నిశ్శబ్దం. ఏమీ చేయలేదు. అతి కష్టం మీద రెండో సెట్టు నెగ్గుతుంది. మూడో సెట్టు మళ్లీ అవతలి అమ్మాయి గెలుస్తుంది. అంతలో టానియా చూపు తిరుపతమ్మ రక్తం కక్కిన చోట పడుతుంది. అంతే టానియాకు ఆట మానేసి ఎటన్నా వెళ్లిపోవాలని అనిపిస్తుంది. సర్వీస్ ఫౌల్ అవుతుంది. అంపైర్ ఫౌల్ అని అరుస్తాడు... కానీ టానియాకు మాత్రం నేను కొట్టిన బాల్ కాదు, ఈ లోకం ఫౌల్, ఈ జనం ఫౌల్, వీళ్ల తెలివి ఫౌల్, వీళ్ల కార్లు ఫౌల్, వీళ్లంతా ఫౌల్ అని అరవాలనిపిస్తుంది. ఒక్క బాల్ టానియా నుదుటి మీద తగులుతుంది. నిద్రలేక పోవడంతో, కళ్లు తిరిగి కిందపడుతుంది. జనాలంతా టానియాను పైకి లేపి ఫేకల్టీ క్లబ్ కు తీసుకెళ్తారు.. ఏమైంది... ఏమైంది... అని అభిమానాన్ని కురిపిస్తారు. నాకు ఏమి కాలేదని టానియా చెప్పినా వినరు. ఆదుర్దా పడతారు. కానీ  టానియా మాత్రం చచ్చిపోయిన తిరుపతికి, ఆమె పిల్లలకు దిక్కులేదు. ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. వీళ్ల అభిమాన ప్రవాహం మట్టి తట్టల వైపు ప్రవహించడం మానేసి, ఈ టానియాలాంటి నగరాలపై పడడం నిజంగా అసలైన ఫౌల్ ఫౌల్ ఫౌల్ అని లోలోపల అరుస్తుంది. ఇవన్నీ పట్టించుకోని గడియారం తాఫీగా నడుస్తుంది.
      ఇలా కథంతా అద్బుతమైన సరికొత్త వర్ణనలతో నడుస్తుంది. రచయిత కవి కావడం వల్ల సరికొత్త అభివ్యక్తులను ప్రయోగించారు. కథ చదివిన అనుభూతి కంటే, కవిత్వం చదువుతున్న అనుభూతి కలుగుతుంది. పాఠకులు ఏ ఒక్క వాక్యాన్ని మిస్ కాలేరు. ఒక ప్రవాహంలా కథ మనల్ని చుట్టుముట్టి చంపేస్తుంది. అయి పోగానే ఓ భావం మనలో నిబిఢీకృతం అయిపోతుంది. ఇతివృత్తం మొత్తం టెన్నిస్ చుట్టూ తిరిగినా, కథలో అంతర్లీనంగా శ్రమ గొప్పదనం, శ్రామికుల జీవితం కనిపిస్తుంది. అదే కథకు ప్రాణం. శిల్పం దృష్ట్యా కూడా ఇదో అరుదైన కథ అని చెప్పాలి.

........డా. ఎ.రవీంద్రబాబు