Facebook Twitter
సాహిత్య లోకానికి తేజోమయంశారద (నటరాజన్)

 

సాహిత్య లోకానికి తేజోమయం
శారద (నటరాజన్)

 



     పుట్టుకతో తమిళియన్. కానీ ఎక్కువ జీవితాన్ని గడిపింది ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో. అనుభవించింది కటిక దారిద్ర్యం. చేసింది హోటల్లో సర్వర్ ఉద్యోగం. పిడికెడు మెతుకులకోసం ఎన్నో కష్టాలు. కానీ తెలుగు సాహిత్య లోకానికి తేజోవంతమైన రచనలు చేశాడు. అపూర్వమైన వచన రచనలు అందించాడు. పేదరికంలోంచి, జీవనపరిస్థితుల్లోంచి కడగండ్లనే అక్షరాలుగా మనకు అందించిన రచయిత శారద. అసలు పేరు నటరాజన్. అతి తక్కువకాలంలోనే శాశ్వతంగా నిలిచే కథలు, నవలలు రాశాడు.
     నటరాజన్ జన్మస్థలం తమిళనాడులోని పుదుక్కోట. తల్లి బాగీరథి, తండ్రి సుబ్రహ్మణ్యయ్యరు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయారు నటరాజన్. ఇద్దరు అక్కలు తెనాలిలో ఉండడం వల్ల పన్నెండేళ్ల వయసులో తండ్రిని తీసుకొని తెనాలి వచ్చాడు. జోలెపట్టి దేవాలయాల చుట్టూ తిరిగాడు, వారాలు చేసుకున్నాడు. చివరకు తండ్రి పోషణార్థం హోటల్లో సర్వర్ గా చేరాడు. అయినా నిత్య దారిద్ర్యం. దాంతోపాటు నటరాజన్ ను మూర్ఛరోగం వేధించేది. ఇదాంతా ఒక ఎత్తైతే నటరాజన్ చిన్నప్పటి నుంచి సాహిత్యాభిమాని. తెనాలి వచ్చేనాటికే తమిళంలో అనేక పుస్తకాలు చదివారు. తెనాలి వచ్చాక సొంతగా తెలుగు అక్షరాలు నేర్చుకున్నాడు. పురాణాలు, ప్రబంధాలు, ఆధునిక సాహిత్య పుస్తకాలు చదువుకున్నాడు. చలం నుంచి కొడవటిగంటి కుటుంబరావు వరకు, విశ్వనాథ నుంచి త్రిపురనేని రామస్వామి వరకు, గోరా నుంచి శ్రీశ్రీ వరకు అందరి పుస్తకాలను ఇష్టపడ్డాడు. పైగా ఆరోజుల్లో వచ్చిన అ.ర.సం. (అభ్యుదయ రచయితల సంఘం)తో సంబంధాలు కొనసాగించాడు. తెనాలిలోని లైబ్రరీనే అతనికి ఆరాధ్యదేవతయ్యింది.
    నటరాజన్ పేదరికంలో మగ్గుతున్నా సాహిత్య అభిలాషను మాత్రం వదులుకోలేదు. ప్రజావాణి అనే రాతపత్రికను నడిపారు. కొంతకాలం చంద్రిక పత్రికనూ కొనసాగించారు. అలానే నవలలు, కథలు రాశారు. వీరి మొదటి కథ ప్రపంచానికి జబ్బుచేసింది 1946లో ప్రజాశక్తిలో ముద్రితమయ్యింది. అప్పటి నుంచి శారద రచనలు తెలుగు స్వతంత్ర, జ్యోతి, విశాలాంధ్ర, యువ, రేరేణి వంటి పత్రికల్లో వచ్చాయి. 1950లలో వీరి నవల ఏది సత్యం వచ్చిన నెలలోనే ప్రతులన్నీ అమ్ముడుపోయి సంచలనం సృష్టించింది. వీరి రచనలు వస్తు, శిల్పరీతుల్లో చాలా గొప్పవి. నటరాజన్ 1948 నుంచి 1955 వరకు అంటే ఏడేళ్ల కాలంలోనే తెలుగు సాహిత్యంలో నిలిచే రచనలు చేశాడు. పదిపన్నెండు నవలలు, వందకు పైగా కథలు రాశారు. మన దురుద్రుష్టం ఏమిటంటే- వాటిలో ఇప్పుడు కొన్ని దొరకడం లేదు.రక్తస్పర్శ కథా సంపుటి, శారద నవలలు, శారద రచనలు అనే మూడు పుస్తకాల రూపంలో వీరివి కొన్ని రచనలు దొరుకుతున్నాయి. కథా వస్తువులో, సంవిధానంలో పరిణతి చెందిన రచయిత శారద. కథను చెప్పినట్లు కాకుండా చూసినట్లు చెప్పేవాడు. అందుకే శిల్పప్రజ్ఞ, సునిశిత దృష్టితో కనిపిస్తాయి వీరి కథలు.    
           శవం విలువ కథలో సున్నిత మనస్కుడు అయిన అర్జునరావు, శవంతో ఏడుస్తున్న ఇద్దరు మహిళలను చూసి చాలా స్పందిస్తాడు. పైగా పోలీసుకు ఈ విషయాన్ని చెప్తాడు. పోలీసు మాత్రం బతికున్నప్పుడు చెయ్యాలి సాయం కానీ, చనిపోయాక కాదు అని పట్టించుకోడు. రాత్రికి వచ్చిన అర్జునరావుకు అది శవం కాదని, వాళ్లిద్దరు స్త్రీలు నాటకం ఆడారని తెలిసి ఆశ్చర్యపోతాడు. అలానే మరలోచక్రం కథలో ఓ స్త్రీ ఆదర్శాలు వల్లించే భర్త, అన్న, తండ్రి నుంచి దూరంగా హోటలు అతనితో వెళ్లిపోతుంది. నాకు ఆదర్శాలు అక్కర్లేదు, అతనికి నేను అవసరం, ఆదర్శాలు అక్కర్లేదు, సాధ్యమయినంత వరకు నన్ను బాగా చూసుకుంటున్నాడు అని సమాధానం ఇస్తుంది. స్వాతంత్ర్య స్వరూపం కథలో ఓ శిల్పి అందరి అధికారుల, రాజకీయ నాయకుల అభిప్రాయాలతో తయారు చేసిన స్వాతంత్ర్య విగ్రహాన్ని ఆయుధాలతో కూడిన దెయ్యంలా వర్ణిస్తాడు శారద. సంస్కరణ కథలో హరిజనుల దేవాలయ ప్రవేశాన్ని, స్త్రీ స్వాతంత్ర్యాన్ని చర్చిస్తూ- అణగారిన వాళ్లకు అన్నం పెట్టించాలి. చదువులు చెప్పించాలి. గానీ దేవాలయ ప్రవేశం ఎందుకు... ఉన్న మతి పోవడానికా... అని ప్రశ్నిస్తాడు. సంస్కరణల్లో ఉన్న లోపాలను నిజాయితీగా ఎత్తిచూపుతాడు. ఇలా వీరి కథలన్నీ సమాజాన్ని నగ్నంగా, కుహనా విలువలను విమర్శిస్తాయి. అసలు సమస్య, గొప్పవాడి భార్య, కోరికలే గుర్రాలయితే, అసలు సమస్య, రక్తస్పర్శ, వింత ప్రకృతి, స్వార్థపరుడు, క్షణంలో సగం, దేశమును ప్రేమించుమన్న, కొత్తవార్త, వింతలోకం, ఎగిరే పళ్ళెం, లోహపు బిళ్లలు ఇలా ప్రతి కథా ఓ ఆకలి లాంటిదే. ఆత్రుతగా చదవ మంటుంది. ఆక్రోషాన్ని, ఆవేశాన్ని, నిజాన్ని చెప్తుంది.
ఏది సత్యం, అపస్వరాలు, మంచీ చెడు వంటి నవలలు అప్పటికీ ఇప్పటికీ సమాజంలోని చీకటి కోణాలను, వ్యక్తుల మధ్య తిరగాడే ఆలోచనల పరంపరను వివరిస్తాయి. ఏది సత్యం నవలలో పార్వతి భర్త సాంబశివరావుకు రైస్ మిల్లులో కాలు విరిగితే కుటుంబ బాధ్యతను తనే నెత్తికి ఎత్తుకుంటుంది పార్వతి. కానీ భర్త క్రమక్రమంగా అవమానిస్తాడు, అనుమానిస్తాడు. అతనికి శరీరమే కాదు మనసు అవిటిదని శారద చెప్పకనే చెప్తాడు నవలలో. మంచీ చెడు నవలలో యాభై ఏళ్ల భద్రయ్య ఇరవై ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొడుకు ఏమీ మాట్లాడడు. అలానే భద్రయ్య స్నేహితుడు సుదర్శనం భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆమె మొదటి భార్య కూతురిని నానా కష్టాలు పెడుతుంది. ముఖం కూడా కాలుస్తుంది. ఇలా ఆ రెండు కుటుంబాల మధ్య జరిగే అనేక సన్నివేశాలను, సంఘటనలను శారద అద్భుతంగా రాస్తారు. మొత్తంగా వీరి నవలల్లో కూడా మనుషులు, ధనం, మానవీయ విలువలు, అప్పుడే ప్రవేశించిన పెట్టుబడీదారి సమాజంలోని స్థితిగతులు...స్వభావం ఉంటుంది.
      మొత్తంగా శారద రచనలు అన్నీ ఆనాటి సమాజానికే కాదు, ఈనాటి సమాజానికి ఎంతో అవసరం. మనిషి తనను తాను అంచనా వేసుకోడానికి, నిర్దేశించుకోడాని, రుజుమార్గంలో నడవడానికి అవసరం.   
                                                 

........డా. ఎ.రవీంద్రబాబు